'ఓటుకు కోట్లు' కేసులో రేపు కీలక పరిణామాలు
హైదరాబాద్ : 'ఓటుకు కోట్లు' కేసులో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఏసీబీ రేపు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది. మరోవైపు ఈ కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వ్యవహారంపై కూడా బుధవారం హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. దాంతో దర్యాప్తుపరంగా ఈ కేసుకు సంబంధించి కీలక అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
కాగా ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ హైకోర్టు ఈ నెల 24 కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు వీలుగా హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ముట్టజెప్పే ప్రయత్నాలు చేయడంతో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రేవంత్‌రెడ్డి తదితరులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. ఈ నేపథ్యంలో వారు బెయిల్ కోసం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితునిగా ఉన్న మత్తయ్య తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఈనెల 24వరకూ ఆయనను అరెస్ట్ చేయరాదంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ఇక సంచలనాత్మకంగా మారిన ఈ కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ ఇస్తే తలెత్తే పరిణామాలు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకున్న మీదట బెయిల్ పిటిషన్‌పై ఏజీ ద్వారా వాదనలు వినిపించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.