కార్పొరేషన్‌లో ఏసీబీ కలకలం | ACB Raids on Town planning Office Guntur | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌లో ఏసీబీ కలకలం

Feb 19 2020 12:33 PM | Updated on Feb 19 2020 12:33 PM

ACB Raids on Town planning Office Guntur - Sakshi

టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది వద్ద డబ్బు, పత్రాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు

సాక్షి, గుంటూరు: గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కలకలం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఏసీబీ డీజీ పీఎస్సార్‌ సీతారామాంజనేయులు ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని టౌన్‌ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఏసీబీ ఏఎస్పీ సురేశ్‌బాబు నేతృత్వంలో మూడు బృందాలుగా తనిఖీలు చేపట్టారు. ముగ్గురు సీఐలు, ఒక ఎస్‌ఐ, 10 మంది ఏసీబీ సిబ్బంది, ఆరుగురు ఇంజినీర్లు, ఇద్దరు ఆడిటర్‌లు తనిఖీల్లో పాల్గొన్నారు. 

రూ.1.03లక్షలు స్వాధీనం
టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు వార్డ్‌ నంబర్‌ 35 బిల్‌ కలెక్టర్‌ ఎస్‌.నాగేశ్వరరావు నుంచి రూ.69,620, టౌన్‌ ప్లానింగ్‌ అవుట్‌సోర్సింగ్‌ అటెండర్‌ అల్లంశెట్టి సుధాకర్‌ నుంచి రూ.29,093, డెప్యూటీ సిటీ ప్లానర్‌ బి. సత్యనారాయణ నుంచి రూ.5,100 కలిపి మొత్తం రూ.1,03,813 అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు. 

యథేచ్ఛగా ప్రైవేట్‌ వ్యక్తుల నియామకం
టౌన్‌ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఆకస్మిక తనిఖీల సందర్భంగా అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బిల్‌ కలెక్టర్‌ తుపాకుల సాంబశివరావు నెలకు రూ.ఐదు వేలు జీతం ఇస్తూ బి.లోకేష్‌ అనే ప్రైవేట్‌ వ్యక్తిని, మరో బిల్‌కలెక్టర్‌ నాగేశ్వరరావు నెలకు రూ.ఎనిమిది వేలు జీతం ఇస్తూ టి.ప్రసాద్‌æ అనే ప్రైవేట్‌ వ్యక్తిని నియమించుకున్నారు. అంతేకాకుండా నకిలీ ఐడీ కార్డులను పెట్టుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అక్రమ వసూళ్లు చేయడం కోసం కార్పొరేషన్‌లోని అధికారులు, సిబ్బంది ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ తనిఖీల్లో ప్రైవేట్‌ వ్యక్తులు పట్టుబడటం గమనార్హం. పన్ను కట్టినప్పటికీ ప్లాన్‌ లేని భవనాలను గురించి ఆరా తీయడం కోసం రెవెన్యూ విభాగంలోకి ఏసీబీ అధికారులు వెళ్లగా అక్కడా అక్రమాల బాగోతం బయటపడింది. 

రికార్డుల పరిశీలన
బిల్డింగ్‌ ప్లాన్‌లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌లు, ఇతర కార్యకలాపాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా అన్న విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ప్లాన్‌ల మంజూరు విషయంలో  క్షేత్ర స్థాయిలో జరిగిన నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం, జీటీ రోడ్డు, నల్లపాడు సహా గుంటూరు నగరంలోని భవనాలు, అపార్ట్‌మెంట్‌లను ఏసీబీ బృందాలు పరిశీలించాయి. మంగళవారం మధ్యా హ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఏసీబీ తనిఖీలు అర్ధరాత్రి వరకూ కొనసాగా యి. బుధవారం కూడా తనిఖీలు కొనసాగనున్నాయి. 

ఆందోళనలో అధికారులు, సిబ్బంది  ఇటీవల కాలంలో కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్‌లు మంజూరు చేసిన ఘటనలు కార్పొరేషన్‌లో అనేకం ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలోని టీడీపీ నాయకులకు చెందిన ఓ పేరు మోసిన క్లబ్‌లో గత కొ ద్ది రోజులుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా గత ఏ డాదిలో ప్లాన్‌లు మంజూరు చేశారు. ఈ విష యంలో భారీగా డబ్బులు చేతులు మారాయ న్న ఆరోపణలున్నాయి. ఏసీబీ తనిఖీల్లో ఈ వ్య వహారం ఎక్కడ బయటపడుతుందోనని అధి కారులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

గతంలో ఏసీబీ కేసులు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో భారీ స్థాయి అవినీతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నగరపాలక సంస్థ పరిధిలో 2012–2016లో 14 ఫైల్స్‌కు టీడీఆర్‌ బాండ్‌ (ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌ బాండ్స్‌)లో భారీ స్థాయి అవినీతి జరిగిందంటూ అప్పట్లో విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన అధికారులు అవకతవకలను నిర్ధారించారు. ఈ వ్యవహారంపై  2018లో ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదులు అందడంతో పూర్తి విచారణ జరిపిన అధికారులు టీడీఆర్‌ బాండ్లలో సుమారు రూ.1.60 కోట్లమేరకు అవినీతి జరిగిందని తేల్చారు. దీనిపై కమిషనర్, కార్పొరేష¯Œన్‌  ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్, డీఎంఈలు సైతం దర్యాప్తు జరిపి ప్రిన్సిపల్‌ సెక్రటరీకి అప్పట్లో నివేదికలు పంపారు. టీడీఆర్‌ బాండ్‌లలో అక్రమాలకు పాల్పడిన 12 మంది అధికారులు(మినిస్టీరియల్‌ స్టాఫ్‌), తొమ్మిది మంది బిల్డర్లు సహా 32 మందిపై 13/1ఏ, 13/2, 420, 409, 467, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో బిల్‌కలెక్టర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఏసీబీ తనిఖీల్లో ఎక్కడ తమ అవినీతి ఆరోపణలు బయటపడతాయోనని కొందరు అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement