
07–02–2018, బుధవారం
దుండిగం క్రాస్,
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
ఆ తల్లులకు న్యాయం చేయాలన్నదే నా ఆశయం
సేద్యం చేసే రైతే కాదు.. స్వేదం చిందించే కూలీ ముఖంలోనూ సంతోషం కనిపించడం లేదు. ఎక్కడికెళ్లినా కష్టాలు, కడగండ్లే. ఇలాంటి రైతులు, కూలీలే.. ఈ రోజు కొరిమెర్లలో నన్ను కలిశారు. ఉన్న ఊళ్లో బతకలేని కొంతమంది రైతులు కొరిమెర్లలో భూమిని కౌలుకు తీసుకుని శనగ పంట వేశారట. మూడేళ్లుగా గిట్టుబాటు ధరలేక.. అప్పులే వెంటాడుతున్నాయన్నారు. తిన్నా, తినకున్నా కౌలు కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు కట్టాల్సిందేనట. పెట్టుబడితో కలుపుకొంటే ఎకరాకు రూ.22 వేలు ఖర్చవుతోందట. ఆ ఖర్చుకు, మార్కెట్ ధరకూ ఏమాత్రం పోలికే ఉండటం లేదన్నారు. క్వింటా రూ.9,500 పలికిన శనగ.. ఇప్పుడు రూ.3,500 కూడా పలకడం లేదని చెప్పారు. ధర వచ్చేదాకా దాచుకునే గిడ్డంగులూ లేవన్నారు. నిజమే! వాళ్ల బాధకూ అర్థం ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతన్న కంట నీరే. అన్నదాతకు ఇలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న నా తపన మరింత బలపడింది. అందుకే నవరత్నాల్లో రైతన్నకు పెద్దపీట వేశాను.
కొరిమెర్ల వద్ద పాదయాత్ర చేస్తున్నప్పుడు.. పొలాల్లోంచి కొంతమంది మహిళలు పరిగెత్తుకుంటూ నా వైపు రావడం కనిపించింది. వారొచ్చే వరకూ ఆగాను. రొప్పుతూ.. చెమటతో పూర్తిగా తడిచిపోయి ఉన్నారు. ఆనందం పట్టలేక నాతో కరచాలనం చేశారు. ఆ చేతులు బొబ్బలెక్కి ఉన్నాయి. కాయకష్టంతో మృదుత్వాన్ని కోల్పోయాయి. ‘ఏంటమ్మా..’ అని ప్రశ్నించాను. కష్టాలన్నీ ఒక్కసారిగా చెప్పుకోవడం మొదలెట్టారు. రోజంతా కష్టపడ్డా రూ.150 రావడం లేదన్నా.. అంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. కరువు పనులూ లేవని, చేసినా డబ్బులే ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. వాళ్ల ఊళ్లో ఏడెనిమిది నెలలుగా ఉపాధి బకాయి డబ్బులే రావడం లేదట. ఇలాంటి అమ్మలు, అక్కలను కూడా పట్టించుకోకపోతే.. రాష్ట్రంలో పాలన ఉన్నట్లేనా? నిండు మనసుతో, సడలని నమ్మకంతో నా దగ్గరకు వచ్చిన ఆ తల్లులకు న్యాయం చేయాలన్నదే నా ఆశయం.
రెండు రోజులుగా జలుబు వేధిస్తోంది. దుమ్మూధూళి వల్ల దగ్గు బాగా ఎక్కువైంది. గొంతు నొప్పి కూడా మొదలైంది. నిన్నటి నుంచి స్వరంలోనూ కొంత మార్పు కన్పించింది. కాస్త ఇబ్బందిపడుతూనే.. మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడాల్సి వచ్చింది. మధ్యాహ్నం వైద్యులు పరీక్షించి మందులిచ్చారు.
జువ్వలకుంటపల్లిలో చేనేత కుటుంబానికి చెందిన ఓ చెల్లెమ్మ కలిసింది. భర్తతో కలిసి రోజంతా కష్టపడితే రూ.300 వస్తున్నాయని, పోనీ.. ముడి సరుకును తామే తెచ్చుకుని చీర నేద్దామంటే.. గిట్టుబాటు ధర లేదని బాధపడింది. చిన్న వయసులోనే నడుం నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చాయని, చూపు సైతం మందగిస్తోందని వాపోయింది. ఇలాంటి చెల్లెమ్మల కష్టాలు చూసే.. 45 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని సంకల్పించాను. మంచిరోజులు దగ్గర్లోనే ఉన్నాయని ధైర్యం చెబుతూ ముందుకు సాగాను.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ నాలుగేళ్ల పాలనలో గిట్టుబాటు ధరలేక రైతన్నలు విలవిల్లాడుతున్నారు. ఏమైంది మీ రూ.5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి?
- వైఎస్ జగన్