ఏపీ: కోలుకున్న వారు 63.49 శాతం | Above 63 percent of those recovered from Corona in AP | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారు 63.49 శాతం

Published Wed, Jun 3 2020 4:41 AM | Last Updated on Wed, Jun 3 2020 8:10 AM

Above 63 percent of those recovered from Corona in AP - Sakshi

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతంతో పోల్చితే రాష్ట్రంలో ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో రికవరీ శాతం 63.49 ఉండగా.. దేశ వ్యాప్తంగా చూస్తే ఆ శాతం 48.51గా నమోదైంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 12,613 మందికి పరీక్షలు నిర్వహించగా 115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం నమోదైన కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 33 మంది ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,791కు చేరుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 40 మంది డిశ్చార్జి కావడంతో మంగళవారం నాటికి వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,407కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,320గా ఉంది.  

నేటితో 4 లక్షల టెస్టుల మైలురాయికి.. 
కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో మైలురాయిని చేరుకోబోతోంది. బుధవారం నాటికి 4 లక్షల టెస్టులు చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించనుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3.95 లక్షల టెస్టులు చేశారు. పది లక్షల జనాభాకు రాష్ట్రంలో సగటున 7,410 మందికి టెస్టులు చేస్తున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 4 లక్షల టెస్టులు చేసిన రాష్ట్రాల్లో రాజస్తాన్, తమిళనాడు, మహారాష్ట్రలు మాత్రమే ఏపీ కంటే ముందున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల జనాభాతో పోల్చుకుంటే ఏపీలో జనాభా చాలా తక్కువ. దేశంలో మంగళవారం నాటికి 39.66 లక్షల పరీక్షలు జరగగా అందులో 3.95 లక్షల పరీక్షలు అంటే సుమారు 10 శాతం టెస్టులు ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగాయి. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్‌ రేటు 0.96 శాతం ఉండగా దేశీయ సగటు 4.96 శాతంగా ఉంది. 

కరోనా నియంత్రణకు రూ.300 కోట్లు వ్యయం
భారీగా మౌలిక వసతుల ఏర్పాటు  
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఇప్పటివరకూ రూ.300 కోట్ల పైచిలుకు నిధులు వ్యయం చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి. మార్చి 14న రాష్ట్రంలో తొలికేసు నమోదైన నాటినుంచి ఇప్పటివరకూ అవసరమైన మౌలిక వసతులు కల్పించారు. ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు, ఎన్‌95 మాస్కులు, పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌)లు భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. ఇవన్నీ ఒకెత్తయితే రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో కరోనా బాధితుల కోసం ఐసొలేషన్‌ వార్డులు సిద్ధం చేశారు. 5 రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు, 13 జిల్లా కోవిడ్‌ ఆస్పత్రుల్లో పడకలు పెంచారు. కరోనా సోకిన నాటికి రాష్ట్రంలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ (తిరుపతి) ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 14కు చేరింది. ఒక్కో ల్యాబొరేటరీకి రూ.4 కోట్లు వ్యయం చేసి కొత్తగా ఏర్పాటు చేశారు. అంతేకాదు 100 వెంటిలేటర్లు పైగా కొనుగోలు చేశారు. వీటన్నిటికి రూ.300 కోట్లు వ్యయం కాగా జాతీయ ఆరోగ్యమిషన్‌ రూ.200 కోట్లు ఇచ్చింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement