కాకినాడ సిటీ : ఫెడరేషన్ల ద్వారా నేరుగా లబ్ధిదారులకు రుణ సబ్సిడీ అందించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని కుమ్మరి, శాలివాహన సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ కె.నాగేంద్ర అన్నారు. మంగళవారం కలెక్టరేట్ డ్వామా సమావేశపు హాలులో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుమ్మరి, శాలివాహనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా చైర్మన్ పాల్గొని మాట్లాడుతూ వెనుకబడిన తరగతులలో కులవృత్తులు చేసుకునే అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకుంటోందన్నారు.
ఆ మేరకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ఫెడరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటివరకు 11 మంది సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. గ్రామాలలో కుమ్మరి, శాలివాహన కుటుంబాలు తక్కువగా ఉండడంతో సంఘాల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఐదుగురు సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించామని, త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి మాట్లాడుతూ 2015–16 లో 46 గ్రూపులకు సబ్సిడీ రుణం రూ.మూడుకోట్ల నాలుగు లక్షలు ఆర్థిక సహాయం అందించామన్నారు. 2016–17 సంవత్సరానికి రూ.5 కోట్ల 10 లక్షలు రుణ లక్ష్యమన్నారు. 11 సంఘాలకు రుణ మంజూరుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి హరిప్రసాద్ సంఘాల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై వివరించారు. కుమ్మరి, శాలివాహన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫెడరేషన్ల ద్వారా నేరుగా రుణ సబ్సిడీ
Published Wed, May 31 2017 7:49 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
Advertisement