‘ఆధార్’ లేకుంటే రేషన్ కట్ | 'Aadhaar' does not cut the ration | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ లేకుంటే రేషన్ కట్

Published Wed, Aug 20 2014 12:05 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

‘ఆధార్’ లేకుంటే రేషన్ కట్ - Sakshi

‘ఆధార్’ లేకుంటే రేషన్ కట్

  •      ఇవ్వని కార్డులను బోగస్‌గా గుర్తింపు
  •      రద్దుకు ప్రభుత్వానికి సిఫారసు
  •      అధికారులు, సిబ్బంది ఇళ్లకు వచ్చి సేకరణ
  •      జేసీ ప్రవీణ్‌కుమార్
  • విశాఖ రూరల్: రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు నిలిపివేస్తామని జేసీ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఆధార్ ఇవ్వని వారి కార్డులను బోగస్‌గా గుర్తించి రద్దుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 57 శాతం మంది కార్డుదారులు మాత్రమే ఆధార్‌ను సమర్పించినట్లు చెప్పారు.

    జిల్లాలో 11,72,433 తెల్లరేషన్‌కార్డు దారుల్లో 22,67,257 మంది అనుసంధానం చేసుకోగా మిగిలిన వారందరి నుంచి నెలాఖరులోగా ఆధార్‌కార్డుల సేకరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు జిల్లాలో ప్రస్తుతం 57 ఆధార్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఎవరైనా ఆధార్ తీసుకోని పక్షంలో ఆయా కేంద్రాలకు వెళ్లి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు రాకపోయినప్పటికీ నమోదు చేసుకున్న తరువాత ఇచ్చే స్లిప్ అయినా తమకు సమర్పించవచ్చన్నారు.
     
    రేషన్ నిలిపివేత

    విశాఖ పరిధిలో ఆధార్‌కార్డులు ఇవ్వని వారికి రేషన్ సరుకుల సరఫరా ఇప్పటికే నిలిపివేశామని, ఆధార్ సమర్పించిన వారికే నిత్యావసరాలను అందిస్తున్నామని తెలిపారు. ఫలితంగా విశాఖ నగర పరిధిలో 70 శాతం మంది కార్డుదారులు ఆధార్‌ను సమర్పించారన్నారు.
     
    విశాఖ పరిధిలో కూడా రెండు రోజుల పాటు ఏఎస్‌వోలు, చెకింగ్ ఇన్‌స్పెపెక్టర్లు, డీలర్లు ఇంటింటికి వెళ్లి ఆధార్‌కార్డులను స్వీకరిస్తారన్నారు.
     
    జిల్లాలో కార్డుదారులు నెలాఖరులోగా ఆధా ర్ సమర్పించని పక్షంలో వచ్చే నెల నుంచి రేషన్‌సరుకుల సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు ఇచ్చిన తరువాతే వారికి సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
     
    ర్యాప్, ట్యాప్ లబ్ధిదారులకు కూపన్లు వచ్చినప్పటికీ చాలా మంది వాటిని తీసుకోలేదని, వారిని బోగస్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు రోజుల డ్రైవ్‌లో సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి పరిశీలించడం జరుగుతుందని, వారు లేని పక్షంలో బోగస్‌గా గుర్తించి కార్డులను రద్దు చేస్తామన్నారు. జిల్లాలో 15 నుంచి 20 శాతం వరకు బోగస్ కార్డులు ఉన్నట్లు అంచనా.
     
    25న గ్యాస్ వినియోగదారుల కోసం డ్రైవ్
    గ్యాస్ వినియోగదారులు సైతం ఆధార్‌కార్డులను తప్పనిసరిగా సమర్పించాలని జేసీ సూచించారు. విశాఖ పరిధిలో 6,13,054 మంది, రూరల్‌లో 2,14,886 మంది, మొత్తంగా 8,27,940 గ్యాస్ వినియోగదారులు జిల్లాలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో 45.3 శాతంతో 3,75,005 మంది ఆధార్‌కార్డులను సమర్పించినట్లు చెప్పారు.
     
    ఈ నెల 25న గ్యాస్ ఏజెన్సీలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాయని, ఆ రోజున డీలర్ల సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వెళ్లి ఆధార్‌కార్డులను సేకరిస్తారని తెలిపారు. ఏజెన్సీలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లెసైన్సులను రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
     
    ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఇళ్లకు వచ్చే సిబ్బందికి ఆధార్‌కార్డు జెరాక్సులను ఇవ్వాలని, ముందుగా వాటిని సిద్ధం చేసుకోవాలని కార్డుదారులను, గ్యాస్ వినియోగదారులకు సూచించారు.
     
    నేడు, రేపు ప్రత్యేక డ్రైవ్
    ఆధార్ కార్డుల సేకరణ కోసం బుధ, గురువారాల్లో జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జేసీ చెప్పారు. గ్రామీణంలో ఆర్డీవో నుంచి వీఆర్వో వరకు రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆధార్ కార్డులను సేకరిస్తారని తెలిపారు. రేషన్‌షాప్ డీలర్ల వద్ద కార్డుదారుల జాబితా ఉందని, దాని ప్రకారం వారు కూడా ఇళ్లకు వచ్చి తీసుకుంటారన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement