ఏసీబీ వలలో అవినీతి చేప
కందుకూరు రూరల్ :రోజులు గడిచే కొద్దీ అవినీతి అన్ని శాఖలకు అంటుకుంటోంది. గతంలో ఆదాయం వచ్చే శాఖల్లోనే అవనీతి జరిగేది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశానికి కూడా కొందరు లంచం డిమాండ్ చేస్తున్నారు. మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ఓ విద్యార్థి తండ్రి నుంచి ప్రిన్సిపాల్ రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన మండలంలోని జి.మేకపాడు ఏపీ మోడల్ స్కూల్ శుక్రవారం జరిగింది.
వివరాలు.. మండలంలోని జి.మేకపాడులో ఏపీ మోడల్ స్కూల్ ఉంది. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆరో తరగతికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు కేటాయిస్తారు. ఈ అవకాశం కందుకూరు మండలంలోని విద్యార్థులకు మాత్రమే. కనిగిరి మండలం కొత్తపాలేనికి చెందిన రాయదుర్గం నరేంద్ర అనే విద్యార్థి ఆరో తరగతికి దరఖాస్తు చేసుకోగా నాన్ లోకల్ కావడంతో లాటరీ పద్ధతిలో అడ్మిషన్ రాలేదు. దీంతో విద్యార్థి తండ్రి నరసింహం పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్ హరితను ఆశ్రయించాడు. రూ. 10 వేలు ఇస్తే సీటు ఇస్తానని చెప్పింది. చివరకు విద్యార్థి తండ్రితో రూ. 3 వేలకు బేరం కుదిర్చుకుంది. ఆ వెంటనే నరసింహం ఒంగోలు వెళ్లి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
పక్కా వ్యూహంతో..
విద్యార్థి తండ్రి నరసింహం ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు డీఎస్పీ కేఎస్ నంజూడప్ప, ఒంగోలు, నెల్లూరు సీఐలు టీవీ శ్రీనివాసరావు, కృపారావులు మూడు రోజుల పాటు పాఠశాలపై నిఘా ఉంచారు. ప్రిన్సిపాల్ గురించి విచారించారు. పక్కా ఆధారాలతో వ్యూహం రచించారు. నరసింహం పాఠశాలకు వచ్చి రూ.3 వేల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అవినీతి అధికారులను వదలం: కేఎస్ నంజూడప్ప, ఏసీబీ డీఎస్పీ, నెల్లూరు
అవినీతి అధికారులను వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థుల నుంచి ప్రిన్సిపాల్ డబ్బులు వసూలు చేసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో లంచం తీసుకోవడం నేరం. లంచం తీసుకుంటుండగా జి.మేకపాడు ప్రిన్సిపాల్ సీహెచ్ హరితను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. రికార్డులు పరిశీలించి ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నాం. అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిస్తాం.
రాజకీయాలకు బలయ్యా: సీహెచ్ హరిత, ప్రిన్సిపాల్
నేను గ్రామ రాజకీయాలకు బలయ్యా. కొందరు స్కూల్లో రాజకీయాలు చేయాలని చూశారు. వారిని అడ్డుకున్నా. అందుకే నాపై పగబట్టి ఏసీబీకి పట్టించారు. పాఠశాలలో ఆర్వోప్లాంట్ లేదు. విరాళం రూపంలో నగదు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరా. అడ్మిషన్ల కోసం లంచం తీసుకుంటున్నట్లు సృష్టించి ఏసీబీకి పట్టించారు.