రేవంత్ బెయిల్‌పై 30న తీర్పు | verdict on revanth reddy bail petition willbe on 30th june | Sakshi
Sakshi News home page

రేవంత్ బెయిల్‌పై 30న తీర్పు

Published Sat, Jun 27 2015 1:45 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

రేవంత్ బెయిల్‌పై 30న తీర్పు - Sakshi

రేవంత్ బెయిల్‌పై 30న తీర్పు

- ‘ఓటుకు కోట్లు’ నిందితుల బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు
- కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని అనుకుంటున్నా.. కుట్ర కోణం కూడా ఉన్నట్లు భావిస్తున్నానన్న జస్టిస్ ఇలంగో
- అరెస్ట్‌కు కారణాలు చూపకపోవడాన్ని ప్రశ్నించిన న్యాయమూర్తి
- బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి
- విచారణకు పూర్తిగా సహకరించారని, తెలిసినవన్నీ చెప్పారని నివేదన
- కేసు చాలా తీవ్రమైందని, బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు ఏజీ విజ్ఞప్తి
- రేవంత్ తదితరుల చర్యలతో ప్రభుత్వమే కూలిపోయేదని వివరణ
- వారికి బెయిలిస్తే మరో రాష్ట్రానికి పారిపోవచ్చని కోర్టుకునివేదన
 
సాక్షి, హైదరాబాద్:
‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహల బెయిల్ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తమకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్‌లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం ఇరువర్గాల తుది వాదనలు విన్నారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, జి.కల్యాణ్ చక్రవర్తి, ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, స్పెషల్ పీపీ రవికిరణ్‌రావు వాదనలు వినిపించారు.

పీసీ యాక్ట్ వర్తించదు.. బెయిలివ్వండి: పిటిషనర్లు
తొలుత సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ... దర్యాప్తు అధికారులు ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారని, అన్ని ఆధారాలను వారి స్వాధీనంలో ఉంచుకున్నారని కోర్టుకు చెప్పారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇవన్నీ వద్దు. రెండే విషయాలు చెప్పండి. బెయిల్ ఎందుకు ఇవ్వాలో మీరు చెప్పండి. ఎందుకు ఇవ్వకూడదో అడ్వొకేట్ జనరల్ చెబుతారు. మీ వాదనలను ఈ విషయాలకే పరిమితం చేయండి..’’ అని స్పష్టం చేశారు.

దీంతో లూత్రా వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు బెయిల్ నిరాకరించిన రోజు నుంచి ఇప్పటివరకు ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు. ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద పిటిషనర్లపై కేసు నమోదు చేశారని, అది పిటిషనర్లకు వర్తించదని నివేదించారు. ఐపీసీలోని సెక్షన్ 171(బి) మాత్రమే వర్తిస్తుందన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ... ‘ఓటుకు నోటు కేసు పీసీ యాక్ట్ పరిధిలోకి వస్తుందా, లేక ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందా..?’ అని ప్రశ్నించారు. దీంతో లూత్రా జేఎంఎం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఓటుకు నోటు దేనికి వస్తుందనేది ఎక్కడా స్పష్టంగా చెప్పలేదన్నారు.

ఐపీసీ కింద గానీ, ఎన్నికల నేరం విషయంలో గానీ పిటిషనర్లపై పెట్టిన కేసు బెయిల్ ఇవ్వదగినదని కోర్టుకు నివేదించారు. పిటిషనర్లను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. పూర్తిస్థాయిలో ప్రశ్నించారని, పిటిషనర్లు తమకు తెలిసినదంతా చెప్పారని పేర్కొన్నారు. ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారని.. ఇక ఈ కేసులో చేయాల్సింది ఏమీ లేనందున పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.

బెయిల్ ఇవ్వొద్దు..: ఏజీ
ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటేసినా, ఓటింగ్ హాజరుకాకపోయినా రూ.2కోట్లు ఇస్తామని స్టీఫెన్‌సన్‌ను మొదట మత్తయ్య సంప్రదించారని, ఆ తరువాత ఐదుకోట్లు ఇస్తామంటూ రేవంత్‌రెడ్డి తదితరులు వచ్చారని కోర్టుకు నివేదించారు. రేవంత్ తదితరుల ప్రలోభాలపై స్టీఫెన్‌సన్ ఏసీబీకి ఫిర్యాదు చేశారని, ఏసీబీ అధికారులు వలపన్ని రేవంత్ సహా మిగిలిన నిందితులను పట్టుకున్నారని వివరించారు.

మొదట రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారని రామకృష్ణారెడ్డి చెప్పగా... ‘‘అవును.. ఆ వీడియో క్లిప్పింగ్‌లను నేను కూడా టీవీల్లో చూసాను. ఎవరో నోట్ల కట్టలు తీసి ఇస్తున్నారు. ఇవన్నీ కాదు. బెయిల్ ఎందుకు ఇవ్వరాదో చెప్పండి. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని అనుకుంటున్నాను. కుట్ర కోణం కూడా ఉంది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే బెయిల్ పొందేందుకు పిటిషనర్లు ఎందుకు అర్హులు కాదో చెప్పండి..’’ అని న్యాయమూర్తి ఏజీకి సూచించారు.

ఏడు కారణాలు..
నిందితులకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో చెబుతూ ఏజీ రామకృష్ణారెడ్డి ఏడు కారణాలను వివరించారు. 1.కేసు చాలా తీవ్రమైనది. 2.కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. 3.ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు అందాలి. 4.కాల్ డేటాను విశ్లేషించాలి. 5.మరి కొంత మంది సాక్షులను విచారించాలి. 6.అసలు ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. 7.బెయిల్ మంజూరు చేస్తే ఈ వివరాలన్నీ వెలుగులోకి రావు.. అని కోర్టుకు నివేదించారు. రేవంత్ ఎమ్మెల్యేగా ఉండీ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలని చూశారని, అటువంటి వ్యక్తికి సాక్షులను ప్రభావితం చేయడం కష్టం కాకపోవచ్చని ఏజీ పేర్కొన్నారు.

‘ఈ రోజు ఒక ఎమ్మెల్యేలను కొనాలని చూశారు. రేపు పది మందిని కొనే యత్నం చేయవచ్చు. తద్వారా ప్రభుత్వాన్ని కూల్చివేయవచ్చు. ఎమ్మెల్యేలను వారు బహిరంగంగానే కొనే ప్రయత్నం చేశారు..’ అని కోర్టుకు నివేదించారు. ‘నిందితులు జైల్లో ఉన్న సమయంలో, మీరేవైనా వివరాలు తెలుసుకున్నారా..?’ అని న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీ చేశారని, అతను మరో రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్నారని, నిందితుడు మత్తయ్య పరారీలో ఉన్నారని కోర్టుకు ఏజీ వివరించారు. ఇప్పుడు రేవంత్ తదితరులకు బెయిలిస్తే, వారు కూడా ఆ రాష్ట్రానికి వెళ్లి దర్యాప్తునకు సహకరించకపోవచ్చునని నివేదించారు.

అయితే ఈ సమయంలో కేసు డైరీని పరిశీలించిన న్యాయమూర్తి.. ‘సీఆర్‌పీసీ సెక్షన్-41 ప్రకారం పిటిషనర్లను ఎందుకు అరెస్ట్ చేశారో కారణాలు చెప్పాలి కదా, మరి కేసు డైరీలో ఎక్కడా కూడా కారణాలను పేర్కొన్నట్లు లేదే’మని ప్రశ్నించారు. ‘మీరు చెప్పిన 7 కారణాల్లో మొదటి రెండు కారణాలతో నేను ఏకీభవిస్తాను. ఇక ఫోరెన్సిక్ నివేదికలు, కాల్‌డేటా విశ్లేషణల కారణంతో బెయిల్‌ను నిరాకరించలేం. పీసీ చట్టం కింద గరిష్ట శిక్ష ఐదేళ్లు. నిందితులు పారిపోతారని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు.

 

ఆడియో, వీడియో టేపుల వ్యవహారం సాంకేతికపరమైంది. వాటిని అందరూ విన్నారు. చూశారు. వాటిని ఎలా తారుమారు చేస్తారు? ఇప్పుడేమీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం లేదు. కాబట్టి నిందితులు నేరాన్ని కొనసాగించే అవకాశం ఉందన్న వాదనలను పరిగణనలోకి తీసుకోలేం. ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. కాబట్టి వారిని ఎలా ప్రభావితం చేస్తారు. క్రిమినల్ కేసులు ఎప్పుడూ కూడా వాస్తవాలు, చట్టాలపై ఆధారపడి ఉంటాయి..’’ అని ఏజీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. బెయిల్‌పై నిర్ణయాన్ని మంగళవారం వెలువరిస్తామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement