'జడ్జి లేకుండా కోర్టు లేదు'
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వేసిన నాట్ బిఫోర్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. స్టీఫెన్సన్ పిటిషన్పై విచారణ పూర్తయ్యాకే మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు.
ఇక స్టీఫెన్సన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో గురువారం తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల న్యాయవాదులు భిన్నమైన వాదనలు వినిపించారు. స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్లో లోపాలు ఉన్నాయని మత్తయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా, స్టీఫెన్సన్ తరఫు న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఇరువురు న్యాయవాదులు సంయమనం పాటించాలని సూచించారు.
ఈ పిటిషన్ను ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి దాఖలు చేశారని, ఇటువంటి ఘటనలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్టీఫెన్సన్ తరపు న్యాయవాది వాదించారు. దేశానికి సిగ్గుచేటుగా మారిన ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ జడ్జి లేకుండా కోర్టు లేదని, కోర్టు గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోమని, నియమ నిబంధనల ప్రకారమే కోర్టు పనిచేస్తుందని, మీడియాలో వచ్చిన కథనాలు కోర్టులను ప్రభావితం చేయలేవని అన్నారు.
కాగా స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్తో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ తెలిపారు. పిటిషన్లోని అంశాలు స్టీఫెన్సన్ వ్యక్తిగత అభిప్రాయమని, కోర్టు ఇవ్వబోయే తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సందేహాలు, అభ్యంతరాలు ఉండవని పేర్కొన్నారు.