మళ్లీ ఆధార్అవస్థలు!
- బయోమెట్రిక్ కారణంగా 5 నెలలుగా అందని ఉపాధి వేతనాలు
- పింఛన్‌దారుల పరిస్థితీ అంతే
- తాజాగా ఉత్తర్వులతో లబ్ధిదారుల్లో ఆందోళన
విశాఖ రూరల్ : ఆధార్ గందరగోళం మళ్లీ ప్రారంభమైంది. అన్ని పథకాలకు దీనిని తప్పనిసరి చేస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బయోమెట్రిక్ విధానం ఉపాధి కూలీలకు, పింఛన్‌దారులకు చుక్కలు చూపిస్తోంది. ఐదు నెలలుగా వేలాది మంది పెన్షన్లకు నోచుకోక అవస్థలు పడుతుంటే.. తాజాగా ఆధార్ ప్రక్రియ మరింత భారం కానుంది .
రేషన్‌కార్డుదారుల నుంచి ఉపాధి హామీ కార్మికుల వరకు ప్రతి ఒక్కరూ ఆధార్ వివరాలను నెలాఖరులోకి అందజేయాలనడంతో మళ్లీ అందరిలో ఆందోళన మొదలయింది. జిల్లాలో 44.38 లక్షల జనాభాలో 40.30 లక్షల మంది ఆధార్‌కార్డులకు వివరాలు నమోదు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఐదు నెలల క్రితం వరకు జోరుగా సాగిన ఈ ప్రక్రియకు సుప్రీంకోర్టు జోక్యంతో బ్రేక్ పడింది. సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం సమంజసం కాదంటూ సుప్రీం తీర్పుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కు తగ్గాయి. అప్పటి నుంచి ఆధార్ ప్రక్రియ నెమ్మదించింది.
తాజాగా అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని మళ్లీ కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా రేషన్‌కార్డుదారుల నుంచి ఉపాధి హామీ కార్మికుల వరకు ప్రతీ ఒక్కరు ఆధార్ కార్డు వివరాలను సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్‌తో ఆందోళన
జిల్లాలో వృద్ధాప్య పింఛన్‌దారులు 1,46,224, అభయహస్తం 18,957, వికలాంగ 37,990, కల్లుగీత 926, వితంతు 1,15,027 మొత్తంగా 3,19,124 మంది పింఛన్‌దారులు ఉన్నారు. గతంలో ఫినో సంస్థ ద్వారా పింఛన్ చెల్లింపులు జరిగేవి. ప్రస్తుతం విశాఖ పరధిలో బ్యాంకు, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్ పంపిణీకి నిర్ణయించారు. ఇందుకు నాలుగు నెలలుగా బయోమెట్రిక్ ప్రక్రియ సా...గుతోంది. నాటి నుంచి వేలాది మందికి పింఛన్‌లు అందకుండా పోయాయి. ఇప్పటికీ ఇంకా 29 వేల మంది నుంచి వివరాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే బయోమెట్రిక్ విధానాన్ని చేపట్టింది. ఇది ఉండగా మళ్లీ ఆధార్‌తో అనుసంధానం ఎందుకన్న వాదన వ్యక్తమవుతోంది. జిల్లాలో కేవలం 85 వేల మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన 2,34,124 మంది ఇంకా సీడింగ్ చేసుకోవాల్సి ఉంది. బయోమెట్రిక్ విధానం వల్లే ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొత్తగా ఆధార్‌తో సీడింగ్ చేసుకోవాలని చెప్పడం పట్ల లబ్ధిదారుల్లో ఆందోళన చెందుతున్నారు.
54 శాతం కార్డుదారులు అనుసంధానం
రేషన్‌కార్డుల విషయంలో ఆధార్‌ను తప్పనిసరి చేశారు. జిల్లాలో అన్ని రకాల కార్డులు కలిపి మొత్తం 12.35 లక్షలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 54 శాతం మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన వారు ఇంకా సీడింగ్ చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 31లోగా కార్డుదారులు ఆధార్‌కార్డుల వివరాలు అందజేయాలని పౌర సరఫరా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రజల నుంచి స్పందన మాత్రం రావడం లేదు.