బాబుపై ఏసీబీ విచారణ! | ACB investigation on Chandrababu Naidu after caught revanth reddy bribe case | Sakshi
Sakshi News home page

బాబుపై ఏసీబీ విచారణ!

Published Thu, Jun 4 2015 2:26 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

బాబుపై ఏసీబీ విచారణ! - Sakshi

బాబుపై ఏసీబీ విచారణ!

ఈ కేసులో సూత్రధారి ఒక ముఖ్యమంత్రి. అందువల్ల ఏ చిన్న సమాచారం కూడా లీక్ కాకుండా మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం.

* రేవంత్ కేసులో ఏపీ సీఎంపై ఆధారాలు సిద్ధం..
* వారంలో నోటీసులిచ్చే అవకాశం
* ఎమ్మెల్యేలతో నేరుగా చంద్రబాబు బేరసారాలు
* మధ్యవర్తి సెబాస్టియన్ ఫోన్ ద్వారా మాట్లాడిన ఏపీ సీఎం
* ఏసీబీ వద్ద ఆడియో రికార్డులు
* రేవంత్ సంభాషణల్లోనూ పలుమార్లు బాబు పేరు
* ఈ ఆధారాలతో బాబును విచారించనున్న అధికారులు
* మరో ‘నలుగురు’ ఎమ్మెల్యేలనూ ప్రశ్నించే అవకాశం
* రేవంత్ ఇవ్వజూపిన రూ. 50 లక్షల సొమ్ముపైనా ఆరా
* ఏ బ్యాంకు నుంచి, ఎవరు తెచ్చారనే అంశాలపై పరిశీలన

 
ఈ కేసులో సూత్రధారి ఒక ముఖ్యమంత్రి. అందువల్ల ఏ చిన్న సమాచారం కూడా లీక్ కాకుండా మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేము. కోర్టుకు ఇచ్చే ప్రతి సమాచారం కూడా అన్ని ఆధారాలతో కూడినదై ఉండాలన్నదే మా అభిమతం..
 - ఏసీబీ వర్గాలు   
 
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాలంటూ ముడుపులు ఇవ్వజూపిన కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని విశ్వసిస్తున్న ఏసీబీ అధికారులు... ఆయనను విచారించేందుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అత్యున్నత వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏసీబీ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావాల్సిందిగా కోరనుంది. ఈ వారం చివరలో లేదా వచ్చే వారం మొదట్లో ఆ నోటీసులిచ్చే అవకాశముందని సమాచారం. నోటీసుకు చంద్రబాబు స్పందించిన అనంతరం ఏసీబీ అధికారుల బృందం ఆయన నివాసానికే వెళ్లి విచారించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం ఐదుగురు ఎమ్మెల్యేలను కొనే యత్నంలో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే.
 
 ఇలా ప్రలోభపెట్టే క్రమంలో రేవంత్‌తో పాటు మధ్యవర్తిగా ఉన్న సెబాస్టియన్ ఫోన్ ద్వారా చంద్రబాబు ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు సమాచారం. దానికి సంబంధించిన ఆడియో రికార్డులను ఏసీబీ ఇప్పటికే పరిశీలించి ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. ఎప్పుడు, ఏ సమయంలో, ఎవరితో, ఎవరి ఫోన్ ద్వారా మాట్లాడారన్న వివరాలతో సహా నివేదిక అందించినట్లు విశ్వసనీయ సమాచారం. బాస్ చెపితే వచ్చానని కొన్నిసార్లు, బాబుగారు అని మరికొన్ని సార్లు, చంద్రబాబు అన్ని రెండు మార్లు రేవంత్ సంభాషణల్లో స్పష్టంగా వినిపించింది. ఈ ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో గవర్నర్ నరసింహన్‌కు కూడా ఓ నివేదిక అందింది. ఎమ్మెల్యేలతో చంద్రబాబు బేరసారాలు చేసినట్లు తమ వద్ద ఆడియో రికార్డులు ఉన్నాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం వరంగల్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
 
 సూత్రధారి చంద్రబాబే..
 ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబేనని ఏసీబీ అనుమానిస్తోంది. దీనికి తగినట్లుగా ఉన్న కొన్ని ఆధారాలను ఇప్పటికే సిద్ధంగా ఉంచుకుంది. ఈ వివరాలను ఆధారం చేసుకుని చంద్రబాబును ఏసీబీ విచారించనుంది. అయితే ఈ ఆధారాలతో బాబును విచారించాలన్న నిర్ణయం తీసుకోవడానికి ముందే ఏసీబీ న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కోరినట్లు తెలిసింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన విచారణ అత్యంత గోప్యంగా సాగుతోంది. ‘ఈ కేసులో సూత్రధారి ముఖ్యమంత్రి. అందువల్ల ఏచిన్న సమాచారం కూడా లీక్ కాకుండా మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేము.
 
 కోర్టుకు ఇచ్చే ప్రతి సమాచారం కూడా అన్ని ఆధారాలతో కూడినదై ఉండాలన్నదే మా అభిమతం..’ అని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. అవసరాన్ని బట్టి లంచం తీసుకుని ఓటేసేందుకు సిద్ధపడ్డ మరో నలుగురు ఎమ్మెల్యేలను కూడా ఏసీబీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో మొత్తం ఫోన్ సంభాషణలను ఒకచోట క్రోడీకరించిన ఏసీబీ... నేడు లేదా రేపు కోర్టుకు అందజేయనుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఇవ్వజూపిన రూ.50 లక్షల సొమ్మును కూడా కోర్టుకు స్వాధీనం చేయనుంది. ఆ తరువాతే ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగుతుందని, ఆదాయపన్ను శాఖ ఫిర్యాదు మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేస్తుందని ఉన్నతాధికారవర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement