ఏసీబీ ఎప్పుడు పిలిచినా రావాలి
హైదరాబాద్: ఏసీబీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని 'ఓటుకు కోట్లు' కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు ఏసీబీకి సహకరించాలని సూచించారు. రేవంత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తులతో ష్యూరిటీ సమర్పించాలని, పాస్ పోర్టును సరెండర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ మధ్యాహ్నం 12.30 గంటల లోపు కోర్టు ఆర్డర్ వచ్చే అవకాశముందని రేవంత్ తరపు లాయర్ తెలిపారు. ఆర్డర్ కాపీని చర్లపల్లి జైలులో సమర్పించిన తర్వాత రేవంత్ రెడ్డి విడుదలవుతారని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా ముగిసేటప్పటికి సాయంత్రం అయ్యే అవకాశముంది.
నిబంధనలను ఉల్లంఘిస్తే బెయిల్ ను కోర్టు రద్దు చేసే అవకాశముందని న్యాయవాదులు తెలిపారు. చార్జీషీటు వేసిన తర్వాత నిందితులు అందరి పేర్లు బయటికి వస్తాయని చెప్పారు.