తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల నిలిపివేత | Abolition Of VIP Darshan In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల నిలిపివేత

Published Fri, Jul 19 2019 8:38 AM | Last Updated on Fri, Jul 19 2019 9:00 AM

Abolition Of VIP Darshan In Tirumala - Sakshi

తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శన విధానంలో అమలవుతున్న కేటగిరి దర్శనాలకు టీటీడీ మంగళం పాడింది. గురువారం నుంచి నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తెచ్చింది. కొద్ది రోజుల పాటు ఈ విధానాన్ని పరిశీలించి, ఏవైనా లోటుపాట్లు ఎదురైతే పునఃసమీక్షించుకుని భక్తులకు సంతృప్తికర దర్శనాన్ని అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

సాక్షి, తిరుమల : వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దుచేసి 2009కి పూర్వం అమల్లో ఉన్న దర్శన విధానాన్ని అమలుచేయడంపై భక్తులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. భక్తుల కోసం టీటీడీ పలు క్యూలు అందుబాటులో ఉంచింది. సర్వదర్శనం క్యూ, నడకదారి భక్తుల కోసం దివ్యదర్శనం క్యూ, రూ.300లు చెల్లించిన వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ, చంటిబిడ్డల తల్లిదండ్రులు కోసం సుపథం మార్గం, వయోవృద్ధులు, వికలాంగులు కోసం మరో క్యూ.. ఇలా అనేక క్యూలను టీటీడీ ఏర్పాటు చేసింది.

సిఫార్సు లేఖలపై దర్శనం కోసం ప్రతి నిత్యం ప్రత్యేకంగా సమయాన్ని టీటీడీ కేటాయిస్తోంది. గతంలో సిఫార్సు లేఖలపై సెల్లార్‌ దర్శనం, అర్చనానంతర దర్శనం టికెట్లను కూడా కేటాయించే టీటీడీ ఇవన్నీ దళారులకు అడ్డాగా మారిపోయాయంటూ 2009లో వాటిని అన్నింటినీ రద్దుచేసింది. సిఫార్సు లేఖలపై కేవలం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను మాత్రమే కేటాయించడం మొదలుపెట్టింది. గతంలో వీఐపీ బ్రేక దర్శనాలు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఉండగా సామాన్య భక్తులకు ప్రాధ్యానత ఇవ్వాలంటూ ఉదయం సమయానికి మాత్రమే పరిమితం చేసింది. 

మూడు కేటగిరీలు
వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు గతంలో ఒకే విధానం అమల్లో ఉండేది. రూ.500లు చెల్లించిన భక్తులను కులశేఖర పడి వరకు టీటీడీ అనుమతించేది. 2009లో అప్పటి ఈఓ ఐవైఆర్‌ కృష్ణారావు ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. టాప్‌ ప్రయారిటీ, ప్రయారిటీ, జనరల్‌ అంటూ వీఐపీ బ్రేక్‌ దర్శనాలను మూడు కేటగిరీలుగా విభజించారు. టాప్‌ ప్రయారిటీ అంటూ ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే టిక్కెట్లను జారీచేసి వారిని కులశేఖరపడి వరకు అనుమతించడమే కాకుండా హారతి, తీర్థం, శఠారి ఇస్తుండేవారు. ప్రయారిటీ టికెట్టు కింద ద్వితీయ శ్రేణిగా పరిగణించి ఈ టికెట్‌ పొందిన భక్తులను కులశేఖరపడి వరకు అనుమతించి హారతి మాత్రమే ఇచ్చేవారు.

జనరల్‌ కోటాలో ప్రముఖుల సిఫారస్సు చేసిన వారికి టికెట్టును జారీచేసి కులశేఖరపడి వరకు అనుమతించినా హారతి ఇచ్చేవారు కాదు. రానురాను పరిస్థితి మారిపోయింది. సిఫార్సు లేఖలను తీసుకునే భక్తులు బ్రేక్‌ దర్శనం అడగడం మానేసి టాప్‌ ప్రయారిటీ దర్శనం ఇప్పిస్తారా, ప్రియారిటీ దర్శనం ఇప్పిస్తారా అంటూ అడగడం మొదలుపెట్టారు. పాలకమండలిపై ఒత్తిడి పెరిగింది. బాపిరాజు చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ విధానాని రద్దుచేసేశారు. కానీ కొన్ని రోజులకే తిరిగి వాటి స్థానంలో ఎల్‌ –1, ఎల్‌–2, ఎల్‌ –3 దర్శనాలు వచ్చేశాయి. పేరు మారినా దర్శన విధానంలో మాత్రం చిన్నపాటి మార్పులను టీటీడీ చేసింది. 

ఎల్‌–1 కోసం ఒత్తిళ్లు
ఎల్‌–1 టికెట్లు పొందిన వారికి లభించే సేవల వల్ల ఆ టికెట్లకు భలే గిరాకీ ఏర్పడింది. బ్రేక్‌ దర్శనం అడిగేవారంతా ఎల్‌–1 కోసమే అధికారుల పై ఒత్తిడి తెచ్చేవారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలకమండలి నుంచి ఒత్తిడిని తట్టుకోలేక ఇతరులకు కూడా అధికారులు టిక్కెట్లు జారీ చేయడం మొదలు పెట్టారు. దీంతో బ్రేక్‌ దర్శనానికి అధిక సమయం పట్టడంతో పాటు ఈ విధానం దళారీలకు కాసుల పంట పం డించింది.  ఇతరుల ద్వారా టికెట్లను పొంది భారీ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యం
నూతనంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి సూచనలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించడంపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలో బ్రేక్‌ దర్శనాలను రద్దుచేసి 2009కి పూర్వం ఉన్న విధానాన్నే అమలుల్లోకి తెచ్చారు. ఆ విధానం గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. కేటగిరీలుగా ఉన్న దర్శనాలను పూర్తిగా ఎత్తివేసి బ్రేక్‌ దర్శనం కింద ప్రతి ఒక్కరికి సాధారణ టికెట్లను జారీచేస్తున్నారు.

ప్రముఖులకు ఇబ్బంది లేకుండా..
ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు ఇబ్బంది కలగకుండా వారు స్వయంగా వస్తే వారికి ఇవ్వాల్సిన మర్యాదలను ఇస్తూ వారికి హారతి, దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. తీర్థం, శఠారీలను రాములవారి మేడలో కొలువు జరిగే ప్రదేశంలో ఇస్తోంది. ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు దర్శనం పూర్తవగానే వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన ఇతర భక్తులకు కులశేఖర పడిలో ఓచోట హారతి పళ్ళాన్ని పెట్టి అక్కడి నుంచే స్వామివారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement