‘అమ్మ’తనం ఎన్నో జన్మల బంధం అంటాం..‘అపురూపమైనదమ్మ ఆడజన్మ అని’ ఎన్నో విధాలుగా ‘ఆ’డ జన్మ గురించి చెప్పుకుంటుంటాం..‘కని’పెంచే దేవత అమ్మ.. కన్నబిడ్డలను ఆదరించడమే తెలుసు..పేగు తెంచుకు పుట్టిన బిడ్డను అపు‘రూపం’గా చూసుకుంటుంది. లాలిస్తుంది.. పాలిస్తుంది..కళ్లలో నలుసు పడినా తన కంట్లో పడిందని ‘హృదయం’ తల్లిడిల్లిపోతుంది.. కష్టమొస్తే ఓదారుస్తుంది.. కన్నీళ్లు వస్తే తుడుస్తుంది.. బిడ్డ చెట్టంత ఎదిగినా ఇసుమంతైనా ప్రేమ తరగదు.. ఓ తల్లికి ఏకష్టమొచ్చిందో ఏమో.. నవమాసాలు మోసింది... పండంటి మగబిడ్డకు హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో జన్మనిచ్చింది.. పాలిచ్చి..లాలించాల్సిన అమ్మకు కన్నపేగుపై మమకారం తెగిపోయింది.. పాలు తాగాల్సిన పసిగుడ్డు గుక్కపట్టి ఏడుస్తుంటే.. అక్కున చేర్చుకొని ఒడిలో లాలించాల్సిన అమ్మ.. బిడ్డ వద్దని వారించింది..
హిందూపురం అర్బన్: పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడానికి కన్న తల్లి నిరాకరించింది. చేసేదిలేక ఆ పసిగుడ్డును ఐసీడీఎస్ అధికారులు సంరక్షణాలయానికి చేర్చారు. వివరాల్లోకెళితే... రెండురోజుల క్రితం రాత్రి బెంగళూరుకు వెళ్తున్న రైలులో ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. ప్రయాణికుల సమాచారం మేరకు రైల్వే అధికారులు హిందూపురం రైల్వేస్టేషన్‌లో ఆమెను దింపివేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ అర్థరాత్రివేళ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను ఆమె పక్కనే çపడుకోపెట్టినా పాలు పట్టలేదు. బిడ్డ ఏడ్పుతో అక్కడి వారు వైద్యులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు వచ్చి ఆమెకు ఎంతగానే సముదాయించినా తనకు బిడ్డ వద్దని భీష్మించింది.
వెంటనే ఈ విషయాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ నాగమల్లేశ్వరికి తెలిపారు. సీడీపీఓ వెంట నేతన సిబ్బందితో వచ్చి బిడ్డను తమ సంరక్షణలోకి తీసుకుని బాలింతలతో పాలుపట్టించారు. బిడ్డ దూరమైతే ఆ తల్లి బాధపడి బిడ్డను చేరదీస్తుందని భావించారు. రెండురోజులైనా ఆమెలో ఎలాంటిమార్పూ రాలేదు. చివరకు అనంతపురం శిశు సంరక్షణాలయ అధికారులకు తెలియజేశారు. ఐసీపీఎస్ సూపర్‌వైజర్ దుర్గా ఆస్పత్రికి చేరుకుని ఐసీడీఎస్ అధికారులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్‌ఎంఓ రుక్మిణిల ఆధ్వర్యంలో చట్టపరంగా బిడ్డను తమసంరక్షణాలోకి తీసుకున్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ఆనందమ్మ, దస్తగిరమ్మ వైద్యసిబ్బంది పాల్గొన్నారు.