నిందితుడిని ప్రభుత్వం ఎలా రక్షిస్తుంది?
ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ ఈ కేసులో ప్రధాన సాక్షి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. నిందితుడిని ప్రభుత్వమే ఎలా రక్షిస్తుందంటూ ఆయన కౌంటర్లో ప్రశ్నించారు. నిందితుడి తరఫున ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడాన్ని ఆయన ప్రశ్నించారు. నిందితుడిని రక్షించేలా పీపీ ఎలా వాదనలు వినిపిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మత్తయ్య అరెస్టు కాకుండా ఇచ్చిన స్టేను రద్దుచేయాలని ఆయన తన కౌంటర్లో కోరారు.
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్తో పాటు తనను ఈ కేసు నుంచి తప్పించాలని మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్ మీద కూడా హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరగనుంది. మత్తయ్యను అరెస్టు చేయొద్దంటూ ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన స్టే గడువు కూడా బుధవారంతో ముగియనుంది. మత్తయ్య పిటిషన్ బుధవారమే విచారణకు వచ్చేలా చూడాలని ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రేపు మత్తయ్య పిటిషన్ విచారణ ఉందంటూ ఏపీ స్టాండింగ్ కౌన్సిల్కు ఏపీ అడ్వకేట్ జనరల్ సమాచారం ఇచ్చారు.