బోగస్ కార్డులకు చెక్
- 1.84 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు!
- ఆధార్ ఆధారంగా బోగస్ కార్డులు గుర్తింపు
- చిరునామాల ఆధారంగా పరిశీలన
- స్వచ్ఛందంగా అప్పగించాలని అధికారుల విజ్ఞప్తి
సాక్షి, సిటీ బ్యూరో: జంట జిల్లాల్లో సుమారు 1.84 లక్షల తెల్లరేషన్ కార్డులను బోగస్‌గా గుర్తించి పౌర సరఫరాల శాఖాధికారులు రద్దు చేశారు. ఆధార్ అనుసంధానంతో హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 53 వేల కార్డులు, రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు 1.31 లక్షల తెల్లరేషన్ కార్డులు రద్దయ్యాయి. ఆధార్‌తో అనుసంధానం కాని తెల్లకార్డుల జాబితాలను చౌకధరల దుకాణాల వారీగా బహిరంగంగా ప్రకటించి, కార్డుదారులకు నోటీసులు జారీ చేశారు.
నెల రోజులు గడువు ఇచ్చినప్పటికీ అనుసంధానం కాని కార్డుదారుల చిరునామాల ఆధారంగా ఇంటింటికీ తిరిగి, విచారణ కొన సాగించి బోగస్‌గా గుర్తించారు. వాటిని రద్దు చేస్తూ రేషన్ సరఫరాను నిలిపివేశారు. వాస్తవంగా హైదరాబాద్ పరిధిలో సుమారు 1.55 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 3.45 లక్షల కార్డుదారులు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. ఇప్పటికే రద్దు చేసిన కార్డులను మిన హాయించి, మిగతా వాటిపై విచారణ కొనసాగిస్తున్నారు.
‘తెల్ల’ దొరలపై దృష్టి...
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో పేద కుటుంబాల సంఖ్య కంటే తెల్లరేషన్ కార్డుల సంఖ్య అధికంగా ఉండటంపై పౌర సరఫరాల అధికారులు దృష్టి సారించారు. కొంతమంది సంపన్నులు సైతం తెల్లరేషన్ కార్డుల లబ్ధిదారులుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జంట జిల్లాల్లో సుమారు రెండు లక్షల వరకు తెల్ల దొరలు ఉన్నట్లు పౌరసరఫరా అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
స్వచ్ఛందంగా అప్పగించాలని...
అర్హులు కాని వారు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉంటే వెంటనే సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లో స్వచ్ఛందంగా అప్పగించాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పౌర సరఫరాల శాఖాధికారులు రాజశేఖర్, నర్సింహారెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక విచారణ ద్వారా బయటపడితే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.