‘నిప్పు’లాంటి నిజం
నంద్యాల మునిసిపాలిటీలో భారీగా ఆస్తి పన్ను స్వాహా!
నంద్యాల టౌన్: పాలకవర్గం లేకపోవడం.. పర్యవేక్షణ కొరవడంతో నంద్యాల ముసిసిపాలిటీలో కొందరు సిబ్బంది అక్రమ మార్గం పట్టారు. ఆస్తులు కూడబెట్టుకొనేందుకు అడ్డదారులు తొక్కారు. విధి నిర్వహణలో లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఉపాధినిచ్చిన మునిసిపాలిటీకే నమ్మక ద్రోహం చేశారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులతో కుమ్మక్కై భారీ మొత్తాన్ని మింగేశారు.
ఈ కుంభకోణం వెలుగులోకి రాకుండా చేయడానికి రికార్డుల గదిని సైతం తగలబెట్టారు. అయితే నిప్పులాంటి నిజం ఆడిట్‌లో బయట పడింది. కేవలం 350 అసెస్మెంట్లను పరిశీలించగా దాదాపు రూ.7 లక్షలు కాజేసినట్లు వెలుగు చూసింది. మునిసిపాలిటీలో దాదాపు 35 వేలకు పైగాకు అసెస్‌మెంట్లు (ఆస్తి పన్ను ఖాతాలు) ఉండగా వీరు కాజేసిన మొత్తం రూ. 6 కోట్లు ఉండవచ్చని అంచనా.
పన్ను వసూలు ఇలా..
ప్రతి ఏడాది కొత్తగా నిర్మించిన దుకాణాలు, భవనాలు, అపార్ట్‌మెంట్‌లకు మునిసిపాలిటీ పన్ను విధిస్తుంది. మున్సిపల్ బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భవనాల వద్దకు వెళ్లి కొలతలు వేసి పన్ను విధిస్తారు. ఈ పన్నును మిస్లీనియేస్ బుక్‌లో(ఎంఎల్) నమోదు చేస్తారు. తర్వాత అసెస్‌మెంట్ వివరాలు, కొలతలు, పన్ను మొత్తాన్ని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తారు. ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా ఆస్తి యజమాని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పన్ను చెల్లించాలి. నంద్యాల మునిసిపాలిటీలో ఏటా దాదాపు రూ.7 కోట్లకు పైగా పన్ను వసూలు అవుతుంది.
ఆన్‌లైన్‌లో అవకతవకలు..
మునిసిపాలిటీలోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు కుమ్మక్కయ్యారు. కొత్త భవనాలు, షాప్‌రూంలు, అపార్ట్‌మెంట్‌లకు పన్ను విధించి.. వాటిని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసే విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. ఉదాహరణకు ఒక షాప్‌రూం కొలతలు కొలిచి దాదాపు రూ.5 వేలు పన్నును నిర్ణయించారు.
ఈ మేరకు బిల్ కలెక్టర్లు, ఆర్‌ఐలు ఎంఎల్ బుక్‌లో రూ.5 వేలు పన్ను విధించినట్లు నమోదు చేశారు. తర్వాత ఆస్తి యజమానితో కుమ్మక్కై, మామూళ్లు దండుకొని రూ.5 వేల పన్నును రూ.500కు తగ్గించేశారు. ఈ మేరకు రూ.500 పన్ను విధించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రతి ఆరు నెలలకు ఆస్తి యజమాని కేవలం రూ.500 పన్నుల మాత్రమే చెల్లిస్తున్నారు. మిగతా రూ.4500 మున్సిపాలిటీ నష్టపోతుంది. ఇలా 2011-12, 2012-13లలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు.
రికార్డుల గదికి నిప్పు..
అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండటానికి రెవెన్యూ సిబ్బంది రికార్డులను తగలబెట్టినట్లు తెలిసింది. ఆడిటింగ్ అధికారులు ఆరు నెలల నుంచి మున్సిపాలిటీలోని విభాగాల వారీగా రికార్డులను పరిశీలిస్తున్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్ పక్కనే ఉన్న రికార్డుల రూపంలో ఎంఎల్ పుస్తకాలు ఉన్నాయి. మునిసిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించి రికార్డుల గదికి తాళాలు వేయకపోవడం, వరండాలో రికార్డులను చెల్లా చెదురుగా చెత్తకుప్పలా విసిరేశారు. దీంతో గత నెల 11న ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఎంఎల్ పుస్తకాలను తగలబెట్టినట్లు తెలిసింది.
దీంతో అగ్నిప్రమాదం సంభవించి ఎంఎల్ పుస్తకాలతో పాటు మరికొన్ని రికార్డులు దగ్ధమయ్యాయి. అయితే కుంభకోణానికి పాల్పడిన సిబ్బంది ఆడిటింగ్‌కు చిక్కారు. 2011-13 సంవత్సరాలకు సంబంధించిన ఎంఎల్ బుక్‌లను, ఆన్‌లైన్ అసెస్మెంట్ వివరాలను తనిఖీ చేసిన ఆడిటింగ్ అధికారులు అక్రమాలను చూసి షాక్‌కు గురయ్యారు. ఎంఎల్ బుక్‌లో ఒక పన్ను మొత్తం ఉంటే, ఆన్‌లైన్‌లో అతి తక్కువ మొత్తం నమోదై ఉంది. ఆన్‌లైన్‌లో ఉన్న పన్నునే మున్సిపల్ అధికారులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వసూలు చేస్తున్నారు.
ఇద్దరు ఆర్‌ఐలు, నలుగురు బిల్‌కలెక్టర్లు సూత్రధారులు...
ఈ కుంభకోణంలో ఇద్దరు ఆర్‌ఐలు, నలుగురు బిల్ కలెక్టర్లు సూత్రధారులైనట్లు ఆడిటింగ్ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒక ఆర్‌ఐ బదిలీపై ఏడాదిన్నర క్రితం వెళ్లారు. మరో ఆర్‌ఐ నంద్యాలలోనే విధులను నిర్వహిస్తున్నారు. మినిట్స్‌బుక్ అదృశ్యమైన కేసులో ఒక ఆర్‌ఐ సస్పెండ్ కావడంతో, ప్రస్తుతం ఉన్న ఆర్‌ఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్‌ఐ గతంలో కూడా స్టేషనరీ కుంభకోణానికి పాల్పడి సస్పెండ్ అయ్యారు. ్రపస్తుతం ఆడిట్ అధికారులు ఈ కుంభకోణానికి సంబంధించిన నివేదికను రూపొందించి, రహస్యంగా ఉంచారు. మరో రెండు మూడు రోజుల్లో నివేదిక పురలపాలక శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్‌కు పంపడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నివేదికను ఆయన పరిశీలించి సిబ్బందిపై వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.