డీఎస్పీని ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు
రాజమహేంద్రవరం క్రైం: ఓ సెటిల్‌మెంట్ వ్యవహారంలో లంచం తీసుకుంటూ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా సౌత్ జోన్ డీఎస్పీ పి.నారాయణరావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఆయనతోపాటు ఆయనకు సహకరించిన కానిస్టేబుల్ కూడా అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ రాజమహేంద్రవరం, ఏలూరు డీఎస్పీలు ఎం.సుధాకరరావు, గోపాలకృష్ణల కథనం ప్రకారం, రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు గ్రామానికి చెందిన పాస్టర్ తాడికొండ విల్సన్‌కుమార్, సామర్లకోటకు చెందిన మహిళ కీర్తిప్రియ వద్ద ఇల్లు కొన్నాడు. అగ్రిమెంట్ తరువాత కీర్తిప్రియ మరికొంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న విల్సన్‌కుమార్‌పై కీర్తిప్రియ ధవళేళ్వరం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో కీర్తిప్రియ వద్ద సౌత్‌జోన్ డీఎస్పీ నారాయణరావు లంచం తీసుకొని, వారికి అనుకూలంగా కేసు రాజీ చేసుకునేలా విల్సన్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చాడు.
ఈ నేపథ్యంలో రూ.7 లక్షల నష్టానికి కీర్తిప్రియతో విల్సన్ రాజీ చేసుకున్నాడు. అనంతరం సౌత్ జోన్ డీఎస్పీ నారాయణరావు తనవద్ద ఉన్న కానిస్టేబుల్ రమేష్‌తో విల్సన్‌కుమార్‌కు ఫోన్లు చేయించారు. ‘‘నా ప్రమేయంతోనే నీపై కేసులు లేకుండా చేశాం. రాజీ కుదుర్చుకున్న తరువాత నన్ను కలవకుండా వెళ్తావా? నాకు రావలసిన వాటా ఇవ్వాలి’’ అని కానిస్టేబుల్ ద్వారా ఫోన్లు చేయించా రు. రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు డీఎస్పీకి రూ.50 వేలు. కానిస్టేబుల్ రమేష్‌కు రూ.5 వేలు ఇచ్చేవిధంగా విల్సన్‌కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే సమయంలో ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం.. సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ రమేష్‌కు రూ.55 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు గురువారం రాత్రి వల పన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును కానిస్టేబుల్ రమేష్‌కు ఇవ్వాలని చెప్పి బయటకు వెళ్లిపోతున్న డీఎస్పీ నారాయణరావును గేటు వద్ద అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ రమేష్‌ను కూడా అరెస్టు చేశారు.
నాకు సంబంధం లేదు
లంచం ఇవ్వడంతో నాయకు సంబంధం లేదు. కానిస్టేబుల్ రమేష్, పాస్టర్ విల్సన్‌కుమార్ బాగా తెలిసినవారు. దానివలన అతడికి లంచం ఇచ్చి ఉండవచ్చు. ఈ కేసులో తనకు అనుకూలంగా చేయలేదనే నెపంతోనే.. లంచం తీసుకున్నట్లు నాపై విల్సన్‌కుమార్ ఆరోపణలు చేస్తున్నారు.– పి.నారాయణరావు, సౌత్ జోన్ డీఎస్పీ
వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయి
ఈ కేసు పెట్టినప్పటి నుంచీ కానిస్టేబుల్ రమేష్‌తో డీఎస్పీ మాట్లాడించిన ప్రతి వాయిస్ రికార్డింగూ నా దగ్గర ఉంది. ఈ కేసులో కీర్తిప్రియతో రాజీ పడాలని డీఎస్పీ నారాయణరావు ఒత్తిడి తెచ్చారు.
– విల్సన్‌కుమార్, పాస్టర్
Comments
Please login to add a commentAdd a comment