లంచం తీసుకుంటూ పట్టుబడిన శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుండాలపల్లి వెంకట స్వామి(ఫైల్)
‘‘మన దేశంలో అడుగడుగునా లంచం..
మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం.. ఇల్లు కట్టడానికి లంచం..
కరెంట్ ఇవ్వడానికి లంచం.. ఆ కరెంట్ తీయకుండా ఉండడానికి లంచం.. రేషన్ కార్డుకు లంచం.. రేషన్ తీసుకోవడానికి లంచం..
రైతులు రుణాలు ఇవ్వాలంటే లంచం.. ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులను నిలుపుకోవాలంటే లంచం..
హాస్పిటల్‌లో బెడ్‌కు లంచం.. బ్లడ్‌కు లంచం..
ఆడపడుచులు సుఖంగా ప్రసవించాలంటే లంచం.. బర్త్ సర్టిఫికెట్‌కు లంచం.. డెత్ సర్టిఫికెట్‌కు లంచం.. పాస్‌బుక్‌కు లంచం..
పోలీసులు కేసు కట్టాలంటే లంచం.. కేసు మాఫీకి లంచం..
మనిషి పుట్టిన దగ్గర నుంచి.. చచ్చిందాకా..
లంచం.. లంచం.. లంచం..
అగ్గిపెట్టె దగ్గర నుంచి రైలు పెట్టె వరకు అవినీతి నడుస్తోంది.’’
ఓ సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ఇది..
నిజమే! ప్రస్తుత సమాజంలో ఏ పని చేయించుకోవాలన్నా ‘చేయి తడపాల్సిందే’’. ఈ లంచం మహమ్మారి ప్రతి ప్రభుత్వ ఆఫీసులోనూ తిష్ట వేసుకునే ఉంది. గడిచిన ఐదేళ్లలో 70 మంది అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారంటే అవినీతి, అక్రమాలు జిల్లాలో ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
తూర్పుగోదావరి: ఒంటిమామిడి ఫారెస్ట్ సెక్షన్ కార్యాలయంలోని ఫారెస్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ముంగడ గౌతం, పిఠాపురానికి చెందిన చెక్క పార్థసార«థి అనే వ్యక్తి వద్ద టింబర్ డిపోలో ఉన్న కలపకు సంబంధించి వే బిల్లులు ఇవ్వడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కాకినాడ జిల్లా ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న బత్తుల రాజేంద్ర కాకినాడకు చెందిన పి.పద్మావతి ఇచ్చిన ఫిర్యాదును అధికారులకు పంపించడానికి రూ.ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అడ్డతీగల ఐసీడీఎస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.సత్యనారాయణ అడ్డతీగలకు చెందిన జీప్ డ్రైవర్ గండేటి నాగేశ్వరరావుకు చెందిన జీపీఎఫ్ బిల్లు రూ.1.29 లక్షలకు ఏవిధమైన అభ్యంతరాలు లేవని ఇవ్వడానికి రూ.11 వేలు లంచం అడిగి ఏసీబీ అధికారులకు చిక్కారు. పిఠాపురం మున్సిపాల్టీలో బిల్లు కలెక్టర్ గా పని చేస్తున్న జంగా నాగరాజు, పిఠాపురం, బొజ్జావారి తోటకు చెందిన గొల్లపల్లి కృష్ణ ఇంటికి శాశ్వత పన్ను విధించడానికి రూ.ఆరు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అలాగే లంచాలు తీసుకుంటూ మరో ఐదుగురు అధికారుల వరMýకు ఈ ఏడాది పట్టుబడ్డారు.
గతంలో పట్టుబడిన అధికారులు
రాజమహేంద్రవరం లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి జిల్లా రిజిస్ట్రార్ రంగారెడ్డి వద్ద సబ్ రిజిస్ట్రార్ల నుంచి వసూలు చేసి రూ.67 వేలు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డిపై కేసు నమోదు చేశారు. తుని రూరల్ ఆర్డర్ పేట లోని ప్రభుత్వ హాస్టల్‌లో వార్డెన్ కె.నారాయణ పాల్ అవకతవకలకు పాల్పడడంపై అతడిపై కేసు నమోదు చేశారు. ఉప్పలగుప్తం మండలం భీమన పల్లి గ్రామంలో హాస్టల్ వార్డెన్ అవినీతికి పాల్పడితే రాచర్ల జాకబ్‌పై కేసు నమోదు చేశారు.
రాజమహేంద్రవరంలోని సాయి కృష్ణా థియేటర్ వద్ద ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై దాడి చేసి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జీవన్ బాబు తో పాటు మరో 12 మంది పై కేసులు నమోదు చేశారు. వారి వద్ద అనధికారంగా ఉన్న రూ 1.59 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలో బిల్లు కలెక్టర్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేశారు.
ఇలా ట్రాప్ చేస్తారు..
లంచం అడిగిన అధికారులపై ఫిర్యాదులు రావడం సహజం, వీటితో పాటు నిజాయితీ గల అధికారులపైనా ఒక్కోసారి ఆరోపణలు వస్తాయి. వీటిలో ఏది నిజం అనేది తెలుసుకొని ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తుంటారు. ముందుగా ఒక అధికారి పై ఫిర్యాదు వచ్చిన వెంటనే ఫిర్యాదు చేసిన వ్యక్తి సచ్ఛీలుడా? లేక అధికారిని వేధించేందుకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడా? అనేది పరిశీలిస్తారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి గుణగణాలపై విచారణ జరుపుతారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపైనా విచారణ చేస్తారు. అతడు అవినీతి పరుడని తేలితే ఆ అధికారిని ట్రాప్ చేస్తారు. లంచం అడిగిన అధికారిని బాధితుల చేత బేరం కుదిర్చి వారి చేతే కొంత సొమ్ము ఇప్పించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు.(లంచంగా ఇచ్చిన డబ్బును ఏసీబీ అధికారులు రెండు నెలల అనంతరం తిరిగి బ్యాంక్ ద్వారా చెల్లిస్తారు). ఇలా పట్టుకున్న సందర్భాల్లో పట్టుబడిన అధికారులు నేను లంచం తీసుకోలేదని అబద్ధమాడే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండేందుకు శాస్త్రీయంగా రసాయనాలు పూసిన నోట్లు బాధితులకు ఇచ్చి లంచం తీసుకుంటున్న అధికారికి అందజేయిస్తారు.
లంచం అడిగితేఏసీబీకి ఫిర్యాదు చేయండి
రూ.రెండు వేలకు పైగా లంచం అడిగిన ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అధికారులపై కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాము. అధికారులు అవినీతికి పాల్పడితే ఏసీబీ డీఎస్పీ రాజమహేంద్రవరం సెల్: 94404 46160, ల్యాండ్ 0883– 2467833 నంబర్లకు సమాచారం అందించాలి. కాకినాడ సెల్: 94404 46161 నంబర్లు సంప్రదించాలి.– ఎం.సుధాకరరావు, ఏసీబీ, డీఎస్పీ. రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment