రూ.వంద కోట్ల రుణాలకు చర్యలు
సాక్షి, కాకినాడ : జిల్లాలోని కౌలురైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. గత ఏడాది కౌలురైతులకు రూ.90కోట్ల రుణాలిచ్చిన బ్యాంకర్లు ఈసారి కనీసం రూ.100కోట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలురైతుల సమస్యలపై శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేసీ మాట్లాడుతూ జిల్లాలోని కౌలురైతులను ఐదుగురు వంతున రుణ అర్హత గ్రూపులను ఏర్పాటుచేయాలన్నారు.
కౌలు రైతుల జాబితాలను సిద్ధం చేసి బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించి నాలుగైదు రోజుల్లోగా బ్యాంకులకు పంపాలన్నారు. తహశీల్దార్ల నుంచి వెంటనే కౌలు రైతుల వివరాలు తీసుకొని వాటిలో అనర్హులైన వారిని, రుణఎగవేతదారులను తొలగించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు రెన్యూవల్, కొత్త రుణ అర్హత కార్డుల కోసం లక్షా 13వేల మంది కౌలు రైతుల నుంచి దరఖాస్తులొచ్చాయన్నారు. వీటిలో ఇప్పటి వరకు 23వేల మందికి కార్డులు జారీ చేయగా, ఇప్పటి వరకు 700 మంది కౌలు రైతులకు కేవలం రూ.47లక్షలు మాత్రమే రుణాలు ఇవ్వడంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు, అధికారులకు మధ్య అనుసంధానం చేసేందుకు తన కార్యాలయంలో పనిచేసే జి.పద్మశ్రీ అనే అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తున్నట్టు చెప్పారు.
28న జన్‌ధన్ యోజన ప్రారంభం
కేంద్రం తలపెట్టిన జన్‌ధన్‌యోజన కార్యక్రమం ఈ నెల28న ప్రారంభం కానుందని జిల్లాలీడ్ బ్యాంకు మేనేజర్ ఎస్.జగన్నాథస్వామి తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం రాష్ర్టంలో మన జిల్లాతో పాటు విశాఖ, కృష్ణా, అనంతపురం జిల్లాలు ఎంపికయ్యాయని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోడి దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈకార్యక్రమం ప్రారంభం కానుందన్నారు.
ఇందుకోసం రాష్ర్ట స్థాయి మిషన్‌కు డెరైక్టర్‌గా రాష్ర్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ ఉంటారన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎల్‌డీఎం, నాబార్డు ఏజీఎం సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతి కుటుంబంలో భార్యభర్తలిద్దరిచేతా జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు ప్రారంభింపచేసి వారందరికీ ఏటీఎం కార్డు తరహాలోనే రూపీ కార్డు (స్వదేశీ ఏటీఏం కార్డు) జారీ చేయడం పథక ముఖ్య ఉద్దేశమని వివరించారు. సమావేశంలో వివిధ బ్యాంకుల కో-ఆర్డినేటర్లు, వ్యవసాయశాఖ ఏడీఏలు పాల్గొన్నారు.
ఇక ఆన్‌లైన్‌లోనే సంక్షేమ ఫలాల పంపిణీ
రౌతులపూడి : రాబోయే కాలంలో పేదలకు అందించే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను ఆన్‌లైన్‌లోనే అందించనున్నట్టు జేసీ ముత్యాలరాజు తెలిపారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా శుక్రవారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో గ్రామాలవారీగా రెవున్యూ రికార్డులను పెద్దాపురం ఆర్‌డీఓ కూర్మానాథ్‌తో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ రాష్ట్రస్థాయిలో 92శాతం, జిల్లావ్యాప్తంగా 97శాతం ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తిచేశామని పేర్కొన్నారు. మండలంలో మిగిలి ఉన్న 12శాతం ఆధార్ నమోదు ప్రక్రియపై రికార్డుల పరిశీలన కోసం వచ్చినట్లు వివిరించారు. రేషన్‌కార్డులకు సంబంధించి ఆధార్ అనుసంధానం సక్రమంగా లేదని గుర్తించి జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఓ రామారావుకు చార్జ్‌మెమో ఇవ్వాలని ఆదేశించారు.