సంతృప్తిగా పనిచేశా..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో దాదాపు రెండేళ్లు సంతృప్తికరంగా విధులు నిర్వహించాను. దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కరించటం నా ఉద్యోగ జీవితంలో మరిచిపోలేని అనుభూతి. జిల్లాలో పనిచేసిన కాలం ఓ మధురస్మృతిగా నిలిచిపోతుంది. ఖమ్మం నాకెన్నో పాలనానుభవాలు నేర్పింది..’ అని జిల్లా జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ పేర్కొన్నారు. జిల్లా నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన ఆయన సోమవారం ‘సాక్షి’ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
మంచి జిల్లాలో ఉద్యోగం చేయాలని...
ప్రజలకు సేవ చేయాలంటే మంచి జిల్లాలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. ఖమ్మం జిల్లాలో పని చేయడంతో ఆ ఆకాంక్ష నేరవేరింది. జిల్లాలో పని చేయడం ఆనందంగా ఉంది. నా 13 ఏళ్ళ సర్వీస్‌లో రెండేళ్లు పూర్తిస్థాయిలో ఇక్కడ పనిచేయటం సంతృప్తిగా ఉంది. ప్రజా ప్రతినిధు లు అధికారులు, ఉద్యోగుల సహకారం మరువలేనిది. చైతన్యానికి జిల్లా మారుపేరు. ఒకవైపు ఏజెన్సీ, మరోవైపు నదులు, ఖనిజం, అటవీసంపద, పలురకాల వృత్తులు, ప్రవృత్తుల మేళవింపు మన జిల్లా. 1996లో సర్వీస్‌లో జాయిన్ అయ్యా ను. అందరి సహకారంతో 100 శాతం పని చేశా. నేను చాలా అదృష్టవంతుడుని.. ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఉద్యోగం సజావుగా సాగింది.
భూ సమస్యలు...
భూ సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని ముందుగానే భావించా. అనేక ఏళ్లుగా పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించా. జంగ్ సిపాయి భూములను నిబంధనల ప్రకారం అర్హులకు అందించాను. జిల్లా వ్యాప్తంగా 7 వ విడత అసైన్‌మెంట్ కింద మూడు నెలల్లో ఏడుగురికి 15 వేల ఎకరాలకు పట్టాలు, పహణీలు అందించాం. ఇందుకోసం గిరిజనులు, గిరినేతరులకు అవగహన కల్పించి భూముల సర్వే చేపట్టాం. డిజిటల్ సర్వే యంత్రాలతో ఈ ప్రక్రియను వేగవంతం చేసి సక్సెస్ అయ్యాం.
మీసేవ...
గతంలో మీసేవ కేంద్రాలలో 20 సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాటిని 250 సర్వీసులకు చేర్చాం. మీసేవా కేంద్రాలు సజావుగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులైన వీఆర్వో నుంచి తహశీల్దార్ వరకు కంప్యూటర్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మీసేవలో పహణీల విషయంలో కొంత మేర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని నిరోధించేందుకు తహశీల్దార్‌లకు అవగహన కల్పించాం.
అక్రమ పహణీలను అరికట్టాం. తహశీల్దార్ల బాధ్యత పెరిగింది. ల్యాండ్ సర్వే కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. రికార్డులను భద్రపరిచేందుకు అత్యాధునిక రికార్డురూమ్‌ను ఏర్పాటు చేశాం. టెక్నాలజీ వాడకంపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం, భద్రాచలంలో రూ.20 లక్షలతో ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేశాం. రికార్డుల భద్రతకు అత్యాధునిక రూం నెలకొల్పాం.
‘ఆధార్’తోనే అన్నీ..
ఆధార్ అనుసంధానంతో అనేక అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఆధార్ అనుసంధానంలో జిల్లా 3వ స్థానంలో ఉంది. జిల్లాలో 98 శాతం ఆధార్ నమోదు పూర్తయింది. ఏజెన్సీ ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్ళకుండా వారి చెంతనే ఆధార్ అందించే ప్రకియ చేపట్టి విజయవంతం అయ్యాం. సివిల్ సప్లైలో ఆధార్ అనుసంధానంతో అక్రమంగా ఉన్న 50 వేల తెల్లరేషన్‌కార్డులను తొలగించాం.
నెలకు 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా చేశాం. ఆధార్ వల్ల గ్యాస్‌కనెక్షన్ లబ్ధిదారులను గుర్తించి కిరోసిన్ కోటానూ ఆదా చేశాం. గ్యాస్‌తో పాటు కిరోసిన్ పొందుతున్న వారిని అదుపు చేయడం వల్ల రూ.50 లక్షలు ఆదా అయ్యాయి.
నిర్వాసితులకు న్యాయమే చేశాం
భూ నిర్వాసితులకు అప్పటి విలువ ప్రకారం న్యాయమే జరిగింది. ప్రజలు అంగీకరించిన తరువాత మాత్రమే మేము ఫైల్స్ పని ప్రారంభించాం. అప్పటి విలువ ప్రకారం కొమ్మేపల్లిలో రూ.5 లక్షలు, కిష్టారంలో రూ.6 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రజలు తొలుత అంగీకరించి తర్వాత నిరాకరించారు. అప్పటికే గడువు రెండు సంవత్సరాలు ఉంది. చివరి సమయంలో ల్యాప్సయ్యే అవకాశం ఉండటంతో దానిని అమలు చేశాం. ఒప్పందం ప్రకారం ఎవరూ ముందుకు రాని సమయంలో సెక్షన్ 31 ప్రకారం కోర్టులో రూ.20 కోట్లు డిపాజిట్ చేశాం. కేసు జిల్లా జడ్జి కోర్టులో ఉంది.
విద్యుత్ ప్రాజెక్టుల్లో..
జిల్లాలో నీరు, బొగ్గు, భూమి, రవాణావ్యవస్థ అనుకూలంగా ఉం డటంతో కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, అశ్వాపురంల్లో థర్మల్ పవర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. ఏడో దశ విస్తరణలో భాగంగా ఇప్పటికే పాల్వంచలో మరో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. మణుగూరులో 1031 ఎకరాల్లో 1080 మెగావాట్ల ప్రాజెక్టు, అశ్వాపురంలో 1300 ఎకరాల్లో 1600 మెగావాట్ల ప్రాజెక్టు, కొత్తగూడెంలో 3000 ఎకరాల్లో 4000 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించే పనులు కొనసాగుతున్నాయి.
అర్హులందరికీ ఆహారభద్రత..
జిల్లాలో అర్హులందరికీ ఆహారభద్రత అందించటమే లక్ష్యంగా పనిచేశాం. ఇప్పటికే 6,50,000 కార్డుల వివరాలు కంప్యూటరీకరించాం. ఇంకా 50వేల మంది వివ రాలు నమోదు చేయాలి. ఈ నెల 16 నుంచి అర్హులైన కుటుంబాలకు పూర్తిస్థాయిలో రేషన్ అందించేందుకు చర్యలు చేపట్టాం. గతంలో రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేశాం. ఇక నుంచి రేషన్ అర్హులకు మాత్రమే అందుతుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పాలని అనుకున్నాను.
అది పూర్తిస్థాయిలో అమలైంది. మొదట 30 స్కూల్స్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ ప్రారంభించాం. ఇప్పుడు 250 పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. 25 వేల మంది విద్యార్థులకు రూపాయి ఖర్చు లేకుండా మూడునెలల్లో కోర్సు పూర్తి చేశాం. తరువాత హైదరాబాద్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటా. జిల్లాలో జమాబందీని అమలు చేయలేకపోయాం. గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల వివరాలు పంచాయతీ కార్యాలయం గోడలపై రాయిస్తున్నాం.