రేవంత్ రెడ్డి బెయిల్ విచారణపై 30న తీర్పు
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తు మీద వాదనలు వాడివేడిగా సాగాయి. రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరఫున తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదించారు.
వాడివేడిగా వాదనలు...
గతంలో ఒక రోజు తన కుమార్తె నిశ్చితార్థం కోసం బెయిల్ తీసుకున్నప్పుడు కోర్టు షరతులను రేవంత్ రెడ్డి పాటించారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. రేవంత్ రెడ్డిని ఇక ఏసీబీ కస్టడీకి పంపాల్సిన అవసరం లేదని చెప్పారు. అన్ని ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నాయంటున్నారని, ఇక రేవంత్తో అవసరం లేదని తెలిపారు. రేవంత్ తరఫు న్యాయవాది 17 నిమిషాల పాటు తన వాదనలు వినిపించారు. అయితే, అసలు ఈ కేసుకు సంబంధించి కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాల్సి ఉందని ఏజీ రామకృష్ణారెడ్డి వాదించారు. రేవంత్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని, విచారణ ప్రాథమిక దశలోనే ఉందన్నారు. మరింతమందిని ఇంకా విచారించాల్సి ఉందని తెలిపారు. సండ్ర వెంకట వీరయ్య ఇంకా పరారీలోనే ఉన్నారని, ఆయన విచారణకు హాజరు కాలేదని చెప్పారు. అలాగే మత్తయ్యను కూడా ఇంకా అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. 'ఓటుకు కోట్లు' వెనుక కేవలం ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినదేనా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఏమైనా ఉందా అని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. పది మంది ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వమే పడిపోయేదని చెప్పారు. ఎన్నికల ప్రక్రియనే ప్రభావింతం చేశారని, అలాంటివారు బయటికొస్తే సాక్ష్యాలను తారుమారు చేయొచ్చని తెలిపారు. కనిమొళి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. మత్తయ్యతో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. కస్టడీలో వివరాలు వెల్లడించేందుకు రేవంత్ నిరాకరించారని తెలిపారు. ఈ కేసులో శిక్ష ఎంత పడుతుందో తెలుసా అని జడ్జి అడగ్గా, గరిష్ఠంగా ఐదేళ్లు, కనిష్టంగా ఆరు నెలలని ఏజీ చెప్పారు. అయితే కేసులను బట్టి తీర్పులు మారుతాయని ఈ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు. రేవంత్ తరఫు న్యాయవాది లూథ్రా, ఏజీ రామకృష్ణారెడ్డి కలిసి దాదాపు గంట సేపు తమ వాదనలు వినిపించారు.
కిక్కిరిసిన కోర్టు హాలు
ఈ సందర్భంగా కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. కోర్టులో మొత్తం ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. మధ్యాహ్నానికి ఈ పిటిషన్ విచారణను పోస్ట్ చేయడంతో, ముందుగానే అక్కడకు ఏజీ రామకృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వచ్చారు. రేవంత్ రెడ్డి మద్దతుదారులతో పాటు పలువురు ఈ కేసు పట్ల ఆసక్తితో కోర్టు హాలు వద్దకు చేరుకున్నారు.