ముంబై: గోద్రేజ్ గ్రూపులో భాగమైన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రుణ వితరణను రూ.12,000 కోట్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఇది రూ.5,500 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ నాన్ బ్యాకింగ్ ఆర్థిక సేవల సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) 2020 చివర్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కార్యకలాపాలు ప్రారంభించింది. గోద్రేజ్ ప్రాపర్టీ కస్టమర్లకు రుణాలు సమకూర్చే లక్ష్యంతో మొదలు కాగా, తర్వాత ఎస్‌ఎంఈ, ఎంఎస్‌ఎంఈ రంగానికి కూడా రుణాలు ఇవ్వడం ఆరంభించింది.
మార్చి చివరికి ఉన్న రూ.5,500 కోట్ల రుణాల్లో రూ.4,000 కోట్లు హోమ్ లోన్ విభాగానికి చెందినవి. ఇందులోనూ సగానికి పైగా (రూ.2వేల కోట్లకు పైన) గోద్రేజ్ ప్రాపర్టీస్ కస్టమర్లకు ఇచ్చినవే ఉన్నాయి. మిగిలిన చిన్న వ్యాపారస్థులకు ఇచ్చినవి కావడం గమనార్హం. తమ రెండు విభాగాల్లో (హౌసింగ్, ఎంఎస్‌ఎంఈ) నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) సున్నాగా ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. మార్చి త్రైమాసికంలో ఎంఎస్‌ఎంఈ విభాగం కూడా లాభాల్లోకి అడుగు పెట్టినట్టు చెప్పారు. హోమ్‌లోన్ విభాగం గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి లాభాల్లోనే ఉన్నట్టు తెలిపారు.
ప్రమోటర్ల నుంచి రూ.1,200 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రమోటర్లు రూ. 1,200 కోట్ల నిధులు సమకూర్చనున్నట్టు మనీష్ షా వెల్లడించారు. మొదటి విడత నిధులు ప్రస్తుత త్రైమాసికంలోనే రానున్నట్టు తెలిపారు. 2024 మార్చి చివరికి నిర్ధేశించుకున్న రూ.12వేల కోట్ల రుణ పుస్తకంలో రూ.7,000 కోట్లు ఎంఎస్‌ఈ/ఎంఎస్‌ఎంఈ నుంచి ఉంటాయని షా చెప్పారు. ఎంఎస్‌ఎంఈ కస్టమర్ల బేస్ ప్రస్తుతం 1,000గా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి పది రెట్లు పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు వెల్లడించారు.
‘‘యాజమాన్యం కార్యకలాపాలు ప్రారంభించిన మూడో ఏడాది రుణ పుస్తకం రూ.10,000 కోట్లను అధిగమించాలనే లక్ష్యాన్ని పెట్టింది. మేము దీన్ని చేరుకుంటామనే నమ్మకంతో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో ఎంఎస్‌ఎంఈ/ఎస్‌ఎంఈ పుస్తకం రూ.30,000 కోట్లకు, 2028–29 చివరికి మొత్తం రుణ పుస్తకం రూ.50,000 కోట్లను అధిగమిస్తుంది’’అని చెప్పా రు. అప్పుడు కంపెనీని ప్రజల ముందుకు తీసుకెళ్లడాన్ని పరిశీలించొచ్చన్నారు. ఎంఎస్‌ఎంఈ/ఎస్‌ఎంఈలకు రుణ సేవల కోసం నిర్మన్ పేరుతో ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను షా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment