జేసీగా కన్నబాబు
ఏలూరు :జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కూనపరెడ్డి కన్నబాబు నియమితులయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కర్నూలు జేసీగా పనిచేస్తున్న కన్నబాబు బదిలీపై ఇక్కడకు రానున్నారు. ప్రస్తుత జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వుడా) వైస్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ఆయన గతంలో శ్రీకాకుళం అదనపు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై 2011 డిసెంబర్ 5న జేసీగా ఇక్కడకు బదిలీపై వచ్చారు. మూడేళ్లకుపైగా ఇక్కడ పనిచేసిన బాబూరావునాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు, పౌర సరఫరాల వ్యవస్థను గాడిన పెట్టేందుకు విశేషంగా కృషి చేశారు. ప్రతినెలా 2వ తేదీన ‘నా రేషన్’ కార్యక్రమం నిర్వహించడం ద్వారా రేషన్ కార్డుదారుల సమస్యలను పరిష్కరించారు. ఏజెన్సీ ప్రాంతంలో భూ వివాదాల పరిష్కారంలోనూ కీలక భూమిక పోషించారు.
కన్నబాబుకు ఏడేళ్ల అనుబంధం
జేసీగా నియమితులైన కూనపురెడ్డి కన్నబాబు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. గ్రూప్-1 ఉత్తీర్ణులైన ఆయన 1997 జూలై 14న నరసాపురం ఆర్డీవోగా నియమితులయ్యారు. ఆర్డీవోగా ఐదేళ్లకు పైగా సమర్థవంతమైన సేవలం దించారు. రబీలో నీటి ఎద్దడి తలెత్తినప్పుడు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించి రెండో పంటకు సక్రమంగా నీరందించడం ద్వారా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందారు. 2002 మే 29న డీఆర్‌డీఏ పీడీగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండేళ్లపాటు పనిచేసి విశాఖపట్నం డీఆర్‌డీఏ పీడీగా పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితి తరపున డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చీఫ్ కో-ఆర్డినేటర్‌గా, అనంతరం హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వట్టి వసంత్‌కుమార్‌కు ఓఎస్‌డీగా వ్యవహరించారు. 2012లో ఐఏఎస్ హోదా పొందిన కన్నబాబు అదే ఏడాది నవంబర్ 30న కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు.