ఈవారం కథ: క్రతువు
ఆంధ్రాబ్యాంక్ దొండపాడు బ్రాంచికి మేనేజరుగా కొత్తగా పోస్టు చేశారు నన్ను. గుడివాడలోని ఎకామడేషన్ను కంటిన్యూ చేస్తూ ఆ బ్రాంచిలో చేరి రెండురోజులైంది. నా భార్య పేరు హారతి. అలా హారతి, నైవేద్యం అంటే నచ్చక రొమాంటిక్‌గా నేను పిలుచుకునే పేరు రతి.
జాగింగ్ పూర్తి చేసుకొని ఇంటికి చేరేసరికి నాన్న హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఆశ్చర్యంతో పక్కనే కూర్చొని.. ‘ఏంటి నాన్నా, చెప్పా పెట్టకుండా?’ అన్నా.
‘పర్మిషన్ తీసుకురావాలేట్రా?’ పక్కనే టీపాయ్ మీదున్న ఓ ఫోటోఫ్రేమ్ తీసి చేతికిస్తూ అన్నారు. ‘ఈ ఫ్రేమ్ ఎవరికన్నా చూపించు. స్క్రూ ఊడిపోయినట్లుంది’
అది అమ్మ ఫోటో. నిండుగా, అందంగా ఉంటుంది అమ్మ. నేను డిగ్రీలో ఉండగా చనిపోయింది.
‘అలానే నాన్నా.. సాయంత్రం తీసుకెళ్తాను. మార్కెట్‌కు ఇటువైపు వెళ్ళాలి’ అంటూ దాన్ని రతికి ఇచ్చి అరగంటలో రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకొని బయట పడ్డాను.
∙∙
‘సార్.. కొత్తగా వచ్చారా? ’ అడిగింది ఓ కస్టమర్.. నర్స్ డ్రెస్‌లో ఉంది.
ఆథరైజ్ చేసిన చెక్కును స్పైక్ చేస్తూ చెప్పా ‘అవును మేడమ్’ అని.
‘నేను గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్‌ని సార్. పాత మేనేజర్గారిని హౌసింగ్ లోన్ ఆడిగాను. ఈలోగా ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది..’
దఫ్తరిని పిలిచి హౌసింగ్‌లోన్ అప్లికేషన్ తెప్పించి ఇస్తూ అన్నాను ‘ఇంజనీర్ ఎస్టిమేషన్, అప్రూవ్డ్ ప్లాన్, లేటెస్ట్ శాలరీ స్లిప్ ఇవ్వండి ’ అని.
‘అలానే సార్. హాస్పిటల్లో పనేవన్నా ఉంటే రండి సార్. పెద్ద హాస్పిటల్. సండే ఉంటాను. శాటర్డే ఆఫ్ నాకు’ అంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది ఆమె. గవర్నమెంట్ హాస్పిటల్లో పనేముంటుంది నాకు అనుకుంటూ.. నవ్వుకున్నా.
కాసేపటికి ఓ క్రాప్‌లోన్ బారోయర్ వస్తే బాకీ గడువైపోయింది కట్టేయమన్నా...
‘మేనేజర్ గారూ.. కావాలంటే మా ఆవిడ పేరు మీద డిపాజిట్ చేసుకోండి. కట్టమనొద్దు. రుణమాఫీ వస్తోంది కదా’ నవ్వుతూ వెళ్ళిపోయాడు.
ఆరోజు లంచవర్లో మెయిల్స్ చూసి ఉలిక్కి పడ్డాను.. ‘న్యూలీ పోస్టేడ్ బ్రాంచ్ మానేజర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం హైదరాబాదులో’ అనే మెయిల్‌కి రిమైండర్ అది. ఆఫీసర్ని అడిగితే ‘మీరు చూశారనుకున్నాను సార్’ అన్నాడు నవ్వుతూ. హెచ్ఆర్కు ఫోన్ చేశాను. సాయంత్రం గుడివాడ బ్రాంచ్ నుంచి ఆఫీసర్ వచ్చి నన్ను రిలీవ్ చేశాడు.
∙∙
ఇల్లు చేరేసరికి రతి లిఫ్ట్ దగ్గర ఉంది. గబగబా దగ్గరకు వెళ్లాను. నాన్న బాలాజీ టెంపుల్‌కి వెళ్లారని చెప్పింది.
‘మరి నువ్వెక్కడికెళ్ళావ్?’ అని అడిగా. ఫ్లాట్ లాక్ తీశాక చేతిలో ఉన్న బాగ్‌లోంచి ఉదయం నాన్న ఇచ్చిన అమ్మ ఫోటోఫ్రేమ్ తీసి నా చేతిలో పెట్టింది.
‘మంచిపని చేశావ్. బ్యాంక్‌లో ఆలస్యం అయిందిరా. నన్ను చూస్తే నాన్న అడిగేవారు’ అంటూ ఆ ఫ్రేమ్ తీసుకెళ్ళి నాన్న గదిలో ఉంచాను. నాన్న వచ్చేసరికి ఎనిమిది దాటింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్నప్పుడు చెప్పాను మండే నుంచి హైదరాబాదులో ట్రైనింగ్ ఉంది. వెళ్లక తప్పదని.
∙∙∙
‘ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదు. విజయవాడ నుంచి సాయంత్రం బస్సుకి వెళ్ళడమే’ అన్నాను.
‘సరే.. అయితే దుర్గమ్మ దర్శనం చేసుకొని, బస్సు ఎక్కించి వచ్చేస్తామ’న్నారు నాన్న. అమ్మవారి దర్శనం అంటే రతి కూడా రెడీ అంది. నవ్వుతూ నాన్నని నిజం చెప్పమన్నాను.
‘అది కాదురా.. నా చిన్నప్పటి స్నేహితుడు చలపతి.. విజయవాడలో చిల్డ్రన్ ఎడాప్షన్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చే నెల రిటైరయ్యి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు వాళ్ళబ్బాయి దగ్గరకి. మళ్లీ ఎప్పుడు కలుస్తాడో’ అంటూ అసలు విషయం చెప్పారు.
సరే తప్పదనుకొని ఓ గంటలో నాన్ స్టాప్ బస్సు ఎక్కేశాం. విజయవాడ బస్ కాంప్లెక్స్ క్లోక్ రూమ్‌లో సూట్‌కేస్ ఉంచి దుర్గమ్మ దర్శనానికి వెళ్ళాం. భోజనం చేసి పటమట ‘శిశువిహార్’ చేరుకునేటప్పటికి మధ్యాహ్నం రెండు.
‘ఎడాప్షన్కి ఎవరైనా వస్తుంటారా చలం?’ టీ తాగిన కప్పు బల్లపై పెడ్తూ అడిగారు నాన్న.
‘వస్తుంటారా? దాదాపు యాభై అప్లికేషనులు రెడిగా ఉన్నాయి’ చెప్పారు ఆయన.
‘మరి వీళ్లిక్కడే ఉన్నారేం?’ అడిగింది రతి. అక్కడున్న పిల్లలను ఉద్దేశించి. అంతకుముందే
మేం తెచ్చిన పళ్ళు,బిస్కట్లు, చాక్లెట్లు పట్టుకొని పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కాసేపు గడిపి వచ్చిందామె.
‘ఫార్మాలిటీస్. ఎడాప్షన్లో ప్రోసీజర్ ఎక్కువ. దీనికి తోడు అడిగే వాళ్ళ ప్రయారిటీస్’ చెప్పారు చలపతి.
