500  కోట్ల ‘అనకొండ’ | ACB attack on two town planning officers | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 26 2017 1:58 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB attack on two town planning officers - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు సోమవారం ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు, ఆయన బినామీ విజయవాడ టౌన్‌ ప్లానింగ్‌ జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ నల్లూరి శివప్రసాద్‌ నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు. షిర్డీ సహా రాష్ట్రంలోని 23 ప్రాంతాల్లో ఉంటున్న వారి బంధువులు, బినామీల నివాసాల్లోనూ సోదాలు జరిపారు. ఈ సందర్భంగా బయటపడిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ వాటి మార్కెట్‌ విలువ రూ.500 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

రఘు ఆస్తులివే..
మంగళగిరిలోని రఘు నివాసంతో పాటు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా మహాసముద్రం, షిర్డీ, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, విశాఖ జిల్లాల్లోని రఘు బంధువులు, బినామీల నివాసాల్లో ఏసీబీ సిబ్బంది సోదాలు జరిపారు. రఘు నివాసంలో జరిపిన సోదాల్లో.. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద 300 ఎకరాల్లో వెంచర్, బొమ్ములూరులో 1,033 చదరపు గజాల ఇంటి స్థలం, తాడేపల్లిలో నివాస స్థలాలు, మంగళగిరి కొండపనేని లేఅవుట్‌లో 220 చదరపు గజాల స్థలం, చిత్తూరు జిల్లా పులివెల్లంలో 2 ప్లాట్లు, విశాఖలో రూ.80 లక్షల విలువైన ఫ్లాట్, షిర్డీలోని హోటల్, డూప్లెక్స్‌ హౌస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అలాగే రూ.12 లక్షల విలువైన బంగారం, రూ.5 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.10 లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

మంగళగిరిలోని రఘు నివాసానికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆయనకు చెందిన రెండు కార్లను అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా రాంపల్లెలోని రఘు అత్త కళావతమ్మ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఆమె పేరు మీదున్న పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఆశీల్‌మెట్టలోని ప్రైవేటు సర్వేయర్‌ గోవింద్‌రాజు ఇంట్లో తనిఖీలు చేసి.. రూ.2.5 లక్షల నగదు, పలు రికార్డులు స్వాధీనపరుచుకున్నారు. కిర్లంపూడిలోని రఘు స్నేహితుడు కాంట్రాక్టర్‌ భాస్కరరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ సిబ్బంది.. పలు రికార్డులు తీసుకెళ్లారు. కాగా, సోమవారం సాయంత్రం కూడా సోదాల నిమిత్తం మరో బృందం రావడంతో.. వారిపై రఘు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లోకి రావొద్దంటూ కేకలు వేయడంతో పాటు అరెస్ట్‌ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు.  

బినామీ ఇంట్లో భారీగా బంగారం..
రఘు బినామీ అయిన శివప్రసాద్‌(గుణదల) నివాసంలో ఏసీబీ జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. శివప్రసాద్‌కు భారతీనగర్‌లో 16 ఫ్లాట్లు, గన్నవరం సమీపంలోని చినఅవుట్‌పల్లి 1.40 ఎకరాల్లో సాయి మిథిల కన్వెన్షన్‌ హాల్‌ ఉంది. ఆయన భార్య గాయత్రి పేరుతో భారతీనగర్, గుణదలలో రెండు భవనాలున్నాయి. పలు ప్రాంతాల్లో 11.65 ఎకరాల పొలముంది. అంతేకాకుండా ఆమె పేరు మీద సాయి సదన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్, సాయి సుధా అవెన్యూ ప్రైవేటు లిమిటెడ్, సబురి బిల్డర్స్‌ ప్రైవేటు లిమిటెడ్, శ్రీ మాతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అనే కంపెనీలున్నాయి. వీరి కుమార్తె పేరుతో భారతీనగర్‌లోనే రూ.80 లక్షల విలువైన స్థలంలో ఓ భవనం, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ప్లాట్‌ ఉంది.

శివప్రసాద్‌ కుటుంబసభ్యులు, బంధువుల పేరు మీద విజయవాడలోని గుణదల, భారతీనగర్, కృష్ణా జిల్లాలోని పోతేపల్లి, బొమ్ములూరు, గుంటూరు జిల్లా కటికలపూడి, సుకృతికోటపాడు ప్రాంతాల్లో 18కి పైగా ఖరీదైన ఇళ్ల స్థలాలున్నట్టు ఏసీబీ సిబ్బంది గుర్తించారు. అలాగే 8 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 23 కిలోల వెండి వస్తువులను అధికారులు శివప్రసాద్‌ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారంతో చేసిన ఆరు రకాల వడ్డాణాలు, జడలు, నాలుగు అరవంకలు, 25కు పైగా గాజులు, పావు కిలో బరువైన ప్లేట్లు, గ్లాసులు, వెండితో తయారు చేసిన పూజ సామగ్రి తదితర ఆభరణాలున్నాయి. అలాగే రూ.44 లక్షల నగదు కట్టలను స్వాధీనం చేసుకున్నారు. 

బినామీలు ఇంకెంతమందో!
ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న రఘుపై ఏసీబీ దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. మరోవైపు శివప్రసాద్‌ను రఘుకు బినామీ అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. గతంలో విజయవాడలో పనిచేసిన రఘుతో శివప్రసాద్, ఆయన భార్య చింతమనేని గాయత్రి కలసి విధులు నిర్వహించారు. శివప్రసాద్‌ ఇంట్లో దొరికిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గాయత్రి పేరుతోనూ, బంగారు ఆభరణాలకు సంబంధించిన బిల్లులు రఘు పేరుతోనూ ఉన్నట్టు సమాచారం. దీంతోనే శివప్రసాద్, గాయత్రీలను రఘు బినామీలుగా ఏసీబీ నిర్ధారించింది. కాగా, ఈ కేసులో దర్యాప్తు సాగుతోందని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, స్పెషల్‌ టీం డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్టు చెప్పారు. దొరికిన డాక్యుమెంట్లపై విచారణ జరుగుతోందన్నారు. రఘు, శివప్రసాద్‌ లింకులపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రఘు బినామీలు, వారి ఆస్తుల వివరాలపై తమకు ఇంకా సమాచారం అందుతోందని, వాటిపై కూడా దాడులు చేస్తామని ఠాకూర్‌ చెప్పారు. కాగా, జీవీ రఘును మంగళవారం ఉదయం విశాఖ నగరానికి తీసుకువచ్చి విచారించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement