భీమవరం : ప్రకృతి వైపరీత్యాలు రైతులను నిండా ముంచుతుంటే వారికి భరోసా కల్పించవలసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతేడాది హెలెన్, పైలీన్ తుపానుల దెబ్బకు జిల్లాలో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించి ఆదుకోవలసి ఉన్నా ఆ పని చేయడం లేదు. గ త కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని భరోసా ఇచ్చినా అమలు కాలేదు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తీరు కూడా అదేవిధంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకుల్లో వడ్డీ భారం పెరుగుతోంది. 2013 సంవత్సరంలో వచ్చిన హెలెన్, పైలీన్ తుపానుల ధాటికి జిల్లాలోని సార్వా పంట అతలాకుతలమైంది. అప్పట్లోనే
లక్షా 50 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు
అధికార యంత్రాంగం అంచనా వేసింది. దీని నిమిత్తం ఇన్‌పుట్ సబ్సిడీ కింద సుమారు రూ. 103 కోట్లు అందించవలసి ఉందని అధికారులు గుర్తించారు. గ్రామం యూనిట్‌గా అంచనా వేసి సుమారు రూ.150 కోట్లు పంటల బీమా సొమ్ము రావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఇన్సూరెన్స్ కంపెనీల నియమ నిబంధనల ప్రకారం పంటల బీమా ప్రీమియం ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులోపు బ్యాంకుల ద్వారా అందించవలసి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీతో కలిపి ఈ బీమా సొమ్మును ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడంతో అవి కూడా ఇప్పటి వరకు రైతులకు చేరువ కాలేదు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ ఒత్తికి కారణంగా బీమా సొమ్ము వెనక్కెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్‌పుట్ సబ్సిడీ అయితే అసలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
రుణ మాఫీ ఎప్పుడో?
రుణమాఫీ చేయడం తథ్యం అని చెబుతూ వస్తున్న ప్రభుత్వం మాత్రం దీనిపై రోజు రోజుకూ అనేక షరతులు పెడుతూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నంలో నిమగ్నమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2013 మార్చి నెలాఖరులోపు సుమారు ఎనిమిది లక్షల మంది రైతులు రూ. 7 వేల 475 కోట్లు పంట రుణాలు పొందారు. వీటిలో సుమారు నాలుగు శాతం మంది మాత్రమే ఆయా బ్యాంకులకు రుణాలు చెల్లించినప్పటికీ మిగిలిన రైతులు రుణమాఫీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే బ్యాంకుల్లో వడ్డీ మరింత భారంగా మారి కష్టాల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతకు ఏదీ ఆసరా?
Published Thu, Nov 13 2014 3:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement