
సాక్షి, పశ్చిమగోదావరి : ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లా ఎంపికైంది. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య, ఆరోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సొంత జిల్లా నుంచి ఈ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. 2020 జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేయనున్నారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మూడు నెలలపాటు పథకం అమలును అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత దీనిని క్రమంగా అన్ని జిల్లాలకు వర్తింపు చేస్తారు. కాగా ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితా తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ జాబితాలో ఇప్పుడున్న వ్యాధుల సంఖ్య రెట్టింపు కానుంది. 2వేలకుపైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే వెసలుబాటు కలుగనున్నట్లు సమాచారం.
అర్హులైన ప్రతి కుటుంబానికీ హెల్త్ కార్డు, క్యూఆర్ కోడ్‌తో కార్డుల జారీ చేయనున్నారు. కార్డు స్కాన్ చేయగానే ఆ కార్డుదారునికి ఓటీపీ నంబర్ వస్తుంది. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయి. అదే విధంగా 104 వాహనాల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా ఎవరైనా ఆస్పత్రికి వెళ్లినప్పుడు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది వైద్యులకు సులభంగా తెలిసే అవకాశం ఉంటుంది. వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ గోప్యంగా ఉంచుతారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ వర్తించేలా నిబంధనలు రూపొందించనున్నారు. డిసెంబర్ 21 నుంచి కార్డుల జారీ ప్రారంభం అవుతుంది. అదే విధంగా నవంబర్ మొదటివారం నుంచి రాష్ట్రం వెలుపల హైదరా బాద్, బెంగళూరు, చెన్నైల్లోని సుమారు 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.