
పెట్రోల్ బంకుల్లో ఆధార్
నేటి నుంచి మున్సిపాలిటీల పరిధిలో అమలు
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
విజయవాడ : ఈ నెల 13 నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని పెట్రోల్ బంకుల వద్ద రవాణా శాఖ సిబ్బంది, మెప్మా వాలంటీర్ల సహాయంతో ఆధార్ నంబర్లు సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రవాణా శాఖ ఉప కమిషనర్ ఎస్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ రాష్ట్ర స్థాయిలో పెట్రోల్ కంపెనీల కోఆర్డినేటర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఏర్పాట్లు చేశామని వివరించారు. దీనికి సంబంధించిన ఆదేశాలు జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులకు ఇచ్చినట్లు తెలిపారు. తొలుత తిరువూరు, నూజివీడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు, జగ్గయ్యపేట, నందిగామ మున్సిపాలిటీలలో ఆధార్ వివరాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
వాహన యజమానులు తమ వాహన రిజిస్ట్రేషన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను పెట్రోలు బంకుల వద్ద మెప్మా వాలింటీర్లకు అందజేసి వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. రవాణా శాఖలో వాహన నంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసినందుకు వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రవాణా శాఖ వెబ్‌సైట్ www.aptransport.org ద్వారా కూడా ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని ఆపరేటర్లకు సూచించారు.