ఎవరో పసిపిల్లల ఏడుపు వినబడుతుంటే ఆయా బయటకు వెళ్ళింది. బయట కోలాహలం ఎక్కువై చలపతిగారు లేచి వెళుతుంటే మేం కూడా ఆయన్ని అనుసరించాం. కాంపౌండ్ వాల్కి ఓమూల అందరూ గుంపుగా ఉన్నారు గోలగోలగా మాట్లాడుకుంటూ. మధ్యలో పసిపిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్న ఏడుపు వినిపిస్తోంది. దగ్గరగా వెళ్ళి చూసి నోట మాటరాక నిలబడిపోయాం.
అక్కడ నేలమీద తెల్లటి గుడ్డపై ఇద్దరు శిశువుల దేహాలకు పట్టిన చీమలని దులుపుతున్నారు ఆయాలు.
‘మైగాడ్’ అంటూ నాచేతుల్ని బలంగా పట్టుకుంది రతి. ఆమె చేయి వణుకుతోంది.
ఆ పసిబిడ్డల శరీరాలు ఎర్రగా కందిపోయాయి. వాళ్లు ఆడపిల్లలు. వాళ్ల మీద పాకుతున్న ఎర్రటి చీమల్ని చూడలేక రతిని ఆఫీసురూమ్లోకి తీసుకు వచ్చేశాను.
‘ఇదిరా.. ఇక్కడి పరిస్థితి. కన్నవాళ్లు ఇంత కసాయిగా ఎలా ఉంటారో అర్థంకాదు’ అంటూ పోలీస్ స్టేషన్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పారు చలపతి.
నాకయితే అక్కడ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదనిపిస్తోంది. రతి ఇంకా నా భుజాన్ని అలా గట్టిగా పట్టుకునే ఉంది. ఆ చేయి ఇంకా వణుకుతూనే ఉంది. మొత్తానికి హైదరాబాద్ బస్సు ఎక్కేశాను.
సోమవారం నుంచి ట్రైనింగ్ క్లాసులు మొదలయ్యాయి. మిస్డ్కాల్స్ చూసి నాన్న గుడివాడలోనే ఉన్నారు కదా అని ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేశాను. రెండు సార్లూ నాన్నే తీశారు. ట్రైనింగ్ విషయాలు అడగడం.. ఏదో చెప్పబోయి ఆగిపోవడం. రతి కూడా అంతే. నాన్న ఎదురుగా ఉన్నారు కదా అనుకున్నాను. ట్రైనింగ్ పూర్తయి శుక్రవారం సాయంత్రమే ఇమ్లీబన్‌లో బస్సెక్కేశాను. మర్నాడు సెకండ్ శాటర్డే, హాలీడే. విజయవాడలో బస్సు మారి గుడివాడలో బస్సు దిగేసరికి ఉదయం పది గంటలయింది. బయటకు నడుస్తుండగా హెడ్ నర్స్ కనిపించింది విజయవాడ వెళ్తూ. కానీ ఆమె చెప్పిన మాటలు విన్నాక తల తిరిగిపోయింది నాకు.
∙∙
‘ఇంతకు ముందు ఇలానే రెండు సార్లు వెళ్లిందిరా శిశువిహార్‌కి! మీకు పిల్లలు పుట్టరని.. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని మీకు దత్తత ఇచ్చేయమని చలపతిని అడిగిందట’ అని చెప్పారు నాన్న. విన్న నాకు మరింత కోపం పెరిగింది. తన ఫోన్‌కు రింగ్ చేశాను. ఫోన్ ఇంటి దగ్గరే వదిలేసి మరీ వెళ్ళింది రతి.
‘మరో సంవత్సరం తర్వాత పిల్లలని ప్లాన్ చేసుకున్నాం నాన్నా.. అంతే. మాకు పిల్లలు పుట్టకపోవడమేవిటి? నాన్సెన్స్. ఈ వారం రోజుల్లో దెయ్యం ఏదన్నా పట్టిందా? గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లిందట ట్యూబెక్టమీ చేయమని’ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నాకు కష్టంగా ఉంది.
నాన్న ఏదో అనేలోగా ఆయన సెల్ మోగింది. తాను లిఫ్ట్ చేసి అవతలి నుంచి చెప్పింది విని ఆ ఫోన్ నాకు ఇస్తూ ‘చలపతి.. నీతో మాట్లాడతాడంట’ అన్నారు నాన్న.
‘అదే బాబూ.. ఎడాప్షన్ గురించి. సూర్యం నీకు చెప్పే ఉంటాడు. ఇవ్వాళయితే అమ్మాయి గొడవచేసి, ఏడ్చి మరీ పట్టుకోస్తోంది పిల్లలని. మీ నాన్న, నీ స్టేటస్ కూడా నాకు తెలుసు. కానీ లీగల్ ప్రోసీజర్ చాలా ఉంటుంది. ముందు మీకు పిల్లలు పుట్టరని డాక్టర్ సర్టిఫికెట్ కావాలి. నీ నిర్ణయం కావాలి. బాగా ఆలోచించు. ఆ పై ఆ పిల్లల అదృష్టం. మేగ్జిమమ్ ట్రై చేద్దాం’ అంటూ ఆయన ఇంకా ఏదో చెపుతున్నారు కానీ వినలేక సెల్‌ఫోన్ నాన్నకి ఇచ్చేశాను.
కాసేపటికి లిఫ్ట్ ఆగిన చప్పుడైంది. నిముషం తరువాత వాచ్‌మేన్ భార్య తెల్లటి టర్కీటవల్లో ఒక పసిబిడ్డని తీసుకొని లోపలకు వచ్చింది. వెనుకనే మరో టర్కీటవల్‌తో రతి లోపలకు అడుగు పెట్టి ఇద్దరూ మా బెడ్రూమ్లోకి వెళ్ళారు. వాచ్‌మేన్ భార్య ఖాళీ చేతులతో బయటకు వచ్చి మావంక అదోలా చూసుకుంటూ వెళ్ళిపోయింది. తెరచిన మెయిన్డోర్లోంచి ఎదురుగా ఉన్న పోర్షన్ వంక చూశాను. తాళం వేసి ఉంది.
నిముషం తర్వాత రతి బయటకు వచ్చి అడిగింది‘ఎప్పుడొచ్చారు?’ అని.
‘ఆ ఆడపిల్లల్ని ఇంటికి తీసుకోచ్చేశావా?’ తెలియకుండానే గట్టిగా అరిచాను.
ఉలిక్కిపడింది ఆమె. నాన్న.. నా వంక ఓసారి చూసి లోపలకు వెళ్ళిపోయారు.
‘అవును. అక్కడ ఉంచితే వీళ్ళ భవిష్యత్తు నాశనం అయ్యేలా ఉంది’ అంది రతి.
‘వాళ్లేమైనా నీకన్న పిల్లలా?’ మళ్ళీ అరిచాను. ‘అక్కడే వదిలేసి వద్దాం పద’ కోపాన్ని తమాయించుకుంటూ చెప్పాను.
‘తీసుకెళ్ళి వదిలేయడానికి కాదు తెచ్చింది. గట్టిగా అరవకండి. పిల్లలు భయపడతారు’ నావంకే సూటిగా చూస్తూ అంది రతి.
నాకు కంట్రోల్ తప్పింది.. ‘ఎవరికి పుట్టారో, ఎలా పుట్టారో? పెరట్లో పారేసిన ఎంగిలి బతుకుల్ని ఇంట్లోకి తెచ్చిపెట్టి అరుస్తున్నానంటావా? పేడ పిసుక్కుని పిడకలేసే బుద్ధి పోనిచ్చావు కాదు’ ఇంకా ఏదో అనబోతుంటే చివ్వున చూసింది రతి.
