ఆరోగ్య ప్రదాత వైఎస్ | aarogyasri provider ys | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ప్రదాత వైఎస్

Published Sat, May 3 2014 1:36 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఆరోగ్య  ప్రదాత వైఎస్ - Sakshi

ఆరోగ్య ప్రదాత వైఎస్

 ప్రతి పెద్దాసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం. ఆరోగ్యశ్రీ నుంచి తప్పించిన అన్ని వ్యాధులనూ మళ్లీ చేరుస్తాం. డాక్టర్ల కొరత లేకుండా జిల్లాకొక సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తాం. కొత్త రాజధానిలో కార్డియాలజీ, క్యాన్సర్, కిడ్నీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ వంటి 20 ఫ్యాకల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడిన హెల్త్‌సిటీ నిర్మిస్తాం. ఈ హెల్త్‌సిటీని జిల్లాలకు అనుసంధానం చేసి రొటేషన్ పద్ధతిలో ఎక్కడా డాక్టర్ల కొరత లేకుండా చేస్తాం.

ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను మరింత బలోపేతం చేస్తాం. 108, 104 సేవలను ఇంకా మెరుగుపరుస్తాం. ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన వారు కోలుకునే సమయంలో ఉపాధి, మందుల కోసం నెలకు రూ.3000 సహాయం చేస్తాం. నా కుటుంబం ఏ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుందో అదే హాస్పిటల్‌లో మీకూ వైద్య సేవలు అందిస్తాం.


 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో హామీ
 - రోషయ్య, కిరణ్ హయాంలో పథకంపై నిర్లక్ష్యం
 - జగన్‌మోహన్‌రెడ్డితోనే కొనసాగింపు సాధ్యం

 
 కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ :  డబ్బులేదనే కారణంతో ఏ ఒక్క పేదవాడూ ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో దివంగత  నేత, నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆగిపోతున్న గుండెలకు కొత్త ఊపిరి పోసి వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల మెట్లు ఎక్కేందుకు సైతం వెనుకాడే పేదలు ఆరోగ్యశ్రీ కార్డుతో వెళ్లి లక్షల రూపాయల విలువైన వైద్యసేవలను ఉచితంగా పొందేలా చేశారు. జిల్లాలో ఈ పథకం 2008లో ప్రారంభమైంది. 2008-09లో 6,511 మంది, 2009-10లో 10,976, 2010-11లో 14,899, 2011-12లో 15,205, 2012-13లో 17,192, 2013-14లో 19,559 మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చికిత్స చేయించుకున్నారు.

 ఈ మేరకు జిల్లాలోని ఆయా ఆసుపత్రులు 85,516 సర్జరీలకుగాను రూ.206 కోట్లను క్లెయిమ్ చేసుకున్నాయి. కర్నూలులోని ఆసుపత్రుల్లోనే గాకుండా జిల్లావాసులు ఎంతో మంది హైదరాబాద్ నగరానికి వెళ్లి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని అందుకున్నారు.. ఇప్పటికీ అందుకుంటూనే ఉన్నారు. ప్రధానంగా సూపర్‌స్పెషాలిటీ సేవలైన గుండె, మెదడు, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, కాలేయం, కిడ్నీలు వంటి అవయవాలకు వచ్చే జబ్బులకు చికిత్స చేయించుకుంటున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం సాఫీగా అమలైన ఈ పథకం తర్వాత వచ్చిన నేతల తీరుతో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. రోషయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనాకాలంలో ఆంక్షలు విధిస్తుండడంతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా కొన్నికాలం ఉండి ఉంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా రద్దు చేసేదనే వాదనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దివంగత వైఎస్సార్ కుమారుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పథకం సక్రమంగా కొనసాగుతుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఆయనను గెలిపించుకుంటామని ముక్తఖంఠంతో పేర్కొంటున్నారు.  
 
రెండుసార్లు గుండె ఆపరేషన్
నేను బార్బర్ వృత్తి చేస్తున్నాను. 2012లో గుండెనొప్పి రావడంతో కర్నూలులోని విజయహాస్పిటల్‌లో చూపించుకున్నాను. డాక్టర్లు పరీక్షించి పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు అన్ని రకాల పరీక్షలూ చేసి గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయని, వెంటనే హైదరాబాద్‌కు వెళ్లి ఓపన్‌హార్ట్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. దీంతో నేను ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న అపోలో హాస్పిటల్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాను. ఆ తర్వాత యేడాదికే నాకు మళ్లీ సమస్య రావడంతో అదే ఆసుపత్రికి వెళ్లాను. వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు ఎడమ వాల్వ్ బ్లాక్ అయ్యిందని, యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని చెప్పారు.

 వైద్యపరీక్షలకు ఖర్చు నేనే పెట్టుకోగా ఆపరేషన్ మాత్రం ఉచితంగా చేశారు. ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పినా ఇప్పటిదాకా ఇవ్వలేదు. అయితే లక్షల రూపాయల వైద్యాన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో చేయించుకోవడం మా లాంటి వారికి కలలో కూడా సాధ్యం కాదు. అలాంటిది వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని నేను కార్పొరేట్ ఆసుపత్రి గడప తొక్కగలిగాను. ఇప్పుడు నేను సజీవంగా ఉన్నానంటే రాజశేఖరరెడ్డి చలవే. ఆయన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించేది ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. ఆయననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం.
 - శ్రీరాములు, కర్నూలు
 
నా జీవితం వైఎస్ చలువే
నగరంలోని బుధవారపేటలో 30 ఏళ్ల నుంచి బార్బర్ వృత్తిని చేస్తున్నాను. వచ్చే ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకోవాలి. అలాంటి 2012లో నాకు గుండెపోటు వచ్చింది. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. పేదవారమైన మేము అంత డబ్బు తేలేమని చెప్పాను. తర్వాత ఆయన సలహా మేరకు ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాను.

ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఒక్క రూపాయి కూడా వైద్యం కోసం ఖర్చు చేయలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల నాలాంటి వారు ఎందరో ప్రాణాలు కాపాడుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే నా జీవితం వైఎస్ పెట్టిన భిక్ష.  ఆయన కుమారుడు గాకుండా వేరొకరు వస్తే ఈ పథకం ఉంటుందన్న నమ్మకం లేదు.
 - జె.ఆదినారాయణ, శరీన్‌నగర్, కర్నూలు
 
నాకు, నాకూతురికి ప్రాణం పోశారు
రెండేళ్ల క్రితం వరకు నేను కడుపునొప్పితో బాధపడేదాన్ని. ఒకసారి నొప్పి తీవ్రం కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పేగుల్లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ వెళ్లి ప్రైవేటులో ఆపరేషన్ చేయించుకోవాలని, రూ.2 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. మరోసారి డాక్టర్‌ను సంప్రదించగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కర్నూలులోని విజయ హాస్పిటల్‌లో ఉచితంగా ఆపరేషన్ చేశారు.

మూడు నెలలకే నా కూతురుకు సైతం ఆరోగ్య సమస్య రావడంతో ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచితంగా ఆపరేషన్ చేయించాం. నా భర్త గౌస్‌బాషా టూ వీలర్స్‌కు పెయింటింగ్ వేస్తాడు. ఆ వచ్చే నాలుగు రాళ్లతో కడుపునింపుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ లేకపోతే నాతోపాటు నాకూతురు పరిస్థితి ఎలా ఉండేదో. వైఎస్ రాజశేఖరరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన కుమారుడిని గెలిపించుకుంటాం.
 - ఎస్.షంషున్నీసా, ఖల్లావీధి, కర్నూలు
 
వైఎస్ కుటుంబం మేలు మరచిపోలేం
నేను డిగ్రీ వరకు చదివాను. చిన్న బంకు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సాయి లక్ష్మికి పుట్టుకతోనే గుండెజబ్బు వచ్చింది. ఈ విషయం తెలసి చాలా రోజులు నిద్రహారాలు మాని భాధ పడ్డాం. ఆపరేషన్‌కు లక్షలాది రూపాయలవుతాయని ఆ స్థోమత లేక చిన్నారిని ఎలా బతికుంచుకోవాలని భాధపడుతుండగా వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మాకు వరంగా మారింది.

ఆ దేవుడు దయవల్ల పాపకు హైదరాబాద్‌లో అపోలో హాస్పిటల్‌లో ఆపరేషన్ చేశారు. అయితే అక్కడి వైద్యులు  రెండోసారి కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో డబ్బులేక అల్లాడిపోయాం. అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 9 -11-12 తేదీన మావూరి మీదుగా పాదయాత్ర చేస్తున్నారని తెలిసి, మా గోడు ఆమెకు చెప్పాం. అందుకు ఆమె స్పందించి డాక్టర్లతో మాట్లాడారు. దీంతో మా పాపకు రెండో ఆపరేషన్ చేశారు. ఇందుకు రూ. 4 లక్షలు ఖర్చయింది. ఇపుడు మా పాప ఆరోగ్యంగా ఉంది. ఎన్ని జన్మలెత్తినా వైఎస్ కుటుంబం మేలు మరిచిపోలేం.
 - రఘువర్ధన్ రెడ్డి, అగ్రహారం, మద్దికెర మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement