గాయపడ్డ ఆశ
కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఆశ కార్యకర్తలు
పోలీసుల దౌర్జన్యం, 64 మంది అరెస్టు, సొంత పూచీకత్తుపై విడుదల
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
విశాఖపట్నం: ఆశ వర్కర్లు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారి తీసింది. కలెక్టరేట్ ప్రాంతమంతా యుద్ధకాండను తలపించింది. ఆందోళన చేసిన ఆశ వర్కర్లను పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో ఎక్కించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మూడు రోజులుగా రిలే నిరశన దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆశవర్కర్లు తమ ఆందోళనను శుక్రవారం ఉధృతం చేశారు. ఆశావర్కర్లు ముట్టడి చేస్తారని ముందుగానే గ్రహించిన పోలీసులు కలెక్టరేట్ చుట్టూ భారీగా మోహరించి కలెక్టరేట్ చుట్టూ ముళ్ల కంచె అమర్చారు. అయినా ఆశ కార్యకర్తలు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా వారు ఆగకుండా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించటంతో వీరికీ పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో కొందరు గాయాల పాలవగా, మరికొందరు ఎండకు సొమ్మసిల్లి పడిపోయారు. సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆశావర్కర్లు కలెక్టరేట్ గేట్ ముందు బైటాయించారు. కలెక్టర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పదేళ్లుగా ఆశ వర్కర్లకు జీతాలు ఇవ్వడం లేదని, మూడేళ్లుగా యూనిఫామ్ అలవెన్స్‌లు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేస్తున్న ఆశవర్కర్లకు గత 20 ఏళ్లుగా రూ.400 వేతనం మాత్రమే ఇస్తున్నారని ఆవేదన చెందారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
64 మంది అరెస్టు
ఆశ వర్కర్ల నినాదాలతో ఫోర్త్‌టౌన్ మిన్నంటింది. తమ డిమాండ్ల సాధనకై శుక్రవారం కలెక్టరేట్‌వద్ద ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 64 మందిని ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో కూడా నినాదాలు చేయడంతో హోరెత్తింది. వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడిచిపెట్టారు.