సిద్దిపేట/అర్బన్/మున్సిపాలిటీ,న్యూస్‌లైన్ : అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం డీడీలు కట్టినప్పటికీ లంచం ఇవ్వనిదే పనికాదని భీష్మించిన ఓ ట్రాన్స్‌కో జేఎల్‌ఎం (జూనియర్ లైన్‌మన్) గురువారం నంగునూరులోని ఓ హోటల్‌లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మెదక్, నిజామాబాద్ జిల్లాల ఏసీబీ డీఎస్పీ సంజీవరావు సిద్దిపేటలోని ఏపీసీపీడీసీఎల్ డీఈ ఆఫీసులో విలేకరులకు వెల్లడించారు. నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన యువరైతు కోల్పుల ఆంజనేయులు ప్రస్తుతం ఓ మోటారుతో పంటలను సాగు చేస్తున్నాడు.
అయితే మరో బోరుకు మోటారు కావాల్సి ఉండడంతో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని స్థానిక ఇన్‌చార్జ్ జేఎల్‌ఎం (జూనియర్ లైన్‌మన్) రెడ్డిమల్ల శంకర్ ను కలిసి విన్నవించాడు. అందుకు డిపార్టుమెంటుకు రూ.5,450 చొప్పున మూడు డీడీలను అప్పగించారు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కావాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని శంకర్ డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బతిమాలగా.. రూ.13 వేలకు శంకర్ బేరం కుదుర్చుకున్నాడు. దీంతో ఉన్న రెండు పాడి గేదెలను రూ.14,500లకు విక్రయించి డబ్బును సిద్ధం చేసుకున్నాడు.
అయితే సహచరుల సలహా మేరకు రైతు ఆంజనేయులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఏసీబీ డీఎస్పీ సంజీవరావు బృందం నంగునూరులోని ఓ హోటల్‌లో కస్టమర్లుగా మాటేసింది. అక్కడికి వచ్చిన జేఎల్‌ఎం శంకర్.. రైతు ఆంజనేయులు నుంచి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత సిద్దిపేటలోని డీఈ ఆఫీసుకు తీసుకువచ్చి ఇక్కడ కూడా తనిఖీలు చేశారు. నిందితుడిని హైదరాబాద్ ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరుస్తామని డీఎస్పీ సంజీవరావును తెలియజేశారు. ఏసీబీ డీఎస్పీ వెంట సీఐలు, శ్రీనివాస్‌రెడ్డి, రఘునాథ్‌లున్నారు.
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో జేఎల్‌ఎం
Published Thu, Dec 26 2013 11:51 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement