సాక్షి, హైదరాబాద్: ప్రపంచబ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ తదితర విదేశీ సంస్థల నుంచి భారీఎత్తున అప్పుచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో రూ.86 వేల కోట్ల అప్పు చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయా శాఖలు రూపొందించి ఆర్థికశాఖ పరిశీలనకు పంపించాయి. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు మూడు శాతానికన్నా మించరాదు. అయితే ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించడం ద్వారా ఎక్కువ అప్పు చేసేందుకు వీలు కల్పించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు కేంద్రాన్ని కోరింది. కానీ ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించేందుకు కేంద్రం ఇప్పటివరకు అనుమతించలేదు. అయినప్పటికీ రాష్ర్టప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా భారీస్థాయిలో అప్పుచేయాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐ.వై.ఆర్.కృష్ణారావు నిర్వహించిన సమీక్షలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు రూ.20 వేల కోట్లకు మించి అప్పు చేయడానికి వీలుపడదని ఆర్థికశాఖ పేర్కొంది.
అయితే సీఎస్.. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను కచ్చితంగా పాటించనక్కర్లేదన్నారు. ఈ నేపథ్యంలో విద్య, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, గ్రామీణ, పట్టణ మంచినీటి సరఫరా, జలవనరులు, ఇంధన రంగాలకు సంబంధించి రూ.86 వేల కోట్లు అప్పు చేయాలని నిర్ణయించారు. ఇంత పెద్దమొత్తంలో అప్పు చేయనున్నందున అందులో 90 శాతం గ్రాంటుగా కేంద్రప్రభుత్వం భరించేందుకు వీలుగానైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఇటీవల రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రత్యేకహోదా కల్పిస్తే విదేశీ సంస్థల నుంచి రాష్ట్రప్రభుత్వం తీసుకునే అప్పుల్లో 90 శాతాన్ని కేంద్రం భరిస్తుంది. మిగతా పదిశాతాన్ని మాత్రమే రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇటీవల కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రాలకు బదిలీ చేసినందున వాటికి రాష్ట్రప్రభుత్వం నిధులు సమకూర్చలేని స్థితిలో ఉందని, ప్రత్యేకహోదా కల్పిస్తే కేంద్రమే ఆ పథకాలకు నిధులను సమకూర్చుతుందని లేఖలో వివరించింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో విదేశీసంస్థల నుంచి రూ.3 వేల కోట్ల వరకు అప్పు తెచ్చుకునే వెసులుబాటును కల్పించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
13వ ఆర్థికసంఘం నిధులు రూ.670 కోట్లు ఇప్పించండి
ఇదిలా ఉండగా 13వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రావాల్సిన రూ.670.10 కోట్లను తక్షణం ఇప్పించాలని కూడా కేంద్రానికి రాష్ట్రసర్కారు లేఖ రాసింది. 13వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,017.28 కోట్లు గ్రాంటు రూపంలో కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అయితే రాష్ట్రప్రభుత్వం సకాలంలో విడుదల చేసిన నిధులకు వినియోగపత్రాలను సమర్పించి నిధులు తెచ్చుకోవడంలో విఫలమైంది. దీంతో గతేడాది రూ.3,493.13 కోట్లనే కేంద్రం విడుదల చేసింది. మిగిలిన రూ.670.10 కోట్ల గ్రాంటును రాష్ట్రసర్కారు కోల్పోయింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.670.10 కోట్లను వ్యయం చేశామని, అందువల్ల ఆ నిధులను ఇప్పించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది.