93 పాఠశాలలు మూత?
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోరుుంది. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పేంచేందుకు కృషి చేశారు. అయినప్పటికీ ఆశించనంతగా ఎన్‌రోల్‌మెంట్ జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడి యం ప్రవేశపెట్టినట్లు పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫాం వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని విస్తృత ప్రచారం చేశారు.
ఎక్కడైతే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారో... ఆయూ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగింది. కానీ...తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగకపోవడమే కాకుండా... తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలో అన్ని కేటగిరీల్లో 15,602 ఉపాధ్యాయ పోస్టులుండగా... సుమారు 14,426 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 1,176 ఉపాధ్యాయ వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా... జిల్లాలో 3,266 ప్రభుత్వ పాఠశాలలున్నట్లు విద్యాశాఖ రికార్డులు చెబుతున్నారుు. ఇందులో విద్యార్థుల్లేని పాఠశాలలు 93 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 129 పాఠశాలల్లో పది మందిలోపు, 377 స్కూళ్లలో 20 మంది లోపు, 631 పాఠశాలల్లో 30 లోపు విద్యార్థులున్నట్లు అధికారులు తనిఖీల్లో తేలింది.
గత ఏడాది విద్యాశాఖ చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియను గమనిస్తే... ఈ సారి విద్యార్థుల్లేని పాఠశాలలు 93 కచ్చితంగా మూతపడినట్లే. రేషనలైజేషన్ జరిగితే వీటితోపాటు పది మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు సైతం మూతపడే అవకాశం ఉంది. కాగా, 93 పాఠశాలలు అనధికారికంగా ఇప్పటికే మూతపడగా... ఇందులో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరిట వేరే పాఠశాలలకు పంపినట్లు సమాచారం.
మండలాల వారీగా విద్యార్థుల్లేని బడులు...
ఆత్మకూరు 2, భూపాలపల్లి 7, చెన్నారావుపేట 4, చిట్యాల 1, డోర్నకల్ 4, దుగ్గొండి 2, గీసుకొండ 1, స్టేషన్‌ఘనపూర్ 1, ఘనపూర్ (ములుగు) 2, గోవిందరావుపేట 4, గూడూరు 1, హన్మకొండ 2, జఫర్‌గఢ్ 3, కేసముద్రం 2, ఖానాపూర్ 4, కొడకండ్ల 2, కొత్తగూడ 4, మద్దూరు 1, మహబూబాబాద్ 5, మంగపేట 1, మరిపెడ 3, మొగుళ్లపెల్లి 2, ములుగు 3, నల్లబెల్లి 5, నర్మెట 1, నర్సింహులపేట 1, పరకాల 1, పర్వతగిరి 2, రాయపర్తి 3, రేగొండ 1, సంగెం 4, తొర్రూరు 1, వెంకటాపూర్ 7, వరంగల్ 4, వర్ధన్నపేట 2
293 పాఠశాలల్లో సింగిల్ టీచర్లు
జిల్లాలోని 293 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో విద్యాబోధన జరుగుతోంది. 1 నుంచి 5వ తరగతి వరకు ఉండే ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచర్‌తో విద్యాబోధన చేయాల్సి రావడం కష్టసాధ్యం. ఏవైనా కారణాలతో ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుంటే.. ఆ రోజు విద్యార్థులకు సెలవే. సింగిల్ టీచర్ పాఠశాలల్లో మరొక ఉపాధ్యాయుడిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నచోట విద్యావలంటీర్‌ను నియమించే వారు. గత విద్యాసంవత్సరం నుంచి విద్యావలంటీర్ల వ్యవస్థను ఎత్తివేశారు. అవసరమైన చోట అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. ఈ విద్యాసంవత్సరంలో అకడమక్ ఇన్‌స్ట్రక్టర్లను కూడా నియమించలేదు. ఫలితంగా ఆయూ పాఠశాలల్లో విద్యాబోధన సరిగ్గా సాగడం లేదు.
మండలాలవారీగా ఏకోపాధ్యాయ పాఠశాలలు...
ఆత్మకూరు 4, బచ్చన్నపేట 3, దేవరుప్పల 11, చేర్యాల 3, ధర్మసాగర్ 2, డోర్నకల్ 5, దుగ్గొండి 4, గీసుకొండ 4, స్టేషన్‌ఘనపూర్ 3, ఘనపూర్ (ములుగు) 6, గోవిందరావుపేట 4, గూడూరు 7, హన్మకొండ 7, హసన్‌పర్తి 2, జనగామ 7, కేసముద్రం 3, ఖానాపూర్ 3, కొడకండ్ల 5, కొత్తగూడ 4, కురవి 3, లింగాల ఘనపూర్ 2, మద్దూరు 3, మహబూబాబాద్ 12, మంగపేట 2, మరిపెడ 20, భూపాలపెల్లి 7, చెన్నారావుపేట 13, మొగుళ్లపల్లి 2, ములుగు 10, నల్లబెల్లి 6, నర్మెట 6, నర్సంపేట 6, నర్సింహులపేట 4, నెక్కొండ 4, నెల్లికుదురు 10, పాలకుర్తి 13, పరకాల 3, పర్వతగిరి 11, రఘునాథపల్లి 5, రాయపర్తి 10, రేగొండ 6, సంగెం 6, శాయంపేట 4, తాడ్వారుు 3, తొర్రూరు 2, వెంకటాపూర్ 8, వరంగల్ 6, వర్ధన్నపేట 1, జఫర్‌గఢ్ 9, చిట్యాల 4