‘రేపటి నుంచి నేను బయట తలెత్తుకు తిరగాలా లేక ఉరేసుకు చావాలా? మనమేంటి, మన సోషల్స్టేటస్ ఏంటి?ఎవరు చెప్పారే ఈడియట్.. ఇలాంటి అలగా పనులు చేయమని?’ ఆవేశంతో ఉగిపోతున్నాన్నేను.
‘అత్తయ్య చెప్పారు. మాటలు విసరకండి ఇది బెడ్ రూమ్ కాదు’ ఎర్రబడ్డ కళ్ళతో నావైపు చూస్తూ బెడ్ రూమ్‌లోకి వెళ్ళింది రతి. ఈలోగా నాన్న తన గది తలుపు తీసుకొని కంగారుగా బయటకు వచ్చారు.
అంతలో విసురుగా బయటకు వచ్చిన రతి.. మడతలు పెట్టిన ఓ కాగితాన్ని నా చేతిలో ఉంచుతూ ‘అత్తయ్యగారి ఫోటో ఫ్రేమ్‌లో దొరికిందని రిపేరు చేసిన వాడు ఇచ్చాడు. చూసి మాట్లాడండి సోషల్ స్టేటస్ గురించి’ అని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.
ఇన్లాండ్ లెటర్ మడతలు విప్పి చూశాను. అది అమ్మ.. నాన్నకు రాసిన ఉత్తరం. చదివాను. నా కళ్ళు బైర్లు కమ్మినట్లయింది. అలా ఉన్నవాడిని ఉన్నట్లే సోఫాలో కూలబడిపోయాను.
నాన్న ఢిల్లీ రీజనల్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు అమ్మ రాసిన ఉత్తరం అది. వాళ్ళకి లేకలేక పుట్టలేదు నేను. పిల్లలు పుట్టక తెచ్చుకుంటే వచ్చాను. ‘రాజమండ్రిలో ఓ కుర్రాడిని చూశాను. ‘అమ్మా’ అని పిలిచిన వాడు తప్ప తనకెవరూ వద్దని’ అమ్మ ప్రాధేయపడుతూ రాసిన ఉత్తరం.
నాన్న వణుకుతున్న స్వరంతో అంటున్నారు ‘ఆనాడే చింపేయాల్సిందిరా ఈ ఉత్తరాన్ని. ఒక జ్ఞాపకంగా దాన్ని ఇక్కడ ఉంచి మరచిపోయాను’ అని.
∙∙
‘నాన్నా.. నేను మీ కొడుకుని కానా?’ మంచానికి దూరంగా నిలబడి అన్నాను.
అయన కళ్ళు బెదురుతూ చూశాయి నన్ను. వణుకుతున్న చేతులతో మంచం మీద నుంచి లేచి నిలబడి గబగబా నా దగ్గరకు వచ్చారు.. ‘నా కొడుకువేరా. నేను చచ్చేక నాకు పిండంపెట్టేది నువ్వే. లీగల్ రైట్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవడ్రా కాదనేది?’ అంటూ గట్టిగా కౌగలించుకున్నారు.
ఏడిస్తే కాని మనసులు తేలిక పడలేదు.
‘మావయ్యగారూ.. భోజనానికి రండి. చాలా టైమయింది’ బయటి నుంచి పిలిచింది రతి.
‘నాకు ఆకలిగా లేదు నాన్నా’ అన్నా.
‘నాకు ఉంది.. పద’ అన్నారు నాన్న.
అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది గదిలోకి వెళ్లిపోయింది రతి.
ఆ రాత్రి భోజనాలయ్యాక నాన్న.. గదిలో మంచం మీద కూర్చుని.. ‘అన్నంలో వేసుకునే నెయ్యి అగ్నిలో వేస్తే హవిస్సు అవుతుంది, పుచ్చుకోవడమేనా? ఇవ్వడం కూడా తెలిస్తేనే జీవితం అవుతుంది. నేనూ, అమ్మా పిల్లల్లేక నిన్ను తెచ్చుకున్నాం. కాని ఈ బంగారుతల్లి సొంతగా పిల్లలు వద్దనుకొని ఈ అనాథ పిల్లలను తెచ్చుకుంది. అర్థం చేసుకో. ఔన్నత్యం కల భార్య దొరకడం నీ అదృష్టం’ అని చెప్తూంటే పడుకొని వింటున్నాన్నేను.
‘నీమీద తనకి నమ్మకం. తను చేసిన పనిమీద నమ్మకం. నువ్వు కాదనవని నమ్మకం. నేనీసారి ఏ ఆశ్రమాలకి వెళ్ళేది లేదురా. హారతి చేసే పనికి నేను సాయపడగలిగితే చాలు. నా ఆశయం నెరవేరినట్లే. ఈ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతా. నా పెన్షన్, వడ్డీలు ఎవరికీ ఇచ్చేది లేదు. నా కోడలికే’ చెబుతూన్నారు నాన్న.
ఉదయం మెలకువ వచ్చి చూసేసరికి నాన్న ఇంకా పడుకునే ఉన్నారు.. టైమ్ చూస్తే తొమ్మిది దాటింది. నాన్నని డిస్టర్బ్ చేయకుండా బాత్రూమ్కి వెళ్ళి స్నానం కూడా ముగించుకు వచ్చాను. ప్యాంటు, టీషర్టు వేసుకుని హాల్లోకి వచ్చేసరికి ఎవ్వరూ లేరు. డైనింగ్ టేబుల్ మీదున్న ఫ్లాస్క్ మూత తీశాను. పొగలు కక్కుతోంది టీ. కప్పులో పోసుకొని తాగాను ఆలోచిస్తూ. కప్పు టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా వెళ్ళి మా బెడ్రూమ్ తలుపు తోసి లోపలకు వెళ్లాను. లైట్ వెలుగుతూ ఉంది.. మంచం మీద రతికి అటూ ఇటూ పడుకొని ఉన్నారు ఆ కవల పిల్లలు.
అర్ధచంద్రాకారంగా కాటుక దిద్ది మూసి ఉన్న విశాల నయనాలు, ఫ్యాన్ గాలికి ఎగురుతున్న చిన్ని ముంగురులు. వారి మధ్య వాళ్ళలానే రతి.. కాదు హారతి. నావంకే చూస్తోందామె. నెమ్మదిగా ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ‘ఏవిటన్నట్లు’ కనుబొమలెగరేసింది. ఏమీలేదన్నట్లు తల అడ్డంగా ఊపి బయటకు నడిచాను. లిఫ్టులో కిందకు దిగి నడుచుకుంటూ రోడ్ మీదకు వచ్చేశాను. గణేష్ టెంపుల్లో గంట మోగుతోంది. ఎర్రటి పంచె, కండువాతో పూజారిగారులా ఉన్నారు.. సెల్ మాట్లాడుతున్నారు ఎవరితోనో బిగ్గరగా.
‘మొగుడూ, పెళ్ళాం కలిసే చేయాలి పూజైనా, యాగవైనా. ఒక్కడు చేస్తే కుదిరి చావదు. ఆమాత్రం జ్ఞానం లేదా అంత సంపాయించాడు మీ సేటు?’
ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకొన్నా. హాస్పిటల్ దగ్గర హెడ్ నర్సు ఎదురొచ్చింది.
‘నమస్తే సార్. మేడమ్‌ని తీసుకొచ్చారా?’
‘లేదు. నేనే వచ్చాను’ అన్నా
‘మంచిపని చేశారు సార్. మేడమ్‌తో నేనూ అదే చెప్పా. ట్యూబెక్టమి కంటే వేసక్టమి బెటరని. డాక్టర్‌గారు ఖాళీగా ఉన్నారు. గంటలో పంపేస్తారు’ హెడ్ నర్సు నాముందు నడుస్తూ మాట్లాడుతోంది.
- కేవీవీ సత్యనారాయణ