రెవెన్యూ రికార్డుల్లో నమోదుకు రూ. 50 వేల డిమాండ్
ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు
గుంటూరు లాడ్జిసెంటర్ బస్టాప్ వద్ద వల వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు
తుళ్ళూరు : రాజధాని ప్రాంతం తుళ్ళూరు మండల సర్వేయర్‌ను బుధవారం ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. ఓ రైతునుంచి పొలం విషయమై డబ్బు తీసుకుంటుండగా సర్వేయర్‌ను గుంటూరులోని లాడ్జి సెంటర్ బస్టాప్ వద్ద ఏసీబీ అధికారులు పట్టుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే ...తుళ్ళూరు గ్రామానికి చెందిన నెల్లూరి లక్ష్మీనారాయణ అనే రైతుకు సర్వే నంబర్ 419లో 2 ఎకరాల 33 సెంట్లు పొలం ఉండగా రాజధాని నిర్మాణానికి లాండు పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే, సీఆర్‌డీఏ కాంపిటెంట్ ఆఫ్ అథారిటీ అధికారులు సర్వే చేసి 2 ఎకరాల 22 సెంట్లుగా నమోదు చేశారు.
దీంతో లక్ష్మీనారాయణ తన పొలాన్ని సర్వే చేయవలసిందిగా సర్వేయర్ కె.వరప్రసాద్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 1న పొలం సర్వే చేసిన వరప్రసాద్ 2ఎకరాల 26 సెంట్లు ఉన్నట్లు తేల్చారు. ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేందుకు రూ.50వేలు ఇవ్వాల్సిందిగా రైతు లక్ష్మీనారాయణను డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని రూ.25వేలు ఇస్తానంటూ లక్ష్మీనారాయణ సర్వేయర్‌కు విన్నవించి విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు.
దీంతో ఏసీబీ అధికారులు గుంటూరు లాడ్జి సెంటర్ బస్టాప్ వద్ద సర్వేయర్ రైతునుంచి రూ.25వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి తుళ్ళూరు తహశీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. భూమికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ చెప్పారు. కార్యక్రమంలో సీఐ నరసింహారావు పాల్గొన్నారు.
ఏసీబీ వలలో తుళ్లూరు సర్వేయర్
Published Thu, Aug 6 2015 3:01 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement