విజయవాడ, న్యూస్‌లైన్ : ఈ నెల 9వ తేదీ నుంచి కీలకమైన ఉద్యమం ప్రారంభమవుతుందని ఏపీఎన్జీవో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య యువజన సదస్సు బెంజ్‌సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో గురువారం జరిగింది. హాలు ప్రాంగణం అంతా సమైక్య నినాదాలతో హోరెత్తిపోయింది. అశోక్‌బాబు మాట్లాడుతూ 9న సమైక్యాంధ్ర విద్రోహ దినంగా పరిగణించాలన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కృష్ణయాదవ్ మాట్లాడుతూ చదువు, సంస్కారం లేని సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేస్తున్నారని విమర్శించారు. పీవీ నరసింహారావు గాంధీ కుటుంబాన్ని పక్కనబెట్టి పాలన సాగించారని, తెలుగువారు కలిసి ఉంటే మరలా వారికి ఎటువంటి ఆపద వస్తుందోనని రాష్ట్రాన్ని విభజిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంతవాసులు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తామని చెప్పి కలిసి, అభివృద్ధి చెందిన తరువాత విడిపోతామని డిమాండ్ చేస్తే ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
రాష్ట్ర సమైక్య యువజన కన్వీనర్ కిశోర్‌కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ 9 నెలల పాటు రాష్ట్రం అంతటా పర్యటించి తెలంగాణా అభివృద్ధి చెందిందని, విభజన జరిగితే అనేక కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని నివేదికలో సమర్పించినట్లు చెప్పారు. సీమాంధ్రకు రూ.10 లక్షల కోట్లు ప్యాకేజి ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు.. ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. నరేంద్రమోడి చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమని ప్రకటిస్తున్నారు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ర్టంలో కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది.. దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని ప్రశ్నించారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ రాజకీయాలు తిండి పెట్టవని, ఉద్యమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు తక్కువ పనిగంటలు పెట్టి అందరూ ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. తెలుగు జాతిని ఢిల్లీలో అమ్మేశారని విమర్శించారు. సోనియాగాంధీకి తెలుగు ప్రజలపై ఆసక్తి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంద్ర విద్యార్ది జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మదిలో సమైక్యాంధ్ర నినాదం ఉంటూనే ఉందన్నారు.
గుంటూరు జిల్లా జేఏసీ ప్రతినిధి శేషు మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఆగేవరకు ఉద్యమం ఆగదన్నారు. భావితరాల భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమం చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లా జేఏసీ ప్రతినిధి జగదీష్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎందుకు రాష్ట్ర విభజనను ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా జేఏసి ప్రతినిధి డేవిడ్ మాట్లాడుతూ సమైక్య రాష్ర్టంలోనే విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు, రాష్ట్ర విభజన జరిగితే లభిస్తాయా అని అడిగారు.
నేడు బంద్‌కు పిలుపు
కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో సంఘం వేరొక ప్రకటనలో శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది.
9 నుంచి కీలక ఉద్యమం
Published Fri, Dec 6 2013 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement