మాల్‌ లోపాలు | Special story to feeding | Sakshi
Sakshi News home page

మాల్‌ లోపాలు

Dec 5 2018 12:04 AM | Updated on Dec 5 2018 12:13 PM

Special story to feeding - Sakshi

∙పార్లమెంటు హాల్‌ డిబేట్‌లో పాల్గొంటూనే బిడ్డకు పాలిస్తున్న ఆస్ట్రేలియా సెనెటర్‌ లరిస్సా వాటర్స్‌ (ఫైల్‌ ఫొటో) 

అనడానికి ‘మాల్‌’ లోపాలు అంటున్నాం కానీ.. నిజానికైతే ఇది మగవాళ్ల లోపం! పాలకోసం ఏడ్చేబిడ్డ.. పాలిచ్చి ఏడుపు ఆపాలని ఆరాట పడే తల్లి.. మాల్‌లో ఉన్నామా.. మగవాళ్లున్న చోట ఉన్నామా  అని చూసుకుంటారా?! బహిరంగ ప్రదేశాలలో స్తన్యం ఇవ్వడం ఏమిటనిఘీంకరించే పురుష ప్రపంచం..ఈ ప్రకృతి అనివార్యతను ఎన్ని జన్మలకు అర్థం చేసుకుంటుంది? ఇంకెన్ని జన్మలకు.. తల్లి పాలివ్వడానికి అనువైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది?

పాపాయి ఏడుస్తుంది. ఏడుస్తున్న బిడ్డను చేతుల్లోకి తీసుకుని స్తన్యమిస్తుంది తల్లి. ‘‘ఇప్పుడే కదా పాలిచ్చావ్‌! మళ్లీ ఇంతలోనే ఏడుపా’’ అని అడిగే భర్తకు సమాధానమివ్వదు తల్లి. భర్తను ఓ చూపు చూసి బిడ్డను గుండెలకు హత్తుకుంటుంది. ఎందుకంటే సమాధానం ఇచ్చినా అతడికి అది అర్థం కాదు. బిడ్డ ఏడిచింది పాలకోసం కాదు తల్లి సాన్నిహిత్యం కోసం అని తెలుసుకునే అవకాశం పురుష జన్మకు ఉండదు కాబట్టి. ‘‘తిరిగి ఇంటికి వచ్చే వరకు సరిపోయేటట్లు ఫ్లాస్కులో పాలు పెట్టుకో. తీరా వెళ్లినప్పటి నుంచి ఏడుపు మొదలు పెడితే ఇబ్బంది’’.. అని భార్యను హెచ్చరిస్తాడు ఓ భర్త. బిడ్డతో బయటకు వెళ్లాల్సిన పని పడినప్పుడు. ‘‘చుట్టూ మనుషులు తిరుగుతుంటే ఇక్కడ పాలివ్వడమేంటి. అయినా బాటిల్‌లో ఉన్న పాలు తాగించవచ్చు కదా’’ అని చిరాగ్గా అంటాడు మరో భర్త.

కేన్ల కొద్దీ పాలు ఎదురుగా ఉన్నా సరే... తల్లి పాలిస్తే తప్ప పిల్లలు ఊరుకోరని ఈ మగవాళ్లకు తెలిసేదెప్పటికి! తాము తల్లి దగ్గర పాలుతాగిన జ్ఞాపకాలేవీ వాళ్లకు గుర్తుండే అవకాశం, గుర్తుకొచ్చే అవసరం వారి జీవితంలో ఉండదు. మగవాళ్లు తీర్చిదిద్దిన ప్రపంచం కూడా మగవాళ్లలానే ఉంటుంది కనుక మగ దృష్టితో మాత్రమే వారేదైనా చూడగలరు. ఓ బిడ్డకు  తనకు కావాలనిపించినప్పుడు తల్లి దగ్గర పాలు తాగే హక్కును కలిగించని, అలాగే.. బిడ్డకు పాలు అవసరమైనప్పుడు ఏ ప్రదేశంలోనైనా పాలిచ్చే హక్కును స్త్రీలకు కల్పించని సమాజ నిర్మాణం ఇది. ఒక్కమాటలో మగవాళ్ల కోసం మగవాళ్ల చేత మగవాళ్లు నిర్మించుకున్న సమాజం. అందుకే ఓ షాపింగ్‌ మాల్‌లోకి వెళ్లిన బిడ్డతల్లి తన ఏడు నెలల పాపాయికి పాలివ్వడానికి టాయిలెట్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. అలాంటిది ఆ తల్లి మనసు ఎంతగా గుక్కపట్టి ఏడ్చి ఉంటుంది! పాల కోసం ఏడ్చే పాపాయిలా.

కలకత్తా కాళి
ఇంతటి అమానుషానికి వేదిక కోల్‌కతాలోని సౌత్‌ సిటీ మాల్‌. ఆ షాపింగ్‌మాల్‌కి ఓ కొత్త తల్లి తన ఏడు నెలల పాపాయితో వచ్చింది. ఆ మాల్‌లో మల్టీనేషనల్‌ కంపెనీల షోరూమ్‌లున్నాయి. ఐస్‌క్రీమ్‌ కార్నర్‌లున్నాయి. ఒక ఫ్లోరంతా విశాలమైన ఫుడ్‌కోర్టు ఉంది. స్మోకింగ్‌ జోన్‌ కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ చంటిబిడ్డకు పాలివ్వడానికి పదడుగుల స్థలం మాత్రం లేదు. బిడ్డకు అవేవీ తెలియదు. తల్లిపాలిచ్చే వరకు ఏడుపు ఆగదు. బిడ్డ ఏడుస్తుంటే తల్లికి మనసు పిండేసినట్లవుతుంది. ఓ కార్నర్‌లో బెంచి మీద కూర్చుని పాలివ్వబోతే మాల్‌ సిబ్బంది ఒప్పుకోలేదు.

‘‘ఇక్కడ కూర్చోకూడదు. టాయిలెట్‌లోకి వెళ్లి పాలిచ్చుకోండి’’ అని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి అదే పని చేసింది. ఆ తర్వాత ఆమె తన ఆవేదనను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడంతో మాల్‌ తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు మాల్‌ నిర్వాహకులు స్పందించిన తీరు మరింత అమానుషంగా ఉంది. ‘‘మీ బిడ్డకు మీరు ఎక్కడైనా పాలిచ్చుకోవచ్చు. కానీ మా మాల్‌కి వచ్చిన ఇతర కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చూసుకోవడం మాకు ముఖ్యం’’ అనే అర్థంలో పోస్టు పెట్టింది. అప్పుడు ఆ మహిళలోని తల్లి కలకత్తా కాళి అయింది. భౌతికంగా ఉగ్రరూపం దాల్చి దండెత్తలేదనే కానీ, సుతిమెత్తని ప్రశ్నలతో మాల్‌ నిర్వాహకుల తీరును ఎండగట్టింది.

పాల కోసమే అనేముంది?
బిడ్డ ప్రతిసారీ ఆకలి, దాహంతో ఏడవదు. జనసమ్మర్థం ఉన్న చోట కొత్త గొంతులు వినిపించినప్పుడు ఆందోళనకు గురవుతుంది. తల్లి పొత్తిళ్లలోకి వెళ్లాలని కోరుకుంటుంది. తల్లి పాలిస్తూ దగ్గరకు తీసుకుంటే తనకు కొండంత భద్రత ఉందనే భరోసాతో ఏడుపు ఆపుతుంది. పిల్లలకు పాలిచ్చే గదిని ఏర్పాటు చేయడం మాల్‌కు సాధ్యమయ్యే పని కాదనేదే మీ ఉద్దేశమైతే అదే విషయాన్ని గమనికగా ఓ బోర్డు పెడితే సరిపోయేది. నాలాంటి తల్లులు మీ మాల్‌కు రాకుండా ఉంటారు. సమాజంలో చంటిబిడ్డల తల్లులు ఎప్పుడూ ఉంటారు. ఇది మొదలు కాదు, చివరా కాదు. స్మోకింగ్‌ జోన్‌కంటే బిడ్డ పాలు తాగడానికి ఫీడింగ్‌ జోన్‌ ముఖ్యమైన అవసరం కాదా?.. అంటూ మాల్‌ నిర్వాహకులకు శరాలు సంధించింది.

ఫీడింగ్‌ జోన్‌ ఎందుకుండదు?
కన్నతల్లి కడుపు రగిలి సంధించిన ఈ ప్రశ్నలు మగవాళ్ల ‘ఏక దృష్టి’ని  సరిచేస్తాయా? చేస్తే మంచిదే. ఒక వ్యవస్థ నిర్మాణంలో మహిళ కూడా ఉంటే మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సూచనలు చేస్తుంది. మహిళ భాగస్వామ్యం లేని సమాజంలో ప్రతి నిర్మాణమూ మెన్‌ఫ్రెండ్లీగానే ఉంటుంది. బార్‌ రూములుంటాయి, స్మోకింగ్‌ జోన్‌లుంటాయి తప్ప ఫీడింగ్‌ జోన్‌లుండవు. ఈ సంఘటనతో ఆలోచన రేకెత్తి.. ఇకపై రాబోయే మాల్‌ నిర్మాణాల్లో ఫీడింగ్‌ జోన్‌ ఉంటుందేమో చూడాలి. మగవాళ్లకు మహిళల అవసరాలు స్ఫురించకపోవడాన్ని తప్పు పట్టలేం కానీ, ఎదురుగా అవసరం కనిపిస్తున్నా సరే, మూర్ఖంగా ప్రవర్తించడాన్ని మాత్రం క్షమించలేం. తల్లిపాల ఆవశ్యకతను తెలియచేస్తూ ఉద్యమాలే నడుస్తున్నాయి. అది బహిరంగ ప్రదేశమైనా, పార్లమెంట్‌ సమావేశమైనా సరే.. తల్లి పాలు అవసరమైన క్షణంలోనే ఆ బిడ్డకున్న ‘పాలు తాగే హక్కు’ను తీర్చాల్సిన బాధ్యత బహిరంగ ప్రదేశాలకూ ఉంది. ఈ హక్కును సాధించుకోవడానికి బిడ్డకు చేతనైన ఆయుధం ఏడుపు ఒక్కటే. అందుకే బిడ్డ ఏడుపును గౌరవించాలి. తల్లికి ఆ క్షణంలోనే పాలిచ్చే ‘అనువు’ కల్పించాలి. 

– మంజీర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement