నేడు రేవంత్ బెయిల్పై హైకోర్టు తీర్పు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు (మంగళవారం) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఉదయం 10:30 గంటలకు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ పిటిషన్ కు సంబంధించి గడిచిన బుధవారమే (జూన్ 25న) వాదనలు పూర్తికాగా తీర్పును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం రేవంత్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు (జులై 13 వరకు) పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. కేసు దర్యాప్తు దశలోనే ఉన్నందున ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయగలరని, అతడికి ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయకూడదంటూ ఏసీబీ చేసిన వాదనలను ఏసీబీ కోర్టు విశ్వసించిన దరిమిలా అతనికి రిమాండ్ పొడిగించిన సంగతి తెలిసిందే.
ఇక హైకోర్టులో రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరఫున తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదించారు. నేటి తీర్పు ఒకవేళ రేవంత్ కు అనుకూలంగా వస్తే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. చర్లపల్లి జైలు నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు ర్యాలీ తీసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. అయితే అందుకు పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది కొద్ది సేపట్లో తేలిపోనుంది.