ఇక చీఫ్ జస్టిస్ నిర్ణయమే కీలకం
ఓటుకు కోట్లు కేసులో ఎ-4 నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ వ్యవహారం గందరగోళంలో పడింది. ఈ కేసులో కీలక ముద్దాయి అయిన మత్తయ్య హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అనుహ్యంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్లింది. ఈ క్వాష్ పిటిషన్‌ను విచారిస్తున్న బెంచ్‌ను మార్చాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే, ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎల్విస్ స్టీఫెన్సన్ దాఖలుచేసిన 'నాట్ బిఫోర్' పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు సీరియస్ అయ్యారు. ఈ పిటిషన్ కోర్టును తప్పుదోవ పట్టించేదిగా ఉందని, పిటిషనర్ చర్యలు కోర్టు ధిక్కారం కింద భావించాల్సి వస్తుందని అన్నారు. కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం పిటిషనర్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే తన ఆదేశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయని, అవసరమైతే అడ్వకేట్ జనరల్ ఈ విషయంలో కోర్టుకు సహాయకారిగా ఉండొచ్చని జస్టిస్ శివశంకరరావు అన్నారు. దీంతో.. హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన విచక్షణ మేరకు ఈ కేసును మరో బెంచ్‌కు బదలాయించడమో, లేదా ప్రస్తుతం విచారణ జరుపుతున్న న్యాయమూర్తిని తదుపరి విచారణ కొనసాగించమనో చెప్పవచ్చు. ఒకవేళ ఇదే బెంచ్ విచారణ కొనసాగించాల్సి వస్తే, కేవలం న్యాయవాదులను మాత్రమే అనుమతించి విచారణ జరుపుతామని, వాదనలను చీఫ్ జస్టిస్ ముందు ఉంచుతామని అంటున్నారు.