సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా మూడోవేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించేందుకు వైద్యశాఖ నిర్వహిస్తున్న 35వ ఫీవర్ సర్వే చురుగ్గా సాగుతోంది. వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.62 కోట్ల గృహాలుండగా ఇప్పటివరకు 99.12 లక్షల ఇళ్లల్లో (60.69 శాతం) సర్వే పూర్తయింది.
వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 79.3 శాతం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 78 శాతానికి పైగా సర్వే పూర్తయింది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న విశాఖపట్నం జిల్లాలో మాత్రం ఫీవర్ సర్వే ఆలస్యంగా నడుస్తోంది. ఈ జిల్లాలో సర్వే రాష్ట్రంలోనే అత్యల్పంగా 34.92 శాతమే పూర్తయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సర్వేలో కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న 12,867 మందిని గుర్తించారు. వీరిలో 8,775 మంది నుంచి నమూనాలు సేకరించారు. వీరిలో 57 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 5,149 మందికి నెగిటివ్‌గా తేలింది. మిగిలిన ఫలితాలు వెలువడాల్సి ఉంది.
ఆస్పత్రుల్లో పడకలు, ఇతర వసతులపై దృష్టి
కరోనా మూడోదశ వ్యాప్తి నేపథ్యంలో ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడకుండా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. గత ఏడాది రెండోదశ వ్యాప్తి సమయంలో 48,874 పడకలు ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరిన సమయంలో పడకలకు డిమాండ్ పెరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని డిమాండ్ పెరిగినా.. అందుకు అనుగుణంగా పడకలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 717 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసీయూ, నాన్–ఐసీయూ ఆక్సిజన్, సాధారణ పడకలు 67,569 అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇప్పటికే 54,361 పడకలు అందుబాటులోకి రాగా.. 13,208 పడకలను సమకూరుస్తున్నారు. ప్రతి ఆస్పత్రికి ఒక నోడల్ అధికారి, హెల్ప్‌డెస్క్, పడకల లభ్యత ప్రదర్శన బోర్డు, సీసీ కెమెరాల ఏర్పాటు.. తదితర నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
నియోజకవర్గానికి ఒక కేర్ సెంటర్
నియోజకవర్గానికి ఒకటి చొప్పున కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 117 నియోజకవర్గాల్లో 33,633 పడకల సామర్థ్యంతో కోవిడ్ కేర్ కేంద్రాలను గుర్తించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా వీటిని ప్రారంభించి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 638 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చేరారు. ప్రతి సెంటర్ వద్ద వైద్య బృందాన్ని, సరిపడా మందులు, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచడమేగాక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.
వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి
షుగర్, బీపీ, క్యాన్సర్, ఎయిడ్స్ ఇతర జబ్బులతో బాధపడేవారు కోవిడ్ వైరస్ బారినపడితే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. 104 ద్వారా టెలీ మెడిసిన్ సేవలను ప్రభుత్వం అందిస్తోంది. వీరు వైద్యుల సూచనల మేరకు ముందే అప్రమత్తమై ఆస్పత్రుల్లో చేరాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక జబ్బులు ఏమీ లేనివారిపై ప్రస్తుతం వైరస్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఆక్సిజన్ శాచ్యురేషన్ తగ్గిపోతుండటం, తీవ్రమైన దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు తమ కుటుంబ వైద్యుడు, స్థానిక ప్రభుత్వ వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచన మేరకు ఆస్పత్రిలో చేరాలి. వైరస్ వ్యాప్తిపై నిరంతరం జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేస్తున్నాం. కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు చేపడుతున్నాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆస్పత్రుల్లో పడకలు కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment