పాత భూసేకరణ చట్టం ప్రకారమే భూములు లాక్కొనడం ద్వారా కలెక్టర్ దుర్మార్గానికి ఒడిగట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధ్వజమెత్తారు.
సత్తుపల్లి, న్యూస్‌లైన్: పాత భూసేకరణ చట్టం ప్రకారమే భూములు లాక్కొనడం ద్వారా కలెక్టర్ దుర్మార్గానికి ఒడిగట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధ్వజమెత్తారు. సింగరేణి ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న కొమ్మేపల్లి, కిష్టారం, లంకపల్లి, జగన్నాథపురం గ్రామాల్లోని నిర్వాసితులు సత్తుపల్లిలో మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీనిని సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే భూములను స్వాధీనపర్చుకుంటామని ప్రజాప్రతినిధులను, మంత్రులకు ఇచ్చిన మాటను కలెక్టర్ తప్పారని విమర్శించారు. ‘కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. తమ జేబులోని డబ్బులేమైనా ఇస్తున్నారా..?’ అని ప్రశ్నించారు. ‘ఈ కలెక్టర్‌ను జిల్లా నుంచి పంపించేయాలి. రైతు శ్రేయస్సును కోరుకునే కొత్త కలెక్టర్‌ను పంపించాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లుకు భిన్నంగా వ్యవహరించిన అధికారులకు రైతాంగం ఉసురు తగులుతుందన్నారు. ఓపెన్‌కాస్టుతో సత్తుపల్లి మండలం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండానే భూముల స్వాధీన అవార్డు ప్రకటించటం దారుణమని అన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు రాజకీయాలకతీతంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భూనిర్వాసితులను కోరారు. జిల్లా ఉన్నతాధికారులు సింగరేణి యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరించి, రైతులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. భూనిర్వాసితుల పోరాటానికి వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందన్నారు.
డీసీసీ ఉపాధ్యక్షుడు కూసంపూడి మాధవరావు మాట్లాడుతూ.. కొత్త చట్టం వచ్చేంత వరకు భూముల జోలికి వెళ్లబోమని మంత్రి రాంరెడ్డి వెం కటరెడ్డి సమక్షంలోనే కలెక్టర్ చెప్పారని అన్నారు. దానికి భిన్నంగా ఇప్పుడు నిర్వాసితులకు అన్యా యం చేశారని విమర్శించారు. కలెక్టర్‌ను తక్షణమే బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు అప్పారావు మాట్లాడుతూ.. రైతులను అధికారులు మభ్యపెట్టి అత్యుత్సాహంతో వ్యవహరించారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ మున్సిపల్ కన్వీనర్ కోటగిరి మురళీకృష్ణారావు, నాయకులు దేశిరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎస్‌కె.మౌలాన, గంగారం సొసైటీ అధ్యక్షుడు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సీపీఎం నాయకుడు మోరంపూడి పాండు, సీపీఐ డివిజన్ కార్యదర్శి దండు ఆదినారాయణ, రేజర్ల మాజీ సర్పంచ్ పరెడ్ల సత్యనారాయణరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి రామిశెట్టి సుబ్బారావు, న్యూడెమోక్రసీ నాయకుడు ఎ.రాము తదితరులు పాల్గొన్నారు.