పంచాయతీ కార్యదర్శి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.. అంతరచిత్రంలో పంచాయతీ కార్యదర్శి నిమ్మకాయల సూర్యనారాయణ
రాజోలు/పి.గన్నవరం: పంచాయతీ బిల్‌కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి హోదాలో భారీగా అక్రమాస్తులను కూడబెట్టి ఏసీబీకి చిక్కాడు కార్యదర్శి నిమ్మకాయల సూర్యనారాయణ. పంచాయతీ పరిధిలో నిర్మించే అపార్టుమెంట్లు, లేఅవుట్లే ఆయన టార్గెట్. ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించి అవినీతి చిరుద్యోగి ఆటకట్టించారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఐదుచోట్ల సోదాలు నిర్వహించారు.
పి.గన్నవరం మండలం మానేపల్లి, వాడ్రేవుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాలతోపాటు, పంచాయతీ కార్యదర్శి నివాసం ఉంటున్న తాటిపాక శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీ, మలికిపురం మండలం లక్కవరంలోని బావమరిది, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని తోడల్లుడు ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. రూ.1.40 కోట్ల ఆస్తులను అక్రమంగా ఆర్జించినట్టు అధికారులు గుర్తించారు.1,347 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి ఆభరణాలు, ఒక ఇల్లు, రెండు ప్లాట్లు, 12 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు మోటారు సైకిళ్లు, ఒక కారును, రూ.1.47 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో ఉన్న పత్రాలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.
గతంలోనే ఆర్జన
గతంలో రాజోలు మండలం తాటిపాక, పొన్నమండ, కాట్రేనిపాడు, బి.సావరం, వేగివారిపాలెం గ్రామ పంచాయతీల్లో ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సూర్యనారాయణ ఆ సమయంలోనే అక్రమార్జనకు పాల్పడినట్టు గుర్తించారు. తాటిపాక వాణిజ్యపరంగా అభివృద్ధి కావడంతో అక్కడ నిర్మించే అపార్టుమెంట్లకు, లే–అవుట్లకు అనుమతి ఇచ్చేందుకు లంచాలు గుంజి ఆస్తులు సంపాదించారు.
తాటిపాకలో నిమ్మకాయల సూర్యనారాయణ నివాసం ఉంటున్న శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీ
తర్వాత పొన్నమండ, కాట్రేనిపాడు, వేగివారిపాలెం, బి.సావరం పంచాయతీల్లో కార్యదర్శిగా పని చేశారు. ఏడాది క్రితం రాజోలు మండలం పొన్నమండ నుంచి పి.గన్నవరం మండలం మానేపల్లి బదిలీ అయ్యారు. ప్రజాప్రతినిధులతో విభేదాలు రావడంతో పి.గన్నవరం మండలానికి బదిలీపై వెళ్లారు. ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లడంతో సోదాలు నిర్వహించారు. రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment