పత్రికల వార్తల ఆధారంగా చర్యలు తీసుకోలేం
♦ నంద్యాలలో వైఎస్ జగన్ వ్యాఖ్యలపై భన్వర్‌లాల్
♦ మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు
సాక్షి, హైదరాబాద్/కర్నూలు (అగ్రికల్చర్): నంద్యాలలో ఇటీవల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటోగా పరిగణించి విచారణ జరపాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌కు ఆదేశించామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల నిఘా వేదిక అనే స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పోస్టర్లను శనివారం భన్వర్‌లాల్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబును తుపాకీతో కాల్చిపారెయ్యాలని వ్యాఖ్యానించారన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా పరిగణించి చర్యలు తీసుకోలేమన్నారు.
జగన్ వాస్తవంగా ఏం మాట్లాడారన్న దానిని పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను కోరామన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మంత్రులు నంద్యాలలో పర్యటిస్తున్నారనే అంశాన్ని సైతం సుమోటోగా పరిగణించామని, మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిమాన్షు మోటర్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వామపక్షాలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని భన్వర్‌లాల్ తెలిపారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని తెలిపారు.
వైఎస్ జగన్‌కు నోటీసు
నంద్యాలలో జగన్ ప్రసంగంపై టీడీపీ నేతల ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని భన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ, నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేశ్‌ను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం జిల్లా ఎన్నికల అధికారి జగన్‌కు నోటీసు జారీ చేశారు. నోటీసును రిజిస్టర్ పోస్టు ద్వారా జగన్‌కు, కాపీని నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి పంపించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేశ్ తెలిపారు.