కదం తొక్కిన విద్యార్థులు
- ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
- తోపులాటలో గాయపడిన విద్యార్థులు, పోలీసులు
- పలువురి అరెస్ట్, కేసుల నమోదు
అనంతపురం అర్బన్:
పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్‌ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. డిమాండ్‌ల సాధనలో భాగంగా తొలుత సప్తగిరి సర్కిల్ నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. గేట్ బయటే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గేట్ బయటే రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూర్యచంద్ర, నరేష్, రాష్ట్ర కార్యదర్శి సుశీలమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలను సమాంతరంగా కొనసాగించాలన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీలు పెంచాలన్నారు. జీఓ 29ని రద్దు చేసి పాఠశాలలు, వసతి గృహాల మూసివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేఎస్‌ఆర్ కళాశాలకు అనుబంధంగా వసతి గృహం ఏర్పాటు చేయాలన్నారు.
కేజీబీవీల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ కలెక్టరేట్‌లో చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల చర్యని రోప్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. వెనువెంటనే పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో విద్యార్థులకు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దొరికిన వారిని దొరికినట్లే పోలీసులు లాగిపడేశారు.
తోపులాటలో పలువురు విద్యార్థులతో పాటు పోలీసులూ గాయపడ్డారు. విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం 341 సెక‌్షన్ కింద కేసులు నమోదు చేశారు. ముట్టడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి సంఘం నాయకులను సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పరామర్శించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, వాటి సాధన కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై పోలీసుల ద్వారా అణచివేతకు సిద్ధపడడాన్ని ఆయన ఖండించారు.