ఓటెత్తిన పల్లెలు 82.74 శాతం పోలింగ్ | 82.74 per cent polling in rural otettina | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన పల్లెలు 82.74 శాతం పోలింగ్

Published Mon, Apr 7 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

ఓటెత్తిన పల్లెలు 82.74 శాతం పోలింగ్

ఓటెత్తిన పల్లెలు 82.74 శాతం పోలింగ్

  • ముగిసిన తొలిదశ పరిషత్ ఎన్నికలు
  •   విజయవాడ, మచిలీపట్నం డివిజన్లలో పోలింగ్
  •   నందిగామలో బ్యాలెట్ పేపర్లు తారుమారు
  •   మాజీ ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ హౌస్ అరెస్ట్
  •   పెనమలూరులో ఓటేసిన తాతినేని పద్మావతి
  •   పరిషత్ ఎన్నికల్లో పల్లెలు ఓటెత్తాయి.. తొలిదశలో విజయవాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌లలో పోలింగ్ జరిగింది. జిల్లాలో పోలింగ్ శాతం 82.74గా నమోదైంది. మున్సిపల్ ఎన్నికలతో పోల్చితే పల్లెల్లో ఓటర్లకు అరకొర సౌకర్యాలతోనే సరిపెట్టారు.. పలుచోట్ల కనీసం షామియానా టెంట్‌లు కూడా లేకపోవడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం కావడంతో 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఓటింగ్ ఊపందుకుంది.
     
    సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని 26 జెడ్పీటీసీలు, 450 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం తొలిదశ ఎన్నికలు జరిగాయి. విజయవాడ డివిజన్‌లో 14, మచిలీపట్నంలో 12 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఎంపీటీసీలకు సంబంధించి విజయవాడ డివిజన్‌లో 293, మచిలీపట్నంలో 157 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

    పలు ప్రాంతాల్లో ఓటర్లకు సక్రమంగా ఓటర్ స్లిప్‌లు అందకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు ఆదేశాలతో నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్ స్లిప్‌లను అందించే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ఎన్నికల బందోబస్తు నిర్వహించారు.
     
    టెంట్లు కూడా వేయలేదు...
     
    మున్సిపల్ ఎన్నికలను బాగా నిర్వహించిన అధికారులు పరిషత్ ఎన్నికల్లో సరైన ఏర్పాట్లు చేయలేదు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్‌లు, బారికేడ్లు, మరుగుదొడ్లు, మంచినీరు సౌకర్యాలను కల్పించారు. కానీ పరిషత్ ఎన్నికల్లో ౄలా గ్రామాల్లో బారికేడ్ల మాటెలా ఉన్నా కనీసం టెంట్‌లు కూడా వేయలేదు. దీంతో మండే ఎండల్లో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

    పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం అర్తమూరులో టెంట్‌లు వేయకపోవడంతో ఎండ కారణంగా ముగ్గురు వృద్ధులు కళ్లు తిరిగి పడిపోయారు. స్థానికంగా వారికి ప్రాథమిక చికిత్స చేయడంతో కోలుకున్నారు. చాలా మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం గోడలపై ఏర్పాటుచేసే డిస్‌ప్లే బోర్డుల్లో సైతం అభ్యర్థుల పేర్లతో పాటు గుర్తుల నమూనాలు వేయలేదు. గుర్తుల పేర్లు మాత్రం రాశారు. అది కూడా స్కెచ్ పెన్నులతో రాయడంతో ఓటర్లకు డిస్‌ప్లే బోర్డులు సరిగా అర్థంకాని పరిస్థితి నెలకొంది.
     
    వృద్ధుడిపై ఎస్సై ప్రతాపం...

    మచిలీపట్నం రూరల్ ఎస్సై అనిల్‌కుమార్ తాళ్లపాలెం జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఒక వృద్ధుడ్ని అకారణంగా కొట్టారు. దీంతో గ్రామస్తులు ధర్నాలకు దిగారు. ఎస్సై టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ గ్రామస్తులు ఆరోపించారు. మిగిలిన పోలీసులు, స్థానికులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం టీడీపీకి చెందిన సర్పంచ్ భర్తపై కొందరు దాడి చేసి గాయపర్చినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూడూరు సెగ్మెంట్-2లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోనే ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ అభ్యర్థి గొరిపర్తి రమణ సహా పలువురు కొద్దిసేపు ధర్నా చేశారు. మొవ్వ మండలం కూచిపూడి పోలింగ్ కేంద్రం వద్ద గుమికూడిన జనాన్ని పోలీసులు హడావుడి చేసి వారిని చెదరగొట్టారు.
     
    బ్యాలెట్ పేపర్లు తారుమారు...
     
    నందిగామ మండలం మునగచర్లలో జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లు మారిపోయాయి. వాటి బదులు వీరులపాడు మండలానికి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. 50 బ్యాలెట్ పేపర్లు చొప్పున ఉండే ఒక కట్టలో పది, మరో కట్టలో 41 చొప్పున నందిగామ మండల జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లు కలిసి వచ్చాయి. వాటిని అధికారులు గుర్తించేసరికే 25 ఓట్లు పోలయ్యాయి. దీనిపై మండల రిటర్నింగ్ అధికారి మోహన్‌రావు నందిగామలోని వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థులను పిలిచి మాట్లాడారు. ఎట్టకేలకు గుర్తులపై పడిన ఓట్లను ఆమోదించేలా వారినుంచి అంగీకార పత్రాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కె.అగ్రహారం, రెడ్డినాయక తండా వద్ద టీడీపీ కార్యకర్తలు గుర్తును ప్రచారం చేయడంతో వివాదం నెలకొంది. చిల్లకల్లు సెగ్మెంట్-4లో ఉన్న తిరుమలగిరి, తొర్రకుంటపాలెం పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం రెండు గంటలకే పోలింగ్ పూర్తికావడం
    విశేషం.

     మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్  హౌస్ అరెస్ట్
     ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తున్నారన్న విషయమై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం నెప్పల్లిలో ఓటర్లను ప్రభావితం చేసేలా రాజేంద్రప్రసాద్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ్నుంచి వచ్చిన ఆయన కంకిపాడులోని బట్టలషాపులోకి వెళ్లి కూర్చోగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

     పెనమలూరులో ఓటేసిన పద్మావతి...
     వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి పెనమలూరు జెడ్పీ హైస్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్‌సీపీ బందరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త కేవీఆర్ విద్యాసాగర్ తన స్వగ్రామం కోసూరులో ఓటేశారు. మైలవరం నియోజకవర్గంలో గణపవరం ఎంపీటీసీ-2లో వైఎస్ సోదరి మామగారు, గణపవరం జమీందారు 92 ఏళ్ల బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైఎస్ మేనల్లుడు బొల్లారెడ్డి యువరాజురెడ్డి కూడా స్వగ్రామంలో ఓటేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement