న్యూస్‌లైన్ టాస్క్‌ఫోర్స్ : కన్ను పడితే చాలు కబ్జా చేయకుండా వదలడు. పేదల భూములా, ప్రభుత్వ భూములా అన్న తేడా లేదు. అంతా దిగమింగాల్సిందే. ఎవరైనా ఇవ్వను అంటే భయపెట్టడం.. లక్షల రూపాయల విలువ చేసే భూములను వేల రూపాయలకే కొనుగోలు చేయడం.. అతని శైలి. ఇదీ ధర్మవరం టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి నైజం. కబ్జాల అనకొండగా పేరు గడించిన ఈ రౌడీ షీటర్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో అనంతపురం నడిబొడ్డున ఓ అధ్యాపకుడి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేయగా.. అప్పటి ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర ఈయన్ను ఏకంగా జిల్లా బహిష్కరణే చేశారు. అనంతర కాలంలో రాజకీయ నేతగా అవతారం ఎత్తి కబ్జాల పరంపర కొనసాగిస్తున్నాడు.
ఎంతో మంది భూములను కబ్జా చేసినట్లు సూరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇతడి దెబ్బకు ఓ గ్రామమే ఖాళీ అయ్యిందంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి దౌర్జన్యకాండను కొనసాగించాడు. ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీ పరిధిలోని చండ్రాయునిపల్లి జనాభా 150. ఈ గ్రామంలో ఫ్లోరైడ్ అధికంగా ఉండడంతో గ్రామస్తులు తరచూ రోగాల బారిన పడుతుండేవారు. కొంత మంది గ్రామం వదలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం గ్రామస్తులకు చెందిన దాదాపు వంద ఎకరాల భూములను ఈ నేత తక్కువ ధరకు కొనుగోలు చేసి పాగా వేశాడు. అనంతరం తనకు అనుకూలంగా ఉంటుందని.. మరి కొందరు భూములను కొనుగోలు చేయడానికి మధ్యవర్తులను పంపాడు. అయితే వారు విక్రయించేందుకు నిరాాకరించడంతో బెదిరించడం ప్రారంభించాడు. తాము చెప్పిన ధరకు భూములను విక్రయించకపోతే గ్రామంలో ఎవరూ ఉండలేని హెచ్చరించాడు.
అనంతరం వారితో బలవంతంగా దాదాపు వంద ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే వారికి ఇస్తానని చెప్పిన డబ్బును మాత్రం ఇవ్వలేదు. దీంతో బాధితులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో తాను రాజకీయంగా దెబ్బతింటానని భావించి పెద్ద మనుషుల ద్వారా పంచాయితీ చేశాడు. బాధితులను ఒప్పించి.. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు.. అంటే తక్కువ ధరను చెల్లించి వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడు. వీటితో పాటు దాదాపు 90 ఎకరాల వరకు ప్రభుత్వ (అసైన్డ్) భూమిని కూడా కబ్జా చేశాడు. ఈ ప్రభుత్వ భూములన్నింటినీ తాను ఇదివరకు తక్కువ ధరతో కొనుగోలు చేసిన మిగితా భూములకు కలిపేసుకున్నాడు.
సూరి ఆక్రమించిన అసెన్డ్ భూములివే..
సర్వే నెంబర్ 29-2లో 5 ఎకరాలు, సర్వే నెంబర్ 86లో 2 ఎకరాలు, సర్వే నెంబర్ 63-1లో 5 ఎకరాలు, 63-2లో 5 ఎకరాలు, 63-3లో 3 ఎకరాలు, 88-1లో 16 ఎకరాలు, 96-1లో 5 ఎకరాలు, 96-2లో 3 ఎకరాలు, 96-3లో 10 ఎకరాలు, సర్వే నెంబర్ 74లో 10 ఎకరాలు, 94లో 12 ఎకరాలు, 199లో-16 ఎకరాలు, 96లో- 11 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వ భూమి అంతా వరదాపురం సూరి ఆధీనంలోనే వుంది.
పాఠశాల భవనాన్ని
స్టోర్ రూంగా మార్చేశారు..
అంతటితో ఆగకుండా ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్నే సొంత భవనంగా మార్చేసుకుని స్టోర్ రూంగా వినియోగిస్తున్నారు. 2003లో సర్వశిక్షా అభియాన్ నిధులు రూ.5 లక్షలు వెచ్చించి ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది. అది కాస్తా ప్రస్తుతం సదరు దేశం నేత సొంత భవనంగా మార్చేసుకున్నారు. ఏకంగా ఆ భవనానికి తలుపులు, కిటికీలు అమర్చి అందులో వ్యవసాయ సామగ్రిని ఉంచి ఎంచక్కా స్టోర్ రూమ్‌గా వాడుకుంటున్నారు.
కబ్జాల అనకొండ
Published Mon, May 5 2014 2:25 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement