మత్తయ్య అరెస్టుపై రేపటి వరకు స్టే
ఓటుకు కోట్లు కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య దాఖలుచేసుకున్న క్వాష్ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు గురువారానికి వాయిదా వేసింది. మత్తయ్య అరెస్టుపై స్టేను కూడా గురువారం వరకు పొడిగించింది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అందువల్ల తన పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించేలా చూడాలంటూ మత్తయ్య పిటిషన్ దాఖలుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో బుధవారం మధ్యాహ్నం 3.30 నుంచి సుమారు 4.20 ప్రాంతం వరకు వాదనలు కొనసాగాయి. స్టీఫెన్సన్, మత్తయ్య తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.
క్వాష్ పిటిషన్ను విచారిస్తున్న న్యాయస్థానాన్ని మార్చాలంటూ స్టీఫెన్సన్ దాఖలు చేసిన 'నాట్ బిఫోర్' పిటిషన్పై కూడా వాదనలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్వాష్ పిటిషన్పై వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. వాదనలు వాడివేడిగా కొనసాగాయి. నిందితుడి తరఫున ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా వాదిస్తారని, ఏపీ ప్రభుత్వం మత్తయ్యను రక్షించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ కేసులో మత్తయ్య అన్ని వ్యవహారాలను చక్కబెట్టారని, ఈయన అరెస్టుపై స్టే ఇవ్వడం సమంజసం కాదని జడ్జి వద్ద ప్రస్తావించారు. అనంతరం మత్తయ్య క్వాష్ పిటిషన్పై విచారణను జడ్జి గురువారానికి వాయిదా వేశారు.