అధికార పొరలు కమ్మిన పాలన | A.P Govt ensures pension and ration only for TDP members | Sakshi
Sakshi News home page

అధికార పొరలు కమ్మిన పాలన

Published Wed, Dec 3 2014 2:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

అధికార పొరలు కమ్మిన పాలన - Sakshi

అధికార పొరలు కమ్మిన పాలన

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, శ్రీకాకుళం రూరల్:‘అధికారం అనే పొరల మధ్య చితికిపోయిన బతుకులను ప్రభుత్వం చూడడం లేదు, ఆరు నెలల పాలనలో పేదలపై దృష్టి సారించడం లేదు. లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పట్లో ఎన్నికల్లేవ్, ఓట్ల కోసం మేం మాట్లాడటం లేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే 25 శాతం పింఛన్లు తీసేశారని, ఈ విషయంలో ప్రభుత్వానికి గానీ, అధికారులకు గానీ స్పష్టత లేదని దుయ్యబట్టారు. కనీస విచారణ కూడా జరపలేదన్నారు. అప్పట్లో రూ.200 ఫించను ఇచ్చినా కర్ర పట్టుకుని కదలలేని వృద్ధులు కూడా గొప్పగా బతికారని,ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
 
 పింఛన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకుంటోందని, నేతలంతా ఇది గ్రహించాలని సూచించారు. పదేళ్లలో జిల్లాలో పక్కా నిర్మాణాలెన్నో కట్టించారని, తుపాను వచ్చినా వేగమైన గాలిని తట్టుకున్నాయన్నారు. ‘సగం నిర్మాణం జరిగిన ఇళ్లు ఎన్నో ఉన్నాయని, ఆర్నెల్లవుతున్నా కనీసం ఇళ్లు కూడా ఇవ్వరా’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇళ్ల కోసం అర్హులే లేరా, కనీసం గుర్తించరా? బీదలకు మీరేం చెప్పదల్చుకున్నారు, సగంలో నిల్చిపోయిన, గతంలో శాంక్షన్ పొందిన వాటి పరిస్థితి ఏమిటి, లబ్ధిదారుడికి చెల్లింపులు చేస్తున్నారా’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఏటి గట్టున ఉండే ఇసుకను కుటుంబమంతా కష్టపడి పశువులకు మేత పెట్టి బళ్లతో ఫ్రీగా తెచ్చుకునేవాళ్లు. ఇప్పుడు రూ.1000 కట్టమంటున్నారు, వారి జీవన విధానాన్ని దెబ్బ తీయొద్దు, కిలో బియ్యం రూ.1కే ఇస్తుంటే, కేజీ ఇసుక రూ.2 అంటున్నారు, జిల్లాలో లక్షలాది మంది మేస్త్రీలు, కూలీలు, క లాసీలు, ప్లంబర్లకు బతుకునిస్తున్న ఇసుకపై వేటేశారు, ఏసీ రూముల్లో పొరలు కమ్మే ఆలోచనల్ని మానుకోవాల‘ని హితవు పలికారు.
 
 పరిస్థితి మారకుంటే తిరుగుబాటు తప్పదు
 రాజధాని నిర్మాణానికి ఇక్కడా అనుభవజ్ఞులైన నిపుణులున్నారని, పదేళ్లపాటు హైదరాబాద్‌లోనే రాజధాని ఉండిపోతుందన్న సాకు చూపించి, దేశంలో వేరెవ్వరూ చేయలేనట్టు వారే చేస్తున్నట్టు గొప్పలకు పోతూ హడావుడి చేస్తున్నారని..
 మన రాజధానిని మన నిపుణులతో మనమే నిర్మించుకోవచ్చని ధర్మాన అన్నారు. బాబు పాలనపై గ్రామాలో ్లసైతం నిరుత్సాహం నెలకొందని, దీన్ని సరిదిద్దుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని  హెచ్చరించారు. ‘జీవోలు ఇస్తారు.. వెంటనే రద్దు చేసేస్తారు. అవగాహన లేని విధంగా పనిచేస్తున్నారు, వ్యతిరేకత వస్తే రద్దు అంటున్నారు. అభిమానించి ప్రజలు ఓటేసి గద్దెనెక్కిస్తే ఇదా మీరు చేసేది’ అని ఘాటుగా ప్రశ్నించారు.  ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మాకు మిమ్మల్ని ప్రశ్నించే బాధ్యత ఉంది. ఇది సరైన పరిపాలన కాదని, ఆస్తులు పెంచుకోడానికి, తాబేదార్లను రక్షించుకునేందుకే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘రివ్యూ చేయండి, ఏటి గట్టున పుట్టిన కుటుంబం ఇసుక తెచ్చుకుంటే వద్దంటున్నారు, వీఆర్‌వో, పంచాయతీ సెక్రటరీ, ఎమ్మెల్యే, ఎవర్ని ఏమి అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు. రుణం ఇవ్వరు, ఎరువులు లేవు, బీమా రాదు, సబ్సిడీ లేదు, ధాన్యం కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఏడాది మధ్యలో బదిలీలా?
 ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారిందని ధర్మాన విమర్శించారు. ఏడాది మధ్యలో బదిలీలు చేశారు. ఉద్యోగులు, వారి పిల్లలూ ఏమైపోవాలి, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య కొట్లాటతో వందలాది రెవెన్యూ ఉద్యోగులను బలి చేశారు, మీ పిల్లల్నీ ఇలాగే చేస్తారా? ఎవరూ ప్రశ్నించరా, ప్రభుత్వం నడపడం అంటే ఇతరులను హింసించడమేనా అని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధాన్యం కొనుగోళ్లు ఎక్కడ, రుణ సౌకర్యం ఏదీ, పంటకు బీమా వెసులుబాటు కల్పించరా, ఎరువులే కనిపించడం లేదు, 75-25 శాతం లెవీ అనే ప్రక్రియ ఇబ్బందిగా మారింది, మంత్రులెక్కడ, మీ కోసం ప్రజలు అమాయకంగా ఎదురుచూస్తున్నారు’ అని అన్నారు. లోపాలు సరిదిద్దుకోండి, న్యాయమైన పాలన అందించండి అని ధర్మాన హితవు పలికారు. అదే విధంగా మీడియా కూడా ప్రజల పక్షాన పోరాడాలని, తప్పొప్పుల్ని ఎత్తిచూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. బారువలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై  మాట్లాడుతూ ‘చంద్రబాబు అభిప్రాయం రానీయండి, మనం నమ్మిన విషయాలపై స్థిరంగా, నిలకడగా ఉండాలంటూ’ పరోక్షంగా బాబును దెప్పిపొడిచారు. ఆయన గతంలో ఇక్కడి వారికి ఇచ్చిన హామీల్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి. పద్మావతి, పార్టీ నాయకులు శిమ్మ రాజశేఖర్, కెఎల్ ప్రసాద్, మండవిల్లి రవి, చల్లా రవి, కామేష్, అల్లు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement