మొదలైన ‘సీడింగ్’ సెగలు
సాక్షి, కాకినాడ : జిల్లాలోని రేషన్‌కార్డుల్లో ఆధార్ సీడింగ్ కాని యూనిట్ల (పేర్లు)ను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ ఒకటి నుంచి వీరికి రేషన్‌సరుకులు నిలిపి వేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ లెక్కన బోగస్ సాకుతో జిల్లాలో సుమారు 2.23 లక్షల మంది పేర్లు కార్డుల నుంచి మాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది. ఆధార్‌ను తప్పనిసరి చేయవద్దని, సంక్షేమ పథకాలకు దాంతో లంకె పెట్టవద్దని సుప్రీం కోర్టు గతేడాది స్పష్టమైన తీర్పు ఇచ్చింది. వంటగ్యాస్ సబ్సిడీ నగదు బదిలీకి ఆధార్ లంకె పెట్టిన యూపీఏ సర్కార్ కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గి, చివరకు నగదు బదిలీ పథకాన్నే ఉపసంహరించుకుంది.
కానీ సుప్రీం ఆదేశాలు తమకే మీ పట్టవన్నట్టు రాష్ర్టప్రభుత్వం వ్యవహరిస్తోంది. సంక్షేమ పథకాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరునూరైనా సెప్టెంబర్ ఒకటి నుంచి దాన్ని ఆచరణలో పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. తొలుత రేషన్ కార్డులు, ఆ తర్వాత ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలన్నింటినీ ఆధార్‌తో ముడిపెట్టాలని చూస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 100 రేషన్‌షాపుల్లో అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానం అస్తవ్యస్తంగా సాగుతోంది. రేషన్‌కార్డులతో ఆధార్ సీ డింగ్ 86 శాతం పూర్తి కావడంతో మిగిలిన 14 శా తం ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నూరు శాతం పూర్తికాగానే జిల్లాలోని 2560 రేషన్‌షాపుల్లో బయోమెట్రిక్ విధానంలో సరుకుల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే బయోమెట్రిక్ విధానం అమలవుతున్న 100 రేషన్‌షాపుల పరిధిలో గత ఏడాదిన్నరలో సుమారు 1,22,889 యూనిట్లకు సంబంధించి సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు. అంటే సగటున ప్రతి నెలలో 10,241 యూనిట్లకు సంబంధించి సరుకులు తీసుకెళ్లడం లేదని నిర్ధారించారు. ఆ మేరకు నెలకు రూ.41.98 లక్షల చొప్పున ఏడాదికి రూ.5.04 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా అవుతున్నట్టు లెక్కలు తేర్చారు. ఇక జిల్లాలో తెలుపు, అన్నపూర్ణ, అంత్యోదయ, రచ్చబండలకు సంబంధించి 15,20,021 కార్డుల పరిధిలో 44,59,716 యూనిట్లు ఉంటే ఇంకా 2,23,501 యూనిట్లకు సీడింగ్ కాలేదని గుర్తించారు. వీటిలో రాజమండ్రి డివిజన్‌లో 73,795, పెద్దాపురం పరిధిలో 48,439, కాకినాడ పరిధిలో 44,819, రామచంద్రపురం పరిధిలో 26,605, అమలాపురం పరిధిలో 22,960, రంపచోడవరం పరిధిలో 6883 యూనిట్లు ఉన్నాయి.
గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతున్నా వీరంతా సీడింగ్ చేయించుకోకపోవడంతో ఇవన్నీ బోగస్‌గా అధికారులు భావిస్తున్నారు. వీటికి ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని, అప్పటికీ సీడింగ్ కాకుంటే తొలగించి సరుకులు నిలిపివేయాలని నిర్ణయించిన జిల్లా యంత్రాంగం ఆ దిశగానే క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్టు సమాచారం. అలా సరుకులు నిలిపివేయడం ద్వారా ఏడాదికి రూ.105.28 కోట్ల మేర ఆదా అవుతుందని లెక్కలేస్తున్నారు.
పొంతనలేని లెక్కలు..
అయితే అధికారుల చేతకానితనం వల్ల ఆధార్ నమోదు కాక, నంబర్ జనరేట్ కాక, సాంకేతిక లోపాల వల్ల సీడింగ్ పూర్తికాని వారే ఎక్కువ మం ది ఉన్నారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఎన్నిసార్లు తిరిగినా ఆధార్ కార్డులు కాదు కదా కనీసం ఆధార్ నమోదు కూడా కాని వారు జిల్లాలో ఇంకా లక్షల్లోనే ఉన్నారు. జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 51,51,549 మం ది కాగా, ఇప్పటికే 56,77,024 మంది ఆధార్ న మోదు చేసుకున్నారని..వీరిలో 50,09,356 మందికి ఆధార్ నంబర్లు కూడా జనరేట్ అయ్యాయని అధికారులు లెక్కలేస్తున్నారు. జనాభా లె క్కన చూస్తే ఇంకా 1,42,195 మందికి, ఆధార్ నమోదు లెక్కన చూస్తే 6,67,668 మందికి ఆ ధార్ నంబర్ జనరేట్ కాలేదని తెలుస్తోంది. అదెలా ఉన్నా ఇంకా ఆధార్ నమోదు కోసం లక్షలాది మంది అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ లెక్కల్లో ఏవి సరైనవో తేల్చకుండానే సీడింగ్ కాలేదనే సాకుతో సంక్షేమ పథకాల్ని దూరం చేయడం ఎంతవరకు సమంజసమని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. నూరు శాతం ఆధార్ నంబర్లు జనరేట్ అయ్యి, సీడింగ్ కూడా నూరు శాతం పూర్తి చేశాకే ఏ సంక్షేమ పథకానికైనా అనుసంధానం చేయాలని కోరుతున్నారు.