రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల పూచీకత్తుతో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. పాస్ పోర్టు అప్పగించాలని... తన నియోజకవర్గం కొడంగల్ కే పరిమితం కావాలని ఆదేశించింది.
విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించినందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ తీర్పు వెలువరించింది. ఉదయసింహా, సెబాస్టియన్ లకు కూడా కోర్టు బెయిలిచ్చింది.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు లంచం ఇవ్వజూపడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసేలా కుట్రలు చేసిన రేవంత్ రెడ్డి బెయిల్ పొందితే సాక్షులు, ఇతర ఆధారాలను రేవంత్ ప్రభావితం చేయగలరన్న ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు.
సంబంధిత ప్రక్రియ పూర్తయితే మంగళవారం సాయంత్రమే రేవంత్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 50 లక్షలు లంచం ఇస్తూ ఏసీబీకి పట్టుబడ్డ రేవంత్ రెడ్డి గత నెలరోